1).నక్షత్రాలకు రంగులు ఉంటాయా? పగటి పూట నక్షత్రాలు ఎందుకు కన్పించవు ?
నక్షత్రాలకు రంగులు ఉంటాయి. ఆయా నక్షత్రాల్లో ఉండే పదార్థాలు రసాయనిక స్వభావాన్ని బట్టి ఆ నక్షత్రాలు వెదజల్లే కాంతి రంగు ఆధారపడుతుంది. ఇది ఒక కారణం మాత్రమే. మరో ముఖ్యమైన కారణం ఆధునిక భౌతికశాస్త్రానికి చెందిన కాంటమ్ మెకానిక్స్కు సంబంధించింది. దీని ప్రకారం వేడిగా ఉన్న వస్తువు కాంతిని విడుదల చేస్తుంది. ఏ రంగు కాంతి ఎక్కువ భాగం విడుదల అవుతుందన్న విషయం ఆ వస్తువు ఉష్ణోగ్రతను బట్టి నిర్ణయించబడుతుంది. ఉష్ణోగ్రత తక్కువ ఉంటే ఎక్కువ తరంగదైర్ఘ్యం (wave Length) ఉన్న కాంతి విడుదల అవుతుంది. దీన్నే వీన్స్ డిస్ప్లేస్మెంట్ నియమం (Wein’s Displacement Law) అంటారు. దీనికి మంచి ఉదాహరణ కొలిమిలో వేడెక్కుతున్న ఇనుప వస్తువు, కమ్మరి తన కొలిమిలో పారనో, పలుగునో ఉంచి గాలి కొడ్తున్న కొద్దీ వేడి (ఉష్ణోగ్రత) ఎక్కువవుతూ ఉంటుంది. కొలిమిలో ఉన్న ఇనుప వస్తువు, క్రమంగా లేక ఎరుపు, నారింజ, పసుపు, నీలం రంగుల్లోకి మారుతూ ఉండడం మీరు గమనించి ఉంటారు. అలాగే వివిధ నక్షత్రాల ఉష్ణోగ్రతలూ వివిధ రకాలుగా ఉండడం వల్ల వివిధ కాంతుల్లో ఉంటాయి. నిజానికి నక్షత్రాలు రకరకాల రంగులు చూపడానికి మరొక కారణమూ ఉంది. తాము స్వతహాగా విడుదల చేసే రంగు ఒకటైతే మనం భూమ్మీద ఉండి చూసే రంగు మరొక రకంగా ఉండవచ్చును. విశ్వంలోని అన్ని గ్రహాలూ దూరంగా వెళ్తున్నట్లు మనకు తెలుసు. నక్షత్రాలూ మన నుంచి అతివేగంగా దూరం దూరంగా వెళ్ళిపోతున్నాయి. అలా మన నుంచి వేగంగా వెళ్ళే వస్తువు కాంతి తరంగదైర్ఘ్యాన్ని హెచ్చు తరంగదైర్ఘ్యంగా చూస్తాము. దీన్ని డాప్లర్ ఫలితం అంటారు. ఈ వేగాలు రకరకాల నక్షత్రాలకు రకరకాలుగా ఉండడం వల్ల రకరకాల రంగుల్లో కనిపిస్తాయి.
సూర్యుని కాంతితో పోలిస్తే నక్షత్రాల కాంతి భూమ్మీద తక్కువ ఉండడం వల్ల మనం నక్షత్రాల్ని చూడలేము. పట్టపగలు రోడ్డు మీద ఫర్లాంగు దూరంలో ఎవరైనా కొవ్వొత్తి వెలిగించి, పట్టుకొని ఉంటే ఆ కొవ్వొత్తి జ్యోతిని నీవు గుర్తుపట్టగవా?
2).బల్బు పగిలినప్పుడు పెద్దగా ధ్వని వస్తుంది.ఎందుకు ?
శబ్దం అంటే గాలిలో కలిగే పీడనాల మార్పు, ఒక ఊదిన బెలూన్ పగిలినపుడు టప్మనే శబ్దం ఎందుకు వస్తుంది? బెలూన్లో గాలిపీడనం బయట వాతావరణ పీడనం కన్నా ఎక్కువ. బెలూన్ పగిలినపుడు ఒక్కసారిగా గాలి ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనానికి లోనవుతుంది. అందువల్ల గాలిలో పీడన వ్యత్యాసాలు ఏర్పడతాయి. అలాగే బల్బులో అత్యల్ప స్థాయిలో జడవాయువు ఉంటుంది. అంటే బల్బులోని వాయుపీడనం బయట ఉన్న వాతావరణ పీడనం కన్నా తక్కువ ఉంటుంది. అది పగిలినపుడు బయట 'టప్' శబ్దం వాతావరణ పీడనం కన్నా అధిక పీడనంలో ఉన్న వస్తువు (బెలూన్, గ్యాస్ సిలిండర్, బాంబులు వగైరా) పగిలితే వచ్చే శబ్దాన్ని Explosion అంటారు. వాతావరణ పీడనం కన్నా తక్కువ పీడనం గల వస్తువులు (బల్బు వంటివి) పగిలితే వచ్చే శబ్దాన్ని Implosion అని అంటారు.
3).పాలను వేడిచేసి చల్లార్చితే తెట్టుగా ఎందుకు ఏర్పడుతుంది?
పాలు మిశ్రమ ఆహారము. అందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొన్ని లవణాలు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కొల్లాయిడ్ల స్థితిలో ఉంటాయి. మామూలు ఉష్ణోగ్రతలో నీటిని వేరు చేయడం కష్టం. కానీ పాలను వేడిచేసినపుడు కొవ్వు పదార్థాల బిందువులన్నీ కల్సిపోయి, పాల మీదకు వస్తాయి. ఎందుకంటే క్రొవ్వు పదార్థాలకు తక్కువ సాంద్రత ఉంటుంది. చల్లార్చినా ఆ కొవ్వులు తిరిగి పాలలోకి పోలేవు. ఆ కొవ్వు పదార్థాల తెట్టునే 'మీగడ' అంటారు.
4).ప్లాస్టిక్ చెప్పులు తొడుక్కుంటే కరెంటు షాక్ కొట్టదంటారు. ఎందుకని?
షాక్ కొట్టాలంటే శరీరం ద్వారా విద్యుత్తు కొంచెం సేపయినా ప్రయాణించాలి. విద్యుత్ తీగను ఒక చేత్తో పట్టుకొని నేల మీద చెప్పుల్లేకుండా నిలబడితే, విద్యుత్ తీగ నుంచి విద్యుత్ శరీరం ద్వారా ప్రయాణించి, నేలలోకి వెళుతుంది. కానీ ప్లాస్టిక్ చెప్పులు వేసుకొని, విద్యుత్తు తీగను పట్టుకుంటే విద్యుత్తు శరీరం ద్వారా భూమిలోకి ప్రయాణించదు. ఎందు కంటే ప్లాస్టిక్ చెప్పులు మంచి విద్యుత్ నిరోధకాలు, వాటి ద్వారా విద్యుత్ ప్రవహించదు. అందువల్ల షాక్ కొట్టదు.
- ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
email: allikayala@gmail.com
Authorization