ప్రశ్న : చేతబడి అంటే ఏమిటి? ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు కూడా ఉందని చెబుతున్నారు? అసలు చేతబడి అనేది ఉందా?
- డి.శిరీష, టి.చందన, హన్మకొండ, వరంగల్ జిల్లా
జవాబు:
బ్లాక్‌మేజిక్, చేతబడి, బాణామతి, చిల్లంగి, మంత్రాలు అన్నా, పేర్లు ఏమైనా క్రియ ఒకటే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. వాస్తవానికి అవన్నీ కల్పితాలు. ఋజువుకు నిలబడని నమ్మకాలు. మీరడిగిన ప్రశ్నలోనే చేతబడికి సమాధానం ఉంది. చేతబడి ఉందనుకోవడం ఒట్టి మూఢనమ్మకం. గ్రామాల్లో, పట్టణాల్లో చేతబడి, బాణామతి, మంత్రాలు చేస్తున్నారనే నెపంతో మూఢనమ్మకాల కారణంగా కొంతమందిని వెలి వేయడం, పండ్లూడగొట్టడం, మలమూత్రాలను తాగించడం వంటి హింసలకు గురి చేస్తున్నారు. వారిపై దాడులు, హత్యలు ఇంకా సజీవ దహనాలు కూడా సాధారణమైపోయాయి.
యావత్ ప్రపంచంతో పాటు మన దేశం కూడా సకల సాంకేతిక రంగాల్లో కంప్యూటర్ వేగంతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు ఒక వంక జరుగుతున్నాయి. అలాంటి శాస్త్ర సాంకేతిక రంగాలను, విజ్ఞాన శాస్త్రం, వైద్యశాస్త్రం ఫలితాలను అవహేళన చేసేటట్లుగా రాతి యుగం నాటి అంధ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు కొనసాగుతు న్నాయంటే ఎంత విచారకరమో ఆలోచించండి.
చేతబడి వంటి నమ్మకాల్ని అటు చదువులేని వారిలోనూ ఇటు చదువుకొన్న వారిలోనూ ఉన్నాయి. కారణమే మిటంటే వారిలో సహేతుక ఆలోచన కొరవడడమే. మూఢనమ్మకాలు నమ్మడానికి ప్రధానకారణం శాస్త్రీయ ద క్పథం లేకపోవడమే.
పిల్లలూ! మీరంతా శాస్త్రీయ దృక్పథంతో సహేతుక ఆలోచనాపరులై గ్రామీణ ప్రజానీకం దగ్గరకు ప్రజా సైన్స్‌ను ప్రచారం చేయాలి. అప్పుడు మనం మరింత అభివృద్ధి చెందుతాం. దీంతో పాటు చేతబడి, బాణామతి, మంత్రాలు మానవాతీత శక్తులు వంటి మూఢనమ్మకాల నుంచి ప్రజల్ని బయట పడేయగలం. బాణామతి, చేతబడి వంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మీరు పరిశీలించాలి. అక్కడి ప్రజలతో చర్చించాలి. వారిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి. ఆ విషయంలో హేతుబద్ధంగా ఆలోచించేటట్లు చైతన్యం తీసుకురావాలి. అలాంటి పరిస్థితి వస్తేనే సమాజం నుండి మూఢనమ్మకాలు దూరం కాగలవు. అశాస్త్రీయ సాహిత్యం సమాజంలోకి రాకుండా చూడడం మనందరి బాధ్యతగా స్వీకరించాలి.
Authorization