Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కృషితో నాస్తి దుర్భిక్షం' అనే నానుడి రాను రాను కనుమరుగువు తున్నదా అనే సందేహం కలుగుతున్నది. ఉన్నత స్థానాన్ని అధిరోహించేందుకు కుట్రలు, కుతంతాలు చేయడం మనిషి జీవితంలో భాగమైపోయింంది. వ్యక్తులు, సంస్థలు అనే తేడా లేకుండా అడ్డదారిలో ఎలా అందలం ఎక్కాలనే అంశంపై ప్రపంచం నేడు పరిశోధన చేస్తున్నది. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పని చేస్తున్నప్పుడు ఇంటర్వూకోసం ఒక విద్యాసంస్థల యజమాని దగ్గరికెల్లాను. ఇంటర్వూ మాట ఎలా ఉన్నా అక్కడ పని చేసే ఓ ఉపాధ్యాయుడు చెప్పిన కథ విని షాకయ్యాను. ప్రతి ఏటా ఆ విద్యాసంస్థలో మోటివేషన్ తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులను తీర్చి దిద్ధేందుకు, సమాజాన్ని ఉద్దరించేందుకు మాత్రం కాదు. మార్కెటింగ్ ఎలా చేయాలి.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఒప్పించి విద్యాసంస్థలో ఎలా చేర్పించాలి అనే అంశంపైనే ఈ తరగతులు. ఎప్పటిలాగే ఆ ఏడాది కూడా తరగతులు జరుగుతుండగా ఓ ఉపాధ్యాయుడు లేచి... సార్ మనం ఎన్ని చెప్పినా విద్యలో క్వాలిటీ, కమిట్మెంట్ లేకుంటే విద్యార్థులను ఆకర్షించలేం కదా అని అడిగాడు. అప్పుడు వెంటనే విద్యాసంస్థల యజమాని లేచి ఒక చిన్న కథ మొదలు పెట్టాడు.. ''ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములుంటారు. ఇద్దరికి చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో పోటీ. అన్న ఏ పని చేసినా తమ్ముడు కాపీ కొడుతాడు. తమ్ముడు ఏ పని చేసినా అన్న అనుకరిస్తాడు. ఆ యేడు వర్షాలు బాగా పడటంతో అన్న తన ఇంటి ముందు కొబ్బరి మొక్కను నాటడాన్ని చూసి తమ్ముడు వెంటనే తన ఇంటి ముందు కూడా కొబ్బరి మొక్కను నాటుతాడు. ఇద్దరూ పోటీ పడి పెంచుతున్నారు. నేల సారమో పెంపకంలో మెలకువో తెలియదుగాని అన్న పెంచుతున్న చెట్టు ఏపుగా పెరిగి కాయలు కాసే దశకు వస్తే, తమ్ముడు పెంచుతున్న చెట్టు అంతంత మాత్రంగానే పెరిగి, వాడి పోయి బలహీనంగా ఉంది. అప్పుడు తమ్ముడు తన చెట్టును ఆ ఊర్లోనే పెద్ద చెట్టుగా చేయాలంటే ఏమి చేయాలో చెప్పండని కొందరి సలహా కోరుతాడు. బాగా ఎరువు వేసి జాగ్రత్తగా చూసుకోవాలని ఒకరూ, ఎరువుతో పాటు నీరు బాగా పట్టించాలని ఒకరూ.. తమకు తోచిన సమాధానం చెబుతారు. ఏ... కాలంలో ఉన్నారు మీరు.. ఓ అర్థరాత్రి లేచి అన్న చెట్టును గొడ్డలితో తెగ నరికేస్తేచాలు. అప్పుడు ఆ ఊర్లో తమదే పెద్ద చెట్టవుతుంది అని చెప్పాడట ఓ మహానుభావుడు.'' అని చెపుతూ మనం ఏంత బాగా విద్యను నేర్పుతున్నామని కాదు, మన పోటీదారున్ని ఎలా దెబ్బతీయీలనే థియిరిపైనే నేడు విజయం అధారపడి ఉన్నదని చెప్పడంతో దిమ్మతిరిగినంత పనైంది ఆ ఉపాధ్యాయులకి. ఇది తప్పని చెప్పడానికి వాళ్లేం మదర్ థెరిస్సాలు, అనిబ్సెంట్లు కాదు. జీవితాన్ని జీవితంగా ప్రేమించే సగటు మనుషులు. బతుకు దెరువు కోసం మౌనంగా భరించడం తప్ప మరేమి చేయలేని నిస్సహాయులు. ప్రపంచం తీరే అలా ఉంటే వారేం చేయగలరు.
- ఊరగొండ మల్లేశం