సాంకేతికత అందరికీ అందుబాటులో వస్తోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత ఇది మరింత సులువైంది. ఏ చిన్న సందర్భం అయినా ఫొటోలో బంధించేస్తున్నాం. ప్రత్యేక సందర్భాలనైతే చెప్పక్కర్లేదు. ఫొటోలతో పాటు, వీడియోలు తీసుకుని భద్రపరుచుకుంటున్నాం. వీటి కోసం ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్లను, ఫొటోగ్రాఫర్లను పిలవాల్సిన అవసరమే లేదు. మన స్మార్ట్‌ఫోన్ ద్వారానే సాధ్యమవుతోంది. ఇదే కోవలో మన ఫోన్, కంప్యూటర్లోని యాప్స్ పని తీరును లేదా ఇంకేదైనా వివరాలను వీడియో రూపంలో ఎవరికైనా పంపాలంటే ఎలా.. అంటే.. ఇందుకు స్క్రీన్ రికార్డర్ పనిచేస్తుంది. అది ఎలా పని చేస్తుంది.. ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం..
ఈ మధ్య కాలంలో స్మార్ట్ఫోన్లలో కనిపిస్తున్న ఫీచర్.. స్క్రీన్ రికార్డింగ్.. సాధారణంగా మనం వీడియోలు కెమెరాతో, స్మార్ట్ఫోన్లతో తీస్తుంటాం. తీసిన వాటిని అందంగా తీర్చిదిద్దేందుకు సాఫ్ట్వేర్ సాయంతో ఎడిట్ చేసి, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి వాటి ద్వారా అందరికీ షేర్ చేస్తుంటాం. ప్రస్తుతం యూట్యూబ్‌లో అనేక రకాల వీడియోలుంటున్నాయి. తీసిన వీడియోను వైవిధ్యంగా చేసినట్టే, మన స్మార్ట్ పోన్ స్క్రీన్‌ను కూడా రికార్డ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇలా చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌ల స్క్రీన్లపై మనం ఇచ్చే కమాండ్స్‌ను తద్వాదా ఏర్పడే స్టెప్స్‌ను రికార్డ్ చేయవచ్చు. ఉదాహరణకు ఏదైనా యాప్ ఏ విధంగా పని చేస్తుంది, దానిని ఎలా ఉపయోగించాలి అనే విషయం ఎవరికైనా తెలియజేయాలంటే.. ఈ స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసి యాప్ పని తీరును వీడియో తీసి, పంపాలనుకున్న వారికి పంపవచ్చు. ఇందుకోసం స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఉపయోగాలు
స్క్రీన్ రికార్డర్ ద్వారా అనేక ఉపయోగాలున్నాయి. సాధారణంగా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ గురించి ఎవరికైనా చెప్పాలనుకుంటే టెక్ట్స్ ద్వారా లేదా ఫోన్లో వాయిస్ కాల్ ద్వారా వివరిస్తాం. కొన్ని సందర్భాలలో అది పూర్తి స్థాయిలో అర్థం అవ్వకపోవచ్చు. గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. అదే స్క్రీన్ రికార్డర్ ద్వారా చెప్పాలనుకున్న విషయాన్ని వీడియో తీసి పంపిస్తే, స్పష్టంగా అర్థం అవుతుంది. సాంకేతికపరమైన అంశాలను, మనకు తెలిసిన కొత్త అంశాలను వీడియోల రూపంలో అందరితో పంచుకునే వీలుంటుంది. ఎక్కువ శాతం ఆన్లైన్లో అందుబాటులో ఉండే వెబ్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన పనిలేదు. ముందుగా మొబైల్, పీసీల్లో గాని జావా సాఫ్ట్వేర్ ఉండి ఉండాలి. వీటిల్లో ఎక్కువగా వీడియోను ఐదు నిమిషాల వరకు మాత్రమే రికార్డ్ చేసే వెసులుబాటు ఉంటుంది.
అందుబాటులోని సాఫ్ట్వేర్స్
ఏదైనా గేమ్ ఆడడం, ఒక సాఫ్ట్వేర్ పనితీరును వివరించడం వంటివి చేయడం అంటే మొత్తం స్క్రీన్‌పైనే జరుగుతుంటాయి. ఈ ప్రక్రియను ప్రాక్టికల్‌గా చేసి చూపించాలంటే ప్రత్యేకించి సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఉచితంగా అందుబాటులో ఉంటే, మరికొన్ని డబ్బులు చెల్లించుకోవాల్సినవి ఉన్నాయి. ఉచితంగా లభించే వాటిని తీసుకుంటే డబ్బు ఆదా అవుతుంది. అందులో ఫ్రీ కామ్, ఐస్‌క్రీం, స్క్రీనర్, డివిడి వీడియో సాఫ్ట్స్ ఫ్రీ స్క్రీన్ రికార్డర్, షేర్ ఎక్స్, కామ్ స్టూడియో, ఏజ్వీడ్, క్రూట్ కంప్యూటర్ రికార్డర్ వంటి వాటితో పాటు మరికొన్ని ఉన్నాయి. డబ్బులు చెల్లించి పొందే వాటిలో కామ్టేసియా స్టూడియో, మాడ్కాప్, మిమిక్, ఫ్లాష్‌బ్యాక్, టినీ టేక్, స్క్రీన్‌కాస్ట్ ఓ మాటిక్ వంటివి చెప్పవచ్చు. ఇలా కొని ఉపయోగించే సాఫ్ట్వేర్లలో అదనపు ఫీచర్లు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు. అలాంటి ఆప్షన్లు కూడా ఇందులో ఉంటుంటాయి. డబ్బులు చెల్లించే దానిని బట్టి ఉపయోగించే కంప్యూటర్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. నెట్ కనెక్షన్ ప్లాన్స్ మాదిరిగానే నెలకు, సంవత్సరానికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇక మొబైల్స్ విషయానికి వస్తే కొన్ని రకాల మొబైళ్ళలో ఈ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. లేని వాటికి మోడల్‌ను బట్టి సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకుని రన్ చేసుకోవచ్చు.
క్రూట్ కంప్యూటర్
దీనిని ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జావా ఆధారంగా మాత్రమే రన్ అయ్యే సాఫ్ట్వేర్. ఆడియో, వీడియోలు రికార్డ్ చేయవచ్చు. ట్యుటోరియల్ వీడియోలు చేసేందుకు చాలా అనువుగా ఉంటుంది. https://sourceforge.net/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏజ్వీడ్ : ఇందులో స్క్రీన్‌ను రికార్డ్ చేసి ఎడిట్ చేసే వెసులుబాటు ఉంటుంది. రికార్డింగ్స్‌ను వేరు చేయడం, వేరే క్లిప్పింగ్స్‌ను కలపడం, ఏదైనా ఎఫెక్ట్స్‌తో సైడ్ షోలను చేసే అవకాశం ఉంటుంది. ఉపయోగించేందుకు సులువుగానూ ఉంటుంది. దీని నుంచి వీడియోలు యూట్యూబ్‌కు అప్లోడ్ చేయవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏజ్వీడ్.కామ్ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కేమ్ స్డూడియో : స్క్రీన్ రికార్డింగ్‌కు సంబంధించి ఇది బాగా పని చేస్తుంది. ఎక్కువ ఉపయోగంలో ఉన్నదని చెప్పవచ్చు. ఇందులో అనేక రకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రికార్డింగ్స్‌లో వద్దనుకున్న దాన్ని తొలగించవచ్చు. కావాలనుకున్న క్లిప్స్‌ను కలుపుకోవచ్చు. మౌస్ కర్సర్ కనపడాలనుకుంటే ఎనేబుల్ చేయవచ్చు.. వద్దనుకుంటే డిజేబుల్ చేయవచ్చు.
డివిడి వీడియో సాఫ్ట్స్ ఫ్రీ స్క్రీన్ రికార్డర్ : ఇందులో స్క్రీన్‌ను మొదట క్యాప్చూర్ చేయాలి. తర్వాత రికార్డ్ చేయాలి. ఇందులోనూ ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది. అంతేకాదు దీనిలో వీడియోకు డేట్, టైం కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అవసరానికి తగినట్టుగా కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వీడియో, ఆడియో రికార్డింగ్‌లు చేసుకోవచ్చు.
Authorization