నిత్యావసరాలలో సెల్‌ఫోన్ ఒక భాగమైపోయింది. వినియోగదారులను ఆకర్షించేలా
రోజురోజుకు మొబైల్ మోడల్స్ పెరుగుతున్నాయి. వీటికి తగినట్టు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. పెద్ద స్క్రీన్లు ఉంటున్నాయి. అయితే అందుకు తగినట్టు కావాల్సింది డిస్ప్లే.. కొన్ని ఫోన్లలో డిస్ప్లే రిచ్‌గా కనిపిస్తే, మరికొన్నింటిలో అంతగా ఆకర్షణ లేనట్టుగా ఉంటుంది. నిశితంగా పరిశీలిస్తే రంగుల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఫొటో, వీడియోల్లో ఈ తేడాల్లో గమనించవచ్చు. అయితే అన్నీ సార్ట్‌ఫోన్లే కదా..! మరి ఎందుకీ తేడాలు వస్తున్నాయి. రంగుల్లో తేడాలు గుర్తించడం ఎలా, అసలు ఎలాంటి రంగులు ఉంటే సహజ సిద్ధంగా ఉన్నట్లో తెలుసుకుందాం..
ఒకప్పుడు కేవలం కాల్స్ మాట్లాడడానికి, మెసేజ్‌లు పంపుకోవడానికి మాత్రమే ఉపయోగించే ఫోన్లుండేవి. అనేక సాంకేతిక మార్పులు చోటుచేసుకున్న క్రమంలో కెమెరాలు వచ్చాయి. ఫొటోలకు ఉపయోగించిన ఫోన్లు చిన్న చిన్న వీడియోలు తీయగలిగేలా మారాయి. వాటి తర్వాత టచ్ ఫోన్లు వచ్చాయి. తర్వాత్తర్వాత ఫీచర్లలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటితో పాటు ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటున్నాయి. ఇదే బాటలో ట్యాబ్‌లు కూడా సరికొత్త ఫీచర్లతో తక్కువ ధరలతో అందుబాటులో ఉంటున్నాయి. డిస్ప్లే సైజుల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద పెద్ద డిస్ప్లే ఉన్న ఫోన్లకు డిమాండ్ కూడా బాగానే ఉంది. అందుకే తయారీదారులు వినియోగదారులకు కావాల్సిన ఫీచర్లతో ఫోన్లను తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు, ఇపుడొస్తున్న స్మార్ట్ఫోన్లు అధునాతన పరికరాలు.. ఎందుకంటే, బయటకు వెళ్ళి చేయగలిగిన ఎన్నో రకాల పనులు స్మార్ట్ ఫోన్లలోనే చేసుకోగలుగుతున్నాం. అయితే కొన్ని ఫోన్లలో డిస్ప్లే కలర్ఫుల్గా ఉంటే, మరికొన్నింటిలో డిమ్‌గా ఉంటుంది. ఒకే కంపెనీకి సంబంధించినవి వాటిలో ఈ తేడా పెద్దగా కనపడకపోవచ్చు కానీ వేర్వేరు కంపెనీల ఫోన్లను పక్కపక్కన పెట్టి పరిశీలిస్తే తేడా సులువుగా గమనించవచ్చు. ఫొటో షాప్ ఉపయోగించే వారికి కలర్లలో తేడా సులువుగా అర్థమవుతుంది. రంగుల నాణ్యతలో తేడా ఉంటుంది. అవెలా ఉంటాయో పరిశీలించడం ముఖ్యం.
తేడాలు..
గతంలో వాడిన ఫోన్ల కంటే ప్రస్తుతం వస్తున్న కలర్లలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంతకు ముందు ఒకే రకం కలర్స్పేస్ను ఉపయోగిస్తే, పెరుగుతున్న పోటీ ప్రపంచంలో తట్టుకునేందుకు పలు రకాల కలర్ ప్రొఫైళ్ళను అందుబాటులోకి తయారీదారులు తీసుకువచ్చారు. సాధారణంగా మనకు తెలిసిన ప్రాథమిక రంగులు రెడ్, గ్రీన్, బ్లూ. వీటిని ఆర్జీబీ అంటారు. తర్వాత పరిగణలోకి తీసుకునేది ఎస్ఆర్జీబీ.. అంటే, స్టాండర్డ్ రెడ్ గ్రీన్ బ్లూ, ఫొటో షాప్ తెలిసిన వారు రంగులను సీఎంవైకె (సీయాన్,మెజెంటా,యెల్లో, బ్లాక్) లలోనూ ఉపయోగిస్తారు. వీటితో పాటు మరి కొన్ని కలర్స్పేస్లు ఉపయోగంలో ఉన్నాయి. ఏదైనా కలర్స్పేస్ని ఉపయోగించేపుడు అందులో ఎన్ని వేల షేడ్స్ ఉన్నాయనే దాన్ని కలర్ గామట్ అని పిలుస్తారు. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉపయోగించే డీసీపీ పీ3 కలర్స్పేస్ అందులోని అన్ని రంగులను చూపిస్తుందన్న నమ్మకం లేదు. ఇలాంటి వాటికి డిస్ప్లే టైప్ కీలకం. డీసీపీ పీ3 సపోర్ట్ చేసే ఎల్సీడీ డిస్ప్లే ఫోన్ కన్నా, అదే కలర్ సపోర్ట్ చేసే ఓఎల్ఈడీ డిస్ప్లే ఫోన్ ఎక్కువ రంగులు చూపిస్తుంది. కొన్ని మొబైల్ తయారీ కంపెనీలు వివిధ కలర్ ప్రొఫైల్స్‌ను అందిస్తున్నాయి. వీటిని ఎంచుకునే దాన్ని బట్టి డిస్ప్లే కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది. ఇవి ఒక్కో ఫోన్‌కు ఒక్కోలా ఉంటాయి.
నాటికి నేటికి..
కలర్ స్పేస్‌కు సంబంధించి మార్పులు తెలుసుకోవాలంటే, ఆండ్రాయిడ్ వర్షెన్స్లలో ఓరియోకి ముందు, తర్వాత అని పరిశీలించుకోవాలి. ఓరియోకు ముందున్న ఫోన్లలో పసుపు రంగు ఎక్కువగా ఉండేది. ఇవి శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ 6, 7నోట్ 5,7 లలో పరిశీలించవచ్చు. ఈ ఫోన్లో ఫొటోలు తీసినపుడు కూడా ఇది స్పష్టంగా ఏర్పడుతుంది. అందుకే కలర్ కాలిబ్రేషన్, కలర్ స్పేస్ డీఫాల్ట్ వేల్యూలను మార్పు చేస్తూ స్క్రీన్ మీద రంగులు రిచ్‌గా కనిపించేలా తయారీదారులు ప్రయత్నాలు చేసేవారు. కొన్నిసార్లు ఇందులో విఫలమయ్యారు కూడానూ. ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్స్ తర్వాత వచ్చిన ఫోన్లలో సహజ సిద్ధమైన రంగులు కనిపిస్తున్నాయి. అయితే ఓరియోకి ముందు సోషల్ నెట్వర్క్ సైట్లు ఎస్ఆర్జీబీ కలర్ స్పేస్‌ను మాత్రమే వాడుతుండేవి. డీసీఐ పీ3 అందుబాటులోకి వచ్చాక కూడా ఎస్ఆర్జీబీనే ఉపయోగిస్తున్నవి. ఇందుకు కారణం తక్కువ కెపాసిటీ ఉన్న గ్రాఫిక్స్ ప్రాసెసర్‌తో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో లభిస్తుండడమే. అలాంటి వాటిలో డీసీపీ పీ3 కలర్స్పేస్ సరిగా పనిచేయదు. బ్యాటరీ, ఫోన్ మీదా ప్రభావం పడుతుంది.
ఎంపిక..
మనం ఉపయోగించే స్మార్ట్ఫోన్ల స్క్రీన్ పరిమాణం గతంలో కంటే పెరిగింది. ఫోన్లో రంగులు సహజ సిద్ధంగా కనిపిస్తున్నాయన్నది మూడు ప్రధానాంశాల మీద ఆధారపడి ఉంటుంది. డిస్ప్లేలో పొందుపరిచిన ఎల్సీడీ, ఓఎల్ఈడీలు. ఓఎల్ఈడీ డిస్ప్లేలు ఎక్కువ రంగులను చూపిస్తాయి. తర్వాత స్థానంలో కలర్స్పేస్,కలర్ గామట్లు. మనం ఎంచుకునే కలర్ స్పేస్‌ను బట్టి మన ఫోన్ మిగతా వాటితో పోలిస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. మనం ఎంచుకునే రంగులు రిచ్‌గా ఉండాలా.. సహజసిద్ధంగా ఉండాలనేది మన నిర్ణయం. ఇందుకు కలర్ మేనేజ్మెంట్ను ఎంచుకోవడం కూడా చాలా అవసరం. డిజైనింగ్, ప్రింటింగ్ వంటి విభాగాలలో ఉన్న వారు సహజసిద్ధమైన రంగులను చూసేందుకు ఇష్టపడతారు. కొద్దిగా ఫోన్ రిచ్‌గా కనిపించాలనుకుంటే భిన్నమైన కలర్స్పేస్ను ఎంపికచేసుకోవచ్చు. అందువల్ల మనం రోజు వాడే స్క్రీనే అయినా దీని వెనుక పెద్ద సాంకేతికతే ఉంది.
Authorization