స్మార్ట్ఫోన్లు మార్చడం కొందరికి అలవాటు. మార్కెట్లో ఏ కొత్త ఫోన్ వచ్చినా కొనేయడం అలవాటు. మరి పాత ఫోన్‌ను ఏం చేస్తారు అంటే.. అమ్మడమే ఎక్కువ మందికి చేస్తుంటారు. ఈ ఫోన్‌ను ఎవరు కొంటారు అని అనుకో వాల్సిన అవసరం లేదు.. కొనేవారు చాలా మందే ఉంటారు. మంచి మోడల్, తక్కువ ధరకు ఫోన్ వస్తోందంటే కొనే వారికి కొదువే ఉండదు. కానీ ఫోన్ తక్కువ ధరకు వస్తోందంటే వెంటనే కొనేయకూడదు. ఆ ఫోన్ కండిషన్ ఎలా ఉందో పరిశీలించుకోవాలి. సెకరడ్ హ్యాండ్ ఫోన్ కొనాలను కుంటే కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే పెట్టే డబ్బుకు న్యాయం చేకూరుతుంది. ఇందుకు ఏమేం పరిశీలించుకోవాలో తెలుసుకుందాం..
స్మార్ట్‌ఫోన్ వెంట లేకుంటే రోజు గడవదు. ఎన్నో వివరాలు అందులో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాం. ఏ ఫోన్ అయినా కొనేపుడు మొదట ఆలోచించేది డిస్ప్లే, నాణ్యత. ఇవి రెండు సరిగా లేకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంతమంది కొన్ని రకాల ఫోన్లు వేలకు వేలకు పోసి కొనడం కంటే సెకండ్ హ్యాండ్‌వి అందుబాటులో ఉంటే కొనేస్తుంటారు. అలాంటివి ఎవరి దగ్గర పడితే వారి దగ్గర కొనేందుకు ఇష్టపడరు. తెలిసిన వారి దగ్గర లేదా ఆన్లైన్లో కొనుగోలు చేస్తుంటారు. మనం ఒక ఫోన్ కొనేపుడు కొన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
కెమెరా
ప్రస్తుత రోజుల్లో సెల్ఫీల హవా ఎక్కువగా ఉంది. చాలా మొబైల్ కంపెనీలూ కెమెరాలకూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందులో భాగంగానే ఇపుడు వస్తున్న ఫోన్లలో మూడు, నాలుగు, ఐదు కెమెరాలు ఉంటున్నాయి. కొనే వారు కూడా ఫొటో క్లారిటీ ఎలా ఉంటుందో చూసుకునే కొంటున్నారు. దీనిని బట్టే చెప్పవచ్చు ఫొటోలకు ఎంతటి ప్రయారిటీ ఉందో. సెకండ్ హ్యాండ్ ఫోన్లలో ఫొటో క్వాలిటీ ఎలా వస్తుందో పరిశీలించుకోవాలి. కొన్ని ఫొటోలు ఫోన్ స్క్రీన్ మీద కనిపించినంతగా కంప్యూటర్లోకి కాపీ చేసుకున్నపుడు ఉండవు. అలా రావడానికి కారణం ఆ ఫోన్ రిజల్యూషన్. ఎక్కువ మెగాపిక్సెల్ కలిగిన ఫొటోలు సహజంగానే స్క్రీన్ మీద నాణ్యంగా కనిపిస్తాయి. అయితే అవే ఫొటోలు ల్యాప్‌టాప్, కంప్యూటర్లోకి కాపీ చేసినపుడు షార్ప్‌నెస్, కాంట్రాస్ట్ ఎంత ఉందనేవి తెలుస్తుంటాయి. అందువల్ల సెకండ్ హ్యాండ్ ఫోన్‌తో కాప్చూర్ చేసిన ఫొటోలను సిస్టమ్‌కు కాపీ చేసి పరిశీలించుకోవాలి. అంతేకాదు బ్యాక్ కెమెరా లెన్స్నూ పరిశీలించుకోవాలి. అది ఫోన్‌కు అడుగు భాగంలో ఉండడం వల్ల గీతలు పడే లెన్స్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం ఫొటోల మీద పడుతుంది.
బ్యాటరీ
ఫోన్ హార్డ్‌వేర్ పెద్ద సమస్య అనిపించదు. అయితే బ్యాటరీ గురించి పరిశీలించుకోవాలి. సాధారణంగా ప్రస్తుతం వస్తున్న ఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలనే వాడుతున్నారు. ఇందులో ఒక ఫోన్ ఉపయోగించడం మొదలు పెట్టాక పూర్తిగా చార్జింగ్ పెట్టడంలో వెయ్యి సైకిల్స్ పూర్తయితే బ్యాటరీ శాశ్వతంగా డెడ్ అవుతుంది. అందుకే సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేపుడు బ్యాటరీ బ్యాకప్ చేక్ చేసుకోవాలి. లేదంటే మాటిమాటికీ చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. లేదంటే దాని స్థానంలో కొత్త బ్యాటరీ మార్పించుకోవాల్సి ఉంటుంది.
చార్జర్
ఏ ఫోన్ అయినా చార్జింగ్ పెట్టాలంటే బ్యాటరీ కెపాసిటీకి సంబంధించి కంపెనీ ఇచ్చే ఒరిజినల్ చార్జర్‌ను ఉపయోగించాలి. అలా కాదని వేరేది వాడాలనుకుంటే బ్యాటరీ కెపాసిటీకి సరిపోయేలా లేదా దగ్గరగా ఉండే చార్జర్‌ను ఎంచుకోవాలి. లేదంటే ఫోన్‌కు ప్రమాదం అనే చెప్పవచ్చు. అయితే సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేపుడు ఫోన్‌తో పాటు ఏ చార్జర్ ఉంది, ఏ విధంగా చార్జింగ్ అవుతుంది అనే అంశాలు పరిశీలించుకోవాలి.
బటన్స్
కొనే ఫోన్లో పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు సరిగా పనిచేస్తున్నాయా లేదా గమనించుకోవాలి. సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఏ విధంగా ఉందో చూసుకోవాలి. కొన్ని ఊడిపోయి లేదా సరిగా సెట్ అవ్వకపోవడం వంటి సమస్యలు తలెత్తుంటాయి. అంతేకాదు, మెమోరీ కార్డు కూడా అందులో డిటెక్ట్ అవుతుందో లేదో చూసుకోవాలి. కొనాలనుకున్న ఫోన్ లేటెస్ట్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
స్క్రీన్
ఫోన్‌ను బ్యాగ్‌లో వేసినపుడు, జేబులో పెట్టుకున్నపుడు తాళం చెవుల వల్ల, మరేదైనా బలమైన వస్తువుల వల్ల రాపిడి తగిలి స్క్రీన్‌పై గీతలు పడుతుంటాయి. అప్పుడప్పుడు ఫోన్ చేతిలో నుంచి జారి పడుతుంటుంది. ఆ సమయంలోనూ స్క్రీన్ మీద గీతలుపడే అవకాశం ఉంది. అందుకే ఫోన్ కొనేపుడు నిశితంగా పరిశీలించాకే సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనడం మంచిది. చిన్న చిన్న గీతలే కదా అని కొన్నింటని నిర్లక్ష్యంగా పట్టించుకోకపోతే మున్ముందు అవే పెద్ద క్రాక్స్గా మారి టచ్ మీద ప్రభావం చూపిస్తాయి. అందువల్ల ఫోన్ కొనేపుడు ముందు, వెనుక భాగాలలో పరిశీలించుకోవాలి. కొన్ని గీతలు ఫ్లాష్ లైట్ వేసి, స్క్రీన్ ముందు, వెనుక భాగంలో నిశితంగా పరిశీలిస్తే కనిపిస్తాయి. మామూలుగా చూసినా కొన్ని కోణాల్లో చిన్నపాటి గీతలు కనిపించే అవకాశం ఉంది.
కాల్స్, వాట్సాప్ కోసం..
ఆండ్రాయిడ్ ఫోన్లను తయారు చేసే సంస్థలు కొత్త మోడల్స్‌ను తీసుకువస్తాయి తప్పితే, అప్డేట్స్ అందించవు. అయితే యాపిల్ ఐ ఫోన్లు ఇందుకు భిన్నంగా ఉంటాయి. యాపిల్ ఫోన్ కాస్త పాతది ఒక మోడల్ ఫోన్ కొంటే అందులో ఐఓఎస్ కొత్త వర్షెన్‌ను ఇన్స్టాల్ చేసుకుని వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం వస్తున్న ఫోన్లలో అధిక ప్రాసెసర్లు, ర్యామ్ సైజు ఉంటున్నాయి. వీటి వల్ల యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటివి బాగా పనిచేస్తాయి. తక్కువ ర్యామ్, ప్రాసెసర్ కలిగిన సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొంటే మాత్రం సోషల్‌మీడియా సైట్లను బాగా వినియోగించుకోలేకపోవచ్చు. కేవలం ఫోన్ కాల్స్, వాట్సాప్ కోసం ఉపయోగించేందుకు మాత్రమే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ కచ్చితంగా సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనాలనుకుంటే మాత్రం ఇంటర్నల్ స్టోరేజ్ 258 జీబీ వరకు ఉంటోంది. కనీసం 64 జీబీ ఉన్నదైనా ఎంపిక చేసుకుంటే ఫోన్ ఉపయోగంగా ఉంటుంది.
ఫైండ్ మై ఫోన్
కొన్ని ఫోన్లు అన్లాక్డ్ వర్షెన్‌లో వస్తుంటాయి. ఉదాహరణకు కొన్ని రకాల ఫోన్లకు అన్లాక్డ్ సిస్టమ్ ఉండదు. ఇలాంటి ఫోన్లు మన దేశంలో ఉపయోగించడానికి సాధ్యపడవు. అసలు అందులో మన దేశంలోని సిమ్‌కార్డులు వాడలేము. ముఖ్యంగా యాపిల్ ఫోన్లకు వర్తిస్తుంది. అంతేకాదు వీటిలో ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అది ఎనేబుల్ చేసి ఉంటే ఆ ఫోన్ మనం వాడేందుకు ఉపయోగపడదు. కచ్చితంగా ఎవరైతే అమ్మారో వారి ఐ క్లౌడ్ అకౌంట్ నుంచి ఆ ఆప్షన్‌ను డిసేబుల్ చేస్తేనే వాడగలం. అందువల్ల ఐ ఫోన్ కొనేపుడు ఈ ఆప్షన్లు వెరిఫై చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించి, అన్ని సరిగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించుకున్నాకే సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనుగోలు చేయాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
Authorization