షియోమీ, హువావే, ఒప్పో, వివోలు చైనాకు చెందిన సంస్థలు. ఇంతకుముందు ఈ సంస్థలన్నీ విడివిడిగా ఉండేవి. ఇపుడు ఇవన్నీ ఒకే తాటిపైకి వస్తున్నాయి. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కథనం ప్రకారం గూగుల్‌కు వ్యతిరేకంగా ఈ నాలుగు కంపెనీలు కలిసి 'గ్లోబల్ డెవలపర్ సర్వీస్ అలయన్స్' ప్లాట్‌ఫాంను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటి లక్ష్యం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ప్లేస్టోర్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడమే. దీంతో పాటు గూగుల్ ఎకో-సిస్టం మీద ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించి ప్రపంచ మార్కెట్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం. ఈ నాలుగు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ప్రపంచ వ్యాప్తంగా 40.1 శాతం మార్కెట్ షేర్‌ను కలిగి ఉన్నాయి. గతేడాదిలో 20 శాతం మార్కెట్ షేర్‌తో యాపిల్ ముందంజలో ఉంది. అంటే ఈ నాలుగు సంస్థలు గూగుల్ ప్లేస్టోర్‌ను ఉపయోగించడం నిలిపివేస్తే గూగుల్ ఒకేసారి ఏకంగా 60 శాతం మార్కెట్‌ను కోల్పోనుంది. హువావే ఇప్పటికే గూగుల్‌తో సంబంధం లేకుండా తన సొంత ఆపరేటింగ్ సిస్టంను తయారు చేసుకునే పనిలో ఉంది. దీనికి హార్మొనీ ఆపరేటింగ్ సిస్టం అని పేరు పెట్టింది. అంతేకాదు, హాంగ్‌కాంగ్‌కు చెందిన ఆండ్రాయిడ్ ఎకో-సిస్టం ప్లాట్‌ఫాం వాంకా ఆన్లైన్ కూడా ఈ నాలుగు కంపెనీలతో చేతులు కలిపే అవకాశముంది. దీని ద్వారా బయట దేశాల్లో ఉన్న గేమ్స్, మ్యూజిక్, మూవీస్ సంబంధిత లేదా ఇతర యాప్స్‌ను తయారు చేసే డెవలపర్లు తమ యాప్స్‌ను వీటికి సంబంధించిన యాప్ స్టోర్లలో ఉంచవచ్చు. గతంలో ప్లేస్టోర్‌కు పోటీగా చేసిన ప్రయోగాలేవీ ఫలించలేదు. అదే వీటి ముందున్న అతి పెద్ద సవాల్. మొదట్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా పట్టువదలకుండా ఈ నాలుగు కంపెనీలూ ఒకే తాటిపై నిలబడాల్సి ఉంటుంది. కానీ అది జరుగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం కదా!
Authorization