Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జగత్తుకు ఆధారభూతమైన స్త్రీ గురించి ఎంత రాసినా అక్షరాలకు కొరత ఉండదు. ఎంతోమంది కవులు రచయితలు భావుకుడు సృష్టించిన సాహితీ ధారకు తరగని నిధి స్త్రీ అనే ఏకైక అక్షరం...
సృష్టికి ప్రతి సృష్టి చేసిన కుటుంబ గమనానికి దిశగా ఉన్నా వివిధ రంగాలను సమర్థవంతంగా నడిపిస్తున్నా దాని వెనక ఉన్న ఏకైక రూపం స్త్రీ...
యుగయుగాలుగా తన ఉనికిని ప్రశ్నార్థకం చేసిన పురుష జాతి పై ప్రేమాభిమాన అమృత ధారలు వర్షింప చేయటం ఆ కల్పవల్లికే సాధ్యం.
మనకు లోకాన్ని పరిచయం చేసి తొలిగురువుగా, మార్గదర్శిగా ప్రతి అడుగులో తానే అయి ఉండి తీర్చిదిద్దిన అమ్మ రూపం లోని స్త్రీ మహోన్నతం.
ప్రకృతి ధర్మాలకు కట్టుబడి బిడ్డ కోసం భరించలేని ప్రసవవేదన పడి తాను ఎంతటి సహనశీలో ప్రపంచానికి తెలియపరిచిన ఆ మాతృమూర్తి త్యాగానికి ఏమిచ్చి తీర్చుకోగలం.
తమ ఆశలను ఆకాంక్షలకు తగినట్లుగా బిడ్డలను సంస్కారవంతులుగా, మేధావులుగా రూపొందించే ఏకైక శక్తి స్వరూపిణి స్త్రీ...
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సమయంలో తమ తమ కుటుంబాలను ఒంటి చేత్తో నడిపిన వారి విద్వత్తును ఏమని వర్ణించగలం... సాహో అనడం తప్ప...
ఉద్యోగాలు కోల్పోయిన భాగస్వామ్యులు ఒక వైపు, చదువుకు దూరమై ఏం చేయాలో తెలీక అల్లాడుతున్న బిడ్డలు ఒక వైపు, ఆదాయం కోల్పోయి ఇబ్బందులు మరోవైపు చుట్టుముట్టిన మనోధైర్యంతో , విశ్వాసంతో
ఉన్న కొద్దిపాటి వనరులతో కుటుంబాన్ని నడిపిన వారి ధీశక్తికి జోహార్లు..
కాలగమనాన్ని ఔపౌసన పట్టిన మరో బ్రహ్మ
జనన మరణాలకు అతీతమైన జన్మాంతరాల బంధం
అసాధ్యం అనే పదం తన రాజ్యాంగంలో లేని సమవర్తి
తానే దీపమై లోకానికి వెలుగునిచ్చే అఖండ జ్యోతి
సమస్త లోకాలకు అధిదేవత స్త్రీ....
నాస్తికుడైన వాడు కూడా దేవున్ని దేవతలను నమ్మకపో వచ్చేమో కానీ తనకు జన్మనిచ్చిన మాతృమూర్తి పట్ల మాత్రం అపార గౌరవభావం ఆదరణీయతను కలిగి ఉండటంతో స్త్రీ మూర్తి ఎంతటి ఉత్కృష్టురాలో మనం తెలుసుకోవచ్చు.
అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలు నుండి అనేక దేశాల ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రంగాల అధినేతలు, శాస్త్రవేత్తలు, పరిశోధకుల రూపంలో స్త్రీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన విరాట్ స్వరూపాన్ని దర్శింప చేయడంతో ఆమె ఎంతటి శక్తి స్వరూపిణో ప్రపంచానికి తెలుస్తోంది.
అయితే విద్యా వ్యవస్థ పై ఒక గురుతర బాధ్యత ఉంది. లింగభేదం తో సంబంధం లేకుండా విద్యార్థి దశ నుండే స్త్రీ యొక్క ఔన్నత్యం, విలువ, వివిధ రూపాలలో ఎటువంటి సేవలను ప్రపంచానికి తాను అందిస్తుందో ప్రతి ఒక్కరికి పాఠ్యాంశాల రూపంలో నేర్పవలసిన అవసరం ఉంది.
అదేవిధంగా శాసన, న్యాయ, చట్ట వ్యవస్థలు, రాజకీయ, సామాజిక రంగాలు స్త్రీ కి ఇచ్చే ప్రాధాన్యత ద్వారా రేపటి తరానికి గొప్ప సందేశాన్ని ఇవ్వాలి. అప్పుడే ఈ మహిళా దినోత్సవాలకు ఒక అర్థం, పరమార్థం....
- అట్లూరి వెంకటరమణ
9550776152