Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన భారతదేశం భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలకు నిలయమైనది. ఇది ఎన్నో.. మరెన్నో కళలకు పుట్టినిల్లు. సంగీతం, చిత్రలేఖనం, నాట్యం, గానం ఇలా అనేక లలిత కళలు ఇక్కడ భాసిల్లాయి... ఇప్పుడూ భాసిల్లుతున్నాయి. ఆయా రంగాల్లో నిష్ణాణితులైన ఎంతోమంది తమ కళాప్రావీణ్యం ద్వారా దేశ చరిత్రను ప్రపంచ పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించారు. తెలంగాణ నుంచి కూడా ఇదే తరహాలో అనేక మంది సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, రచయితలు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారందరికీ తీసిపోని రీతిలో ఈ మధ్య 'మన జాతిరత్నం' తనకే సొంతమైన, సాధ్యమైన అద్భుత కళను ప్రదర్శించారు. ఆయన సృజనాత్మకత, కళా నైపుణ్యానికి అచ్చెరువునొందిన జనులు... 'ఔరా...' అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. గతనెల్లో జరిగిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎమ్సీ) ఎన్నికల సందర్భంగా 'ఢిల్లీపై ఇక యుద్ధమే... కమలం పార్టీతో ఇక తాడో పేడో తేల్చుకుంటాం, బీజేపీ సర్కార్ మెడలు వంచైనా సరే... రాష్ట్రానికి కావాల్సిన నిధులను సాధించుకుంటాం...' అంటూ సదరు దళపతి, భాగ్యనగర వీధుల్లో కత్తి, డాలూ పట్టుకుని భీకర ప్రతిజ్ఞ చేశారు. అలా వీరలెవల్లో ఫోజులిచ్చిన మన సైన్యాధిపతి వాక్కులు విని... అతడి వెనకున్న సైనికులు కూడా యుద్ధోన్ముఖులయ్యారు. తమకు అందుబాటులో ఉన్న, దొరికిన చాకులు, బాకులు, బరిసెలనే చేబూని వీరావేశంతో ఊగిపోయారు. ఈ క్రమంలో చుట్టుపక్కల శ్రేయోభిలాషులు కూడా సంతోషం నిండిన హృదయాలతో... 'జయహౌ, జయ జయహౌ...' అంటూ జయ జయధ్వానాలు చేశారు. ఈ జయజయధ్వానాల హౌరులోనే జీహెచ్ఎమ్సీ ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వెలువడ్డాయి. అంతే... ఏం జరిగిందో తెలియదు, అసలేం జరుగుతున్నదో తెలుసుకునే లోపే మన గ్యాంగ్‌లీడర్... వాయువేగంతో హస్తినకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో తిప్పిన కత్తినీ, దాంతోపాటే ఉన్న డాలుని కిందపడేసి... అక్కడి పెద్ద తలకాయలకు కండువా కప్పి దండం పెట్టారు. ఈ క్రమంలో వంగి, వంగి దండాలు పెట్టిన ఆ సమర సేనాని తీరు, రాజకీయాల్లో గోడ మీది పిల్లి వాటం లాంటి ఆయన వైఖరి నచ్చని ఓ పెద్దాయన... 'మామూలుగా కళల్లో అరవై ఆరు రకాలుంటాయని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఇప్పుడు వాటి సరసన అరవై ఏడో కళ వచ్చి చేరింది. అదే వంగటం, వంగి, వంగి దండాలు పెట్టటం... అది అందరికీ రాదు. కొందరికే వస్తుంది... అందుకే వంగటం కూడా ఒక కళే...' అంటూ మన బాస్‌కు చురకలంటించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఇటీవల జరిగిన ఓ ధర్నా సందర్భంగా దళపతి తీరుపై పడిన కామెంట్లివి...
-బి.వి.యన్.పద్మరాజు