Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో ఏ చిన్నగ్రామంలోనైనా, పట్టణంలోనైనా, ఎవరికి ఏ చిన్న గాయమైనా వెంటనే వైద్యుడు ఇచ్చే సూదిమందు 'పెన్సిలిన్''. శరీరభాగం సెప్టిక్ కాకుండా ఇచ్చే సూదిమందు పేరే పెన్సిలిన్. దీనిని కనుక్కొన్న జీవాశాస్త్ర వేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వర్థంతి నేడు. శాస్త్రపరిశోధనలో భాగంగా అనుకోకుండా కనుగొనబడిన అద్భుత మందే పెన్సిలిన్. 1881సంవత్సరం ఆగస్టు 6న స్కాట్లాండ్లోని లోచిఫీల్డ్లో హుగ్ ఫ్లెమింగ్- గ్రేసీ స్టిర్లింగ్ మోర్టన్ దంపతులకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జన్మించాడు. వీరు వ్యవసాయ వృత్తిలో ఉండేవారు. చిన్నప్పుడే అంటే ఏడేండ్ల వయసులోనే ఫ్లెమింగ్ తండ్రి మరణించడం వల్ల తల్లి పొలం పనులు చేస్తుంటే అక్కడి పాఠశాలలో చదవడం ప్రారంభించి, అటు తర్వాత లండన్‌లో ఉండే పెద్దన్నయ్య దగ్గరకు వెళ్లి హైస్కూల్లో చేరాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి షిప్పింగ్ కంపెనీలో గుమాస్తాగా చేరాడు. తిరిగి ఇరవయేండ్ల వయసులో చదువును కొనసాగించి ప్రపంచానికి వైద్యరంగంలో ఒక అద్భుతాన్ని అందించాడు. సెయింట్ మేరీస్ కాలేజీలో వైద్యవిద్యలో చేరి చురుగ్గా చదువుతూనే రైఫిల్ షూటింగ్, ఈత, వాటర్‌పోలో క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు. డిగ్రీ పొందాక పరిశోధనలపై దృష్టిపెట్టి నిరంతరం అన్వేషణలో నిమగమయ్యాడు. లండన్‌లోని మేరీ మెడికల్ కాలేజీ నుంచి 1906లో డిగ్రీ తీసుకొని అక్కడే కొంతకాలం పాటు బాక్టీరియాలను నిరోధించే పదార్థాలపై పరిశోధనలు చేశాడు. అక్కడ నుంచే ఆర్మీ మెడికల్ కార్ఫ్ కి వెళ్లి, మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా 1918లో మళ్ళీ సెయింట్ మేరీ మెడికల్ కాలేజీకి వచ్చి, ఆంటీ బయాటిక్స్ మీద పరిశోధనలు నిరంతరం చేస్తూనే ఉన్నాడు. ఆ కషి ఫలితంగా ప్రపంచానికి అద్భుతమైన ''పెన్సిలిన్''ను రూపొందించ గలిగాడు. చిన్ననాటి నుండి వైద్యపరిశోధనలో ఉన్న ఆసక్తి నేడు ప్రపంచానికి ఉపయోగపడే మందును కనుగొనుటలో విజయానికి తోడ్పడింది. ఈ వెయ్యేండ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్'. తొలి యాంటీ బయోటిక్‌గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తగా అలగ్జాండర్ ఫ్లెమింగ్ చిరస్మరణీయుడు. పెన్సిలిన్ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలిగి విశ్వవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ మందును కనిపెట్టినందుకు ఫ్లెమింగ్ 1945లో నోబెల్ బహుమతిని పొందారు. 1923లో కనుగొన్న ఎంజైములు, లైసోజైములు, 1928 లో కనుగొన్న ప్రపంచ మొట్ట మొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ ఈయన పరిశోధనల్లో ముఖ్యమైనవి. బ్యాక్టీరియాలజీ, ఇమ్యునాలజీ, కీమోథెరపీ మీద అనేక వ్యాసాలు రాసాడు. వీరి వ్యాసాల వల్ల ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు మార్చి 11, 1955లో లండన్ నగరంలో మరణించినా.. వీరి పరిశోధన ఫలితం ప్రపంచం ఉన్నన్ని రోజులు అతన్ని చిరంజీవిని చేసింది. ఫ్లెమింగ్‌కు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ హంటేరియన్ ప్రొఫెసర్ హౌదాను ఇచ్చింది. 1944లో జార్జి 4 మహారాజు నైట్ బాచెలర్ మెడల్‌ను బహుకరించాడు. 1999లో టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు 100 మంది ప్రముఖ వ్యక్తులలో ఒకడిగా ఫ్లెమింగ్‌ను గుర్తించింది. 2002లో ఫ్లెమింగ్‌ను బి.బి.సి. 100మంది ప్రముఖ బ్రిటిష్ వ్యక్తులలో ఒకడిగా ఎన్నిక ద్వారా నిర్ణయించింది. ప్రపంచానికి వైద్యరంగంలో ఎంతో ఉపయోగపడే పరిశోధన ఫలితాలను అందించిన ఫ్లెమింగ్ ప్రతి ఒక్కరి మదిలో
చిరస్మరణీయుడు.
- గడప రఘుపతిరావు
సెల్:9963499282