సోషల్ మీడియా వెబ్సైట్లలో ముఖ్యమైనది ఫేస్బుక్.. దీనికున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఎలాంటి సమాచారం కావాలన్నా, ఫేస్బుక్ ద్వారా సేకరించుకునే వెసులుబాటు ఉంది. నెటిజన్లలో అత్యధికులు ఫేస్బుక్ అకౌంట్ కలిగి ఉంటున్నారు. ఇది సైబర్ నేరగాళ్ళకు అవకాశంగా మారుతోంది. ఇలాంటి వారి నుంచి తప్పించుకోడానికి కొన్ని సెట్టింగ్స్లలో మార్పులు చేసుకోవాలి. పాస్వర్డ్ మార్చుకుంటూ ఉండాలి. అవసరాన్ని బట్టి మార్పులు చేసుకుంటూ ఉంటే అనవసరమైన వాటిని నివారించవచ్చు. ఏ సందర్భంలో ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం..
స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్బుక్ ఖాతా తప్పనిసరి అయిపోయింది. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కుటుంబ సభ్యులు ఇలా లెక్కలేనంత మంది నేస్తాలను కలిపే వేదిక కూడా ఫేస్బుక్కే.. కానీ తెలిసిన వారితో చాటింగ్ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. తెలియని వాళ్ళు, అసలు ముఖ పరిచయం లేని వాళ్ళతో చాటింగ్ ఎలాంటి పరిస్థితులకైనా దారి తీయవచ్చు. అందుకే మనకు అవసరమైన వారితోనే చాటింగ్ ఉండాలి. అలా ఉండాలంటే మన సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే అనుమతి లేనిదే ఇతరులు, ఇతర సమాచారం వచ్చి చేరకుండా ఉంటుంది. చాలా మంది ఈ విషయంపై అవగాహన లేక అనవసరమైన వాటి వల్ల ప్రైవసీ కోల్పోతుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చేయాల్సిన సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం.
సెక్యూరిటీ..
మన మొబైల్లో కాకుండా ఇంకే సిస్టమ్ మీద లేదా ఇతర మొబైల్లో లాగిన్ అయినా మెసేజ్ వచ్చేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి. లాగిన్ అయ్యాక ఎడమ వైపున ఉండే సెక్యూరిటీ అలర్ట్ సెట్టింగ్స్‌లో మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా అలర్ట్ మెసేజ్ వస్తుంది. దీని వల్ల మనమైనా ఇతరులైనా మన ఫేస్బుక్ అకౌంట్‌కు లాగిన్ అయితే వెంటనే మెసేజ్ వస్తుంది.
పాస్వర్డ్ మార్పు
ఫేస్బుక్ పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. మన వారైనా సరే ఇతరులతో షేర్ చేసుకోకూడదు. ఒక వేళ పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యాక కుడివైపున పై భాగంలో యారో సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఆప్షన్స్ వస్తాయి. అందులో పాత పాస్వర్డ్ ఎరేజ్ చేసేసి కొత్తది పెట్టుకోవాలి. పాస్వర్డ్ ఎంపిక కూడా సింపుల్‌గా ఉండేలా కాకుండా కాస్త కఠినంగా ఉండేలా.. న్యూమరికల్, ఆల్ఫాబెటికల్, సింబల్స్ వచ్చేలా మార్చుకుంటే ఇతరులు కనిపెట్టడం కాస్త కష్టంగా ఉంటుంది.
తెలియకుండా బ్రౌజింగ్
ఫేస్బుక్ చాటింగ్ చాలా మందికి ఉన్న అలవాటు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఆన్లైన్లో ఉన్న ఫ్రెండ్స్‌కు, సందర్భాన్ని బట్టి ఏదోక మెసేజ్ పెడుతూనే ఉంటుంటారు. మనం ఆన్లైన్లో ఉన్నా సరే మెసేజ్‌లు అలా వస్తూనే ఉంటాయి. మనం ఎవరికి కనిపించకుండా ఫేస్బుక్ బ్రౌజింగ్ చేసుకోవాలంటే.. కుడి వైపు కింద చక్రంలా ఉండే ఐకాన్‌ను క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. అందులో నుంచి టర్న్ ఆఫ్ చాట్ మెనూ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి.. మనం ఫేస్బుక్లో ఉన్నా ఇతరులకు కనిపించదు. చాటింగ్‌ను ఆపుకోవచ్చు. కావాలనుకున్నపుడు మళ్ళీ దానిని ఆన్‌లో పెట్టుకోవచ్చు.
ఆటో ప్లే ఆఫ్
ఫేస్బుక్లో ఉంటే కాంటాక్టుల నుంచి అనేక రకాల పోస్టులు వస్తుంటాయి. అందులో ఇమేజ్‌లు, వీడియోలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే అవ్వకుండా ఉండేందుకు వీడియోలకు ఎడమవైపు ఉన్న సెట్టింగ్స్లలో మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వీడియోలు ప్లే అవ్వకుండా ఆపే వీలుంటుంది. దీని వల్ల అన్యుల నుంచి వచ్చే వీడియోలు మనం చూడకుండా నిరోధించుకోవచ్చు.
లాగిన్ వివరాలు
అవసరాన్ని బట్టి కొన్ని సార్లు ఫేస్బుక్ అకౌంట్‌ను వేరే సిస్టమ్‌లో, లేదా ఇంటర్నెట్ సెంటర్లలో ఓపెన్ చేస్తుంటాం. లేదంటే మన అకౌంట్ మనం కాకుండా మరెవరైనా ఓపెన్ చేశారేమో తెలుసుకునేందుకు మరో సెట్టింగ్ చేసుకుంటే మంచిది. మన ఫేస్బుక్ ఇంతకు ముందు ఎక్కడ, ఎన్ని రోజుల ముందు, ఏ సమయంలో ఓపెన్ చేశామో సులువుగా తెలుసుకోవచ్చు. అందుకు చేయాల్సినది సెట్టింగ్స్‌లో 'వేర్ యూ ఆర్ లాగ్డ్ ఇన్' అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు లాగిన్ అయ్యామో వివరాలన్నీ చూపిస్తుంది. ఒక వేళ మన ఐడీ పాస్వర్డ్ అక్కడ సేవ్ అయి ఉన్నాయని అనుమానం వస్తే అందుకు సంబంధించిన వివరాలను క్లోజ్ చేయవచ్చు. ఒక వేళ ఎక్కడైనా లాగ్అవుట్ చేయడం మరిచిపోయినా ఇలా చేస్తే మన ఖాతా వివరాలు ఇతరుల చేతిల్లోకి వెళ్ళవు.
అనవసరపు పోస్టులు
ఎఫ్బీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అందులోకి రకరకాల పోస్టులు వస్తుంటాయి. వాటి వల్ల ఇబ్బందిగా ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ అందులో నచ్చని పోస్టులు ఉన్నా సరే వెంటనే డిలీట్ చేయవచ్చు. ఇందుకు చేయాల్సినది వచ్చిన మెసేజ్‌కు కుడివైపున ఉన్న యారో బటన్‌ను క్లిక్ చేస్తే, ఒక మెనూ డిస్ప్లే అవుతుంది. అందులో ఉంటే డిలీట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి.. ఆ పోస్ట్ డిలీట్ అవుతుంది. అందులోనే మన టైమ్‌లైన్‌ను సంబంధిత మెసేజ్‌లను హైడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ఆప్షన్‌నూ ఉపయోగించుకోవచ్చు.
తెలియని వారితో..
ఫేస్బుక్ అంటేనే అదో చైన్ సిస్టమ్.. మనకు ఒకరు ఫ్రెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్.. ఇలా చైన్‌లా అందరూ యాడ్ అవుతూ ఉంటారు. అందులో ఎవరు ఎలాంటి వారో చెప్పడం కష్టం. ఇలా యాడ్ అయ్యే వారి వల్ల కొన్ని సందర్భాలల్లో సమస్యలు తలెత్తవచ్చు. మొదట ఇలాంటి వారిని అన్‌ఫ్రెండ్ చేయడం మంచిది. ఇందుకు సెట్టింగ్స్‌లో ఎడమవైపు ఉంటే బ్లాకింగ్ అనే లింక్‌ను క్లిక్ చేస్తే, యూజర్స్‌ను బ్లాక్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఎవరిని బ్లాక్ చేయాలనుకుంటున్నామో వారి పేరును అందులో ఎంటర్ చేసేస్తే సరి.. బ్లాక్ అయిపోతుంది.
గేమ్‌లు..
ఫొటోలు, వీడియోల తర్వాత ఫేస్బుక్లో ఎక్కువగా వచ్చేది గేమ్ రిక్వెస్ట్‌లు.. కావాలనుకునేవారు బాగానే ఆడుతుంటారు. కానీ వద్దనుకున్న వారికే మధ్య మధ్యలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు ఇలాంటి మెసేజ్‌లు వద్దనుకుంటే సెట్టింగ్స్‌లో ప్రైవసీ, బ్లాకింగ్, కంటెంట్ మేనేజ్మెంట్ పాస్వర్డ్ సెట్టింగ్స్ వంటి ఆప్షన్లు ఉంటాయి. వీటి గురించి తెలుసుకుని.. అవసరాన్ని బట్టి వినియోగించుకుంటుంటే అనవసరమైన ఇతరాలను ఆపేయవచ్చు.
Authorization