Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడ దౌర్జన్యం రాజ్యమేలుతుందో
ఎక్కడ అన్యాయం న్యాయాన్ని
బలవంతుడు బలహీనులను
ఉన్నవాడు లేనివాన్ని
అణచివేస్తుంటాడో అక్కడ
సహనం చచ్చి అల్పజీవులే
ఉప్పెనలా తిరగబడతారన్నది
చరిత్ర తెలిపిన సత్యం...
నిజాం నిరంకుశ పాలనలో
దొరల పెత్తనం, పీడనలో,
భూస్వాముల దాష్టీకాలకు,
రజాకార్ల పైశాచికతకు
నలిగిన తెలంగాణ రైతన్నలు
ఎదురు తిరిగి సాయుధులై
కూటికోసం కూలికోసం
మాన ప్రాణాలకోసం
నమ్ముకున్న నేల తల్లి కోసం
తిరుగుబాటు జెండానెగరేసి
విప్లవించిన వీర తెలంగాణ
సాయుధ పోరులో
అసువులు బాసి అమరులైన
యోధులందరికీ ఎర్రెర్రని దండాలు...
'బైరాన్ పల్లి' జలియన్ వాలాబాగ్
దారుణ మారణ కాండలో
దొడ్డి కొమరన్న, చాకలి ఐలమ్మ లాంటి
నాలుగు వేల వీరుల రక్తతర్పణంతో
నాడు ఈ నేల పునీతమై
స్వేచ్ఛా గాలులకు ఊపిరిలను ఊదింది
పోరుగల్లు ఓరుగల్లు ధీరులు
నల్లగొండ కత్తులు చేపట్టిన రైతన్నలు
ఖమ్మం ఎరుపు దండులు
తెలంగాణా ఊరు వాడా ఏకమై
సాగించిన ప్రజా పోరుకు
నిజాం పాలకులు, తొత్తులు,
భూస్వాములు ఊర్లను వదిలి
హైదరాబాద్ పారిపోతే
సంపూర్ణ స్వాతంత్య్రం కోరి
తెలంగాణా విముక్తి కోసం
ఎత్తిన పిడికిలి దించకుండా
ఎక్కుపెట్టిన ఆయుధం వదలకుండా
పోరాటాన్ని నడిపే తరుణాన
చేతులెత్తేసిన నిజాం కుట్రపన్ని
మిలిటరీతో చేతులు కలిపి
పోరుబిడ్డల్ని ఊచకోత కోస్తూ
పల్లెలను తగులబెడుతూ
ఖద్దరు వేషంలో కసాయి
దోపిడీ దళారులు తెలంగాణను
నయా దొరల రాజ్యంగా మార్చినా...
ఆరని నాటి కార్చిచ్చు ఇంకా రగులుతూ
కొనసాగిన ఉద్యమాల తాకిడికి
విద్యార్థుల ప్రభంజనాలకు
సకల జనుల పోరాటాలకు
నేడు ప్రత్యేక రాష్ట్రం వచ్చినా...
మారలేదు సామాన్యుడి బతుకు
అమరుల ఆశయమింకా తీరనే లేదు
ఆగని దోపిడీలు, దౌర్జన్యాలు
తీరని నిరుద్యోగం, నిస్పృహలతో
అందని సమాన అవకాశాలు
మేడి పండ్లై ఊరిస్తూనే ఉన్నాయి
అందుకే... వీరతెలంగాణ
సాయిధ పోరాట నిప్పు రవ్వలు
ఇంకా ప్రతిగుండెలో చల్లారక
ఎగసి పడుతూనే ఉన్నాయి
పల్లెలో, పట్టణంలో ఎత్తిన ఎర్రపిడికిళ్ళు
'నవ తెలంగాణ' కోరి
నినదిస్తూనే ఉన్నాయి.
- డా|| కె. దివాకరా చారి
సెల్: 9391018972