Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనేక వ్యాధులు తాగే నీటి శుద్ధత, పీల్చే గాలి నాణ్యత, కడిగిన చేతులు పరిశుభ్రతల మీదనే ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం 40శాతం ప్రపంచ జనాభా చేతి శుభ్రతకు దూరంగా ఉంటూ అనేక నివారించగల వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారని తేలింది. చేతుల పరిశుభ్రతతో ముగ్గురిలో ఒకరిని డయేరియా, ఐదుగురిలో ఒకరిని శ్వాస సంబంధ వ్యాధులను అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు. చేతి శుభ్రతతో 23-40శాతం మందికి డయేరియా, 29-57శాతం మంది జీర్ణనాళ వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు. డయేరియా వ్యాధిగ్రస్థుల్లో 58శాతం మందిలో రోగనిరోధకశక్తి బలహీనపడిందని అంచనా వేశారు. హాండ్ వాష్‌తో జనాభాలో 16-21శాతం మందికి శ్వాసకోశ సంబంధ వ్యాధులు నిరోధించబడతాయి. కోవిడ్-19 కల్లోలంలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ మానవాళికి కరోనా విధించిన నవ్య జీవనశైలిలో చేతుల శుభ్రత అతి ముఖ్యమైనదిగా చెప్పబడింది. చేతుల శుభ్రత ప్రాముఖ్యతను, అది చేసే మేలును ప్రచారం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రతియేటా 15 అక్టోబర్ రోజున ''గ్లోబల్ హాండ్ వాషింగ్ డే (ప్రపంచ చేతి శుభ్రత దినం)'' పాటించుట జరుగుతోంది. ప్రపంచ చేతి శుభ్రత దినం-2020 అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా ఐక్యరాజ్యసమితి 'హాండ్ హైజీన్ ఫర్ ఆల్ (అందరికీ చేతుల శుభ్రత)'ను నినాదంగా తీసుకొని సామాన్య ప్రజలకు వివరించుట జరుగుతున్నది. నిరక్షరాస్యత, అధిక జనాభా, పేదరికం వంటి సమస్యలతో సతమతం అవుతున్న భారతీయులకు చేతుల పరిశుభ్రత పట్ల అవగాహన లేని కారణంగా అనేక వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం అవుతున్నది. నేడు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నిరంతరం చేతులు శుభ్రం చేసుకోవడం కనీస అవసరం అయ్యింది. 2008లో ప్రారంభమైన ఈ గ్లోబల్ హాండ్ వాషింగ్ డే పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు, పౌరసమాజంలో చేతులు కడిగే సక్రమ పద్ధతులను విస్తత ప్రచారం చేయవలసి ఉంది. చేతులు శుభ్రం చేసుకునే పద్ధతి, వాడవలసిన సబ్బు, శుభ్రత లేమితో సంక్రమించే వ్యాధుల పట్ల స్పష్టత తేవడానికి ఈ సందర్భం ప్రత్యేకంగా ఉపయోగపడాలి.
బయటి నుంచి ఇంటిలోకి చేరగానే చేతులను శుభ్రం చేసుకోవాలి. చేతుల శుభ్రతకు కనీసం 20 సెకన్ల సమయం ఇవ్వాలి. తుమ్మిన, దగ్గిన ప్రతిసారి చేతులు శుభ్రం చేసుకునే అలవాటు మంచిది. బయట పలు వస్తు ఉపరితలాలు, కరెన్సీ తాకే వారు తప్పక చేతులను కడుక్కోవాలి. రోగులకు సహాయం చేసే వారు అత్యంత జాగ్రత్తగా హాండ్ వాష్ చేసుకోవాలి. భోజనం లేదా పలహారం చేసే ముందు, తరువాత చేతుల శుభ్రత అవసరమని గుర్తుంచుకోవాలి. టాయిలెట్స్, చెత్త చెదారాన్ని ముట్టినపుడు, జంతువులను తాకినపుడు, ఇల్లు చేరినపుడు, పిల్లలను తాకేటపుడు, చేతులు అపరిశుభ్రంగా ఉన్నపుడు, వంటకు ముందు తరువాత, గాయాలను తాకిన తరువాత, జంతు మలమూత్రాలను తాకినపుడు, ముక్కు చీదిన తరువాత తప్పక హాండ్‌వాష్ చేసుకోవాలి. హెపటైటిస్, ఫుడ్ పాయిజనింగ్, డయేరియా లాంటివి అపరిశుభ్ర చేతుల వల్ల వస్తాయని అంటున్నారు. భారత్‌లో 10మిలియన్ల మంది అపరిశుభ్ర ఆహారం తీసుకున్న కారణంగా వచ్చాయని నివేదికలు తెలుపుతున్నాయి. భారతీయుల జీవనవిధానంలో చేతులతో భుజించడం అలవాటుగా ఉంది. అందువల్ల చేతులు అపరిశుభ్రంగా ఉన్నట్టయితే వ్యాధులు రావడం ఖాయం అని మరువరాదు. సర్వే వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 1.8 మిలియన్ల 5ఏండ్లలోపు పిల్లలు న్యుమోనియా, డయేరియా సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారని విశ్లేషించారు. చేతులకు ఇరువైపుల, వేళ్ల మధ్య, మణికట్టు, అరచేయి, బొటనవేలు, గోర్ల భాగాలను సబ్బు (బార్ లేదా లిక్విడ్ సోప్) నురగతో ట్యాప్ వాటర్‌తో కడగడం సర్వదా అత్యంత అవసరమని తెలుసుకోవాలి. పాత్రల్లో నిలువ ఉంచిన నీటి కన్నా ప్రవహించే నీటితో హాండ్ వాష్చేసుకోవడం మంచిదని తెలుసుకోవాలి. చేతులు కడిగిన వెంటనే శుభ్రమైన టవల్ లేదా గుడ్డ లేదా టిష్యూ పేపర్‌తో ఆరిపోయేలా తుడుచుకోవాలి. టవల్ పరిశుభ్రంగా లేని యెడల చేతులు శుభ్రంగా కడిగిన ప్రయోజనం శూన్యమని తెలుసుకోవాలి. ప్రయాణంలో 60శాతం ఆల్కహాల్ కలిగిన సానిటైజర్‌ను వాడడం మంచిది. భోజనం శుభ్రంగా ఉండడంతో పాటు తాగు నీరు, పీల్చే గాలి, తినే చేతులు కూడా పరిశుద్ధతతో ఉంటేనే మనకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలుసుకుందాం. చేతులను శుభ్రంగా కడుగుదాం, వ్యాధుల నుంచి రక్షణ పొందుదాం.
- డా||బి.మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037