కంప్యూటర్లు ప్రారంభ సమయంలో ఒక గదిలో పెట్టేంత పెద్దవిగా ఉండేవి. రానురాను వాటి పరిమాణంలో మార్పులు చోటుచేసుకుంటూ ఒక టేబుల్ మీద పెట్టే వరకు వచ్చాయి. ఆధునిక సాంకేతికతతో కొత్త పుంతలు తొక్కుతూ ఆకృతిలో, పరిమాణంలో, ఫీచర్లలో అనేక రకాల మార్పులు చేసుకుంటూ వచ్చాయి. ఇలా వినియోగంలోకి వచ్చిన కంప్యూటర్లు ప్రస్తుతం నిత్యావసరాలలో భాగాలుగా ఉంటున్నాయి. పాఠశాలలో చిన్న పిల్లలకు కూడా అవగాహన కల్పిస్తున్నారంటే.. వీటి వినియోగం ఏ పాటిదో చెప్పనక్కర్లేదు. వాడే ప్రతి వస్తువుకు రిపేర్ తప్పనిసరి. కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఇందుకు అతీతమేమీ కాదు. కాకుంటే చిన్న చిన్న సమస్యలు మనం ఇంటి వద్దే పరిష్కరించుకోవచ్చు. అవేంటో, సమస్య ఏర్పడినపుడు ఏం చేయాలో తెలుసుకుందాం.
ఒక దశాబ్దం క్రితం వరకు కంప్యూటర్ తెలుసు అంటే అదొక గొప్ప విషయం అనే భావన ఉండేది. ఆ పరిస్థితి నుంచి నేడు వ్యక్తిగతంగా కంప్యూటర్లు వాడే వరకు వచ్చింది. రోజురోజుకు విస్తరిస్తున్న కంప్యూటర్ల వినియోగంలో గాడ్జెట్లలో ల్యాప్‌ట్యాప్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ పరికరాలు వినియోగం అయినంత వరకు బాగానే ఉంటుంది. ఏదైనా చిన్న సమస్యతో మొరాయించినా గందరగోళంలో పడిపోతుంటాం. ఇందుకోసం కంప్యూటర్ సర్వీసింగ్ చాలా అవసరం. కొన్ని చిన్నపాటి రిపేర్లతో పరిష్కారమవుతుంటాయి. కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్ ఏదైనా సరే నిర్వహణ ఆలస్యం చేయకూడదు. సమయం గడిచేకొద్ది హ్యాంగ్ అవడం, హార్డ్ డిస్క్‌లో సమస్యలు, ఎక్కువగా వేడెక్కడం, బూటింగ్, బ్యాటరీ డ్రైనింగ్ వంటివి ఏర్పడుతుంటాయి. సమస్య తలెత్తినపుడు కంగారు పడిపోయి రిపేర్‌కు ఇస్తుంటాం. అలా కాకుండా ఉత్పన్నమైన సమస్య ఏంటో, దేనికి ఎలాంటి పరిష్కారం చేయవచ్చొ తెలుసుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయి. అవేంటో చూద్దాం.
హ్యాంగింగ్..
పీసీ పనితీరు మందగించడం సర్వసాధారణమే. పాత వాటిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ర్యామ్ అవసరానికి సరిపోనూ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కంప్యూటర్లలో ర్యామ్ చాలా కీలకం. సీపీయూ మెమోరీని నిరంతరం ఉపయోగించుకుంటుంది కనుక ర్యామ్‌ను ప్రాసెసర్‌కు సరిపడేలా ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల హ్యాంగింగ్ సమస్యను తప్పించుకోవచ్చు.
అజాగ్రత్త వల్ల..
పనిలో భాగంగా ల్యాప్‌ట్యాప్ ముందు కూర్చుని కాఫీ, టీ, జ్యూస్, వాటర్ వంటివి తాగుతుంటాం. అనుకోకుండా ఆ లిక్విడ్ దాని మీద పడిపోతుంటుంది. అందుకు నిరుత్సాహపడనవసరం లేదు. లిక్విడ్ల వల్ల మొరాయించిన ల్యాప్‌ట్యాప్‌ను సులువుగానే సరిచేసుకోవచ్చు. ఇందుకు కొన్ని చిన్నపాటి పనులు చేయాల్సి ఉంటుంది. ముందు ల్యాప్‌ట్యాప్‌ను షడ్డౌన్ చేయాలి. పవర్ కేబుల్‌ను తొలగించాలి. పేపర్, స్పాంజ్, టిష్యూ వంటి వాటితో కనిపించినంత మేర సాధ్యమైనంత మేర లిక్విడ్ డ్రాప్ కూడా లేకుండా శుభ్రం చేయాలి. తుడవడంలో నిర్లక్ష్యం వహించకూడదు. దీని వల్ల చుట్టుపక్కల వ్యాపించే ప్రమాదం ఉంది. హెయిర్ డ్రయర్‌తో ఆరబెట్టిన తర్వాత భాగాలన్నింటినీ అసెంబుల్ చేయాలి. ఎక్కువ శాతం ల్యాప్‌ట్యాప్ ఆన్ అవుతుంది. కాకుంటే సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిందే.
బ్యాటరీ డ్రైన్..
ల్యాప్‌ట్యాప్‌లలో ఉత్పన్పమయ్యే ఒక సమస్య బ్యాటరీ బ్యాకప్.. వినియోగిస్తున్న కొద్దీ ల్యాప్‌ట్యాప్‌లోని బ్యాటరీ సెల్స్ పని మందగిస్తుంటుంది. తద్వారా బ్యాకప్ తగ్గిపోతుంది. ఇందుకు బ్యాటరీలను రిపేర్ చేయించుకోవాలి. అలాగే వదిలిస్తే సమస్య మరింత జటిలమవుతుంది. బ్యాటరీలను ఎంపిక చేసుకునేపుడే మన్నిక కలిగిన బ్యాటరీలను ఎంచుకోవాలి. ఖర్చు గురించి ఆలోచించకూడదు.
ఓవర్‌హీట్..
ప్రస్తుతం మార్కెట్లో స్లిమ్ ఆకారంలో ఉండే ల్యాప్‌ట్యాప్‌లు ఉంటున్నాయి. వీటితో పాటు హై రిజల్యూషన్, ఫాస్ట్ ప్రాసెసర్, హై అండ్ గ్రాఫిక్ కార్డ్స్ వంటి ఆధునిక ఫీచర్లు కలిగినవి అందుబాటులో ఉంటున్నాయి. వీటి పనితీరు బాగానే ఉంటుంది. కానీ ఇలాంటివి ల్యాప్‌ట్యాప్‌లో సర్వసాధారణంగా ఎదురయ్యే ఓవర్ హీట్‌తో హార్డ్‌వేర్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంటుంది. ల్యాప్‌ట్యాప్‌లో కూలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడమే. ఓవర్ హీట్‌ను తగ్గించేందుకు ల్యాప్‌ట్యాప్‌లోని ఫ్యాన్ తోడ్పడుతుంది. ఇలా పనిచేస్తున్న క్రమంలో దుమ్ము ధూళి అందులో చేరుతుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్ చుట్టుపక్కల దుమ్మును శుభ్రం చేస్తే ఈ సమస్య త్వరగా ఉత్పన్నం కాదు. ఫ్యాన్ శుభ్రం చేసేపుడు ల్యాప్‌ట్యాప్ షట్‌డౌన్ చేసుకోవాలి. దుమ్మును పూర్తిగా శుభ్రం చేయాలంటే వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగిస్తే బాగుంటుంది. ల్యాప్‌ట్యాప్‌ను చదునుగా ఉండే టేబుల్‌పై ఉంచితే కూల్‌గా ఉంటాయి. వీటి కోసం డిజైన్ చేసిన స్టాండ్స్ మార్కెట్లో ఉంటున్నాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు ల్యాప్‌ట్యాప్ పనిచేయకుండా పోయే ప్రమాదం కూడా ఉంది.
శబ్దాలు..
కంప్యూటర్ను వాడేకొద్ది కొన్ని రకాల శబ్దాలు ఫ్యాన్ నుంచి అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. ఫ్యాన్‌కు ఏర్పడే దుమ్మను శుభ్రం చేయకపోవడం వల్ల సమస్య ఏర్పడుతుంది. ఫ్యాన్‌కు కేస్‌కు మధ్య ఫోమ్‌ను ఉంచడం వల్ల సమస్యను పరిష్కరించవచ్చు. ఇక ల్యాప్‌ట్యాప్ మదర్‌బోర్డు నుంచి కూడా శబ్దాలు వెలువడుతుంటాయి. అంటే ల్యాప్‌ట్యాప్ మదర్‌బోర్డు ప్రమాదంలో పడినట్టు భావించాలి. సర్వీస్ సెంటర్‌కు వెళ్ళి సమస్యను పరిష్కరించుకోక తప్పదు.
హార్డ్ డిస్క్ ఫెయిల్..
కంప్యూటర్లలో మనకు సంబంధించిన డేటా అంతా స్టోర్ చేసుకుంటుంటాం. ఒక వేళ ఆ డిస్క్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? డేటా మొత్తం డిలీట్ అయిపోయే ప్రమాదం లేకపోలేదు. డేటా రికవరీ చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. హార్డ్ డిస్క్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో చెప్పడం కష్టమే. డేటా కరెప్ట్ అవుతుండడం, హానికలిగించే సెక్టార్స్ చేరడం, ఫ్రీజ్ అవడం వంటి సమస్యలు తలెత్తుతుంటే, హార్డ్ డిస్క్‌కు ముప్పు వాటిల్లుతోందని అర్థం చేసుకోవాలి. సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
స్పీడ్ కోసం..
కంప్యూటర్ కేస్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటే పని తీరు మెరుగుపడుతుంది. క్లీనింగ్‌లో నిర్లక్ష్యం వహిస్తే కొద్దికొద్దిగా గాలి ప్రసరణ తగ్గి పనితీరు మందగిస్తుంది. మౌస్కూ క్లీనింగ్ అవసరం. చేతికి ఉండే చెమట, దుమ్ము బటన్స్లోకి చేరి పనితీరును దెబ్బతీస్తాయి.
ఇలా తరచూ ఏర్పడే చిన్న చిన్న సమస్యలను సాధ్యమైనంత మేర నిర్లక్ష్యం చేయకుండా మనమే రిపేర్ చేసుకుంటే మంచిది.
Authorization