Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆశలు అడియాశల య్యాయి, కండ్లముందే కలల సౌధం కూలిపోతున్నా ఏమీ చేయలేని ఒక నిరాశ, నిస్పృహల్లో తెలంగాణ యువత నేడు విలవిలా కొట్టుకుంటున్నది. తల్లి స్తన్యం అందని పసిపిల్లల రోదనలా నేడు తెలంగాణ యువత పరిస్థితి ఉంది. ఉద్యోగాల కోసం కొట్లాడిన తెలంగాణలో నేడు నియామకాలు లేక కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉంది. లక్షలకు లక్షలు ఉద్యోగాలు వస్తాయని ఉద్యమ సమయంలో నమ్మించిన పెద్దలు, తమకు ఉద్యోగాలు (పదవులు) రాగానే పిల్లలకు ''ఉద్యోగాలు ఎక్కడివండి? ప్రభుత్వాలు ఎక్కడైనా వేలకు వేలు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందా?'' అంటూ నిండు సభలోనే ఎదురు ప్రశ్నించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రికే చెల్లుతుంది. ఉద్యోగాలు అడుగుతున్న యువత పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కడుపు మండి రోడ్లమీదకు వస్తుంటే అరెస్టు చేస్తున్నారు. ఇండ్ల తలపులు బద్దలు కొట్టి మరీ ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి తీసుకుపోతున్నారు. ఆగ్రహావేశాలు పెల్లుబికిన ప్రతిసారీ లక్షల ఉద్యోగాలంటూ ప్రకటనలు గుప్పించటం, కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలు, జోన్ల సమస్య అంటున్నారు. అరకొర నియామక ప్రకటనలు వెలువడినా కోర్టులు 'స్టే' ఇవ్వడం, నియామక ప్రక్రియ ఆగిపోవటం సాధారణమైంది. ఈజీ డ్యూయింగ్ బిజినెస్లో అంతర్జాతీయ స్థాయిలో మన హైదరాబాద్కు ర్యాంకు వచ్చినా, ఆకలిని నిర్మూలించటంలో అన్ని రాష్ట్రాలకంటే వెనుకబడే ఉంది.
విద్యా, ఉపాధి, శాంతికి దారి చూపుతాయని చెబుతున్న పాలకపక్షాలు ఉత్పాదక రంగంలోకి, సేవా రంగంలోకి యువతను పూర్తిగా నిరోధిస్తున్నారు. 2017లో ఐఎంఎఫ్ నిర్వహించిన ఒక సర్వేలో నిరుద్యోగంతో యువత పెడదారి పడుతుందని పేర్కొంది. నిరుద్యోగ సమస్యను ఒక సామాజిక అంశంగా చూడకుండా, ఆర్థిక కోణం నుండి చూడటంతో, ఈ సమస్యకు ఇప్పట్లో పరిష్కారం కనిపించే సూచనలు కనిపించటంలేదు. అదీగాక 85శాతం మంది నిరుద్యోగులు శూద్రవర్ణానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెంది ఉండటంతో, పాలకవర్గాలు పూర్తి నిర్లక్ష్యం పాటిస్తున్నాయి. ఉపాధి కల్పనకు కూడా తక్కువ నిధులు కేటాయించి సరిగ్గా ఖర్చుపెట్టకపోవటం పరిపాటైంది. వైద్య, విద్యా, సేవారంగాల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఆ ఖాళీలను నింపకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చాయి. జాతీయ స్థాయిలో అన్ని ప్రభుత్వశాఖల్లో వేళ్ల మీద లెక్కపెట్టిన ఒక్కొక్క శాఖలో కనీసం పదివేల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, ఒక్క తెలంగాణలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని వివిధ సర్వేలు తెలియజేస్తున్నాయి. కానీ తెలంగాణలో 2.5లక్షల మంది పట్టభద్రులు ఉద్యోగాల కోసం, వివిధ రకాల ఉపాధి అవకాశాల కోసం రోడ్లమీద కొట్లాడుతున్నారు.
పోలీస్ డిపార్టుమెంట్లో 37,820 ఉద్యోగాలు, విద్యుత్ శాఖలో 12,961, ఉపాధ్యాయ ఖాళీలు 12,500, గురుకుల పాఠశాలల్లో 8,511, వైద్య, ఆరోగ్య శాఖలో 8,347, సింగరేణిలో 7,485, ఆర్టీసీలో 3,950, కొత్తగా ఖాళీలు 3,925, రెవెన్యూ 2,506, వ్యవసాయ శాఖలో 2,435, అటవీ శాఖలో 2,033, ఉన్నత విద్యా శాఖలో 1,678, నీటి పారుదల శాఖలో 1,058, ఆర్థిక శాఖలో 720, మహిళా శిశు సంక్షేమ శాఖలో 600, ఆర్Êబిలో 550, ఎక్సైజ్ శాఖలో 400, రవాణా శాఖలో 200, పంచాయతీ రాజ్ శాఖలో 3,528 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం మీద 1,12,536 ఉద్యోగాలు ఖాళీలున్నాయి. రాష్ట్రం విడిపోవటంతో వివిధ శాఖల్లో నింపాల్సిన పోస్టులు వేల సంఖ్యలో ఉన్నాయి. మున్సిపల్ శాఖలో 1,925, పట్టణాభివృద్ధిలో 1,678 ఉద్యోగాలు ఖాళీలున్నా నింపటంలేదు.
కేంద్రంలో మోడీ అధికారంలోకి రాకముందు 2013లో ఒక సభలో మాట్లాడుతూ 10 మిలియన్ ఉద్యోగాలు నింపుతామని, కనుక తమకు అధికారాన్ని కట్టబెట్టాలాని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు, 2014 ఎన్నికల్లో కూడా కేసీఆర్ 5లక్షల ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని వాగ్ధానం చేసి ఉన్నాడు. నేడు మోడీ, కేసీఆర్లు ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాల్ని తీసేసేపనిలో ఉన్నారు. గ్రామీణ యువతకు అరకొరగా ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పని నిలిపివేయటం, చేసిన పనులకు వేతనాలు చెల్లించకపోవటం, పనిదినాలు తగ్గించటం వంటి చర్యలతో నేడు నగర రోడ్లు, అడ్డమీద కూలీలు లక్షల సంఖ్యలో కనిపిస్తున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ నుండి అందించిన సమాచారం ప్రకారం 2014-16 మధ్య కాలంలో 8 కేంద్ర ప్రభుత్వ శాఖలలో అనగా వైద్య, విద్య, ఆరోగ్యశాఖ, ఐటీ శాఖ, రవాణాశాఖ, నిర్మాణ రంగం వంటి వాటిల్లో 6,45,000 ఉద్యోగాలు చూపించారు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా తన పరిధిలో ఉద్యోగాలు నింపకుండా తమాషాలు చేస్తున్నది.
నేడు తెలంగాణ యువత పెనంమీద మాడుతూ పేలటానికి సిద్ధంగా ఉన్న మందు పాతరలా ఉన్నారు. ఉద్యోగాల కోసం కూడా ఆత్మహత్యలు చేసుకోవటం చాలా బాధాకరం. 1200 మంది యువకుల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో మిగిలిన యువతకైనా ఉద్యోగాలు వస్తాయా సందేహాస్పదంగా వుంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ''వచ్చే తెలంగాణలో మా వాటా ఎంతో, సామాజిక న్యాయం ఎలా ఇస్తారో చెప్పమని'' దళిత, బహుజనులు ప్రశ్నించారు. ముందైతే తెలంగాణ రానివ్వండి. అచ్చినంకా అన్ని తేల్చుకుందామని సామాజిక న్యాయవాదనను ఆనాడు పూర్తిగా పక్కదారి పట్టించారు.
- మన్నారం నాగరాజు
సెల్ : 9550844433