Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రశ్న, ఏడేళ్ల పిల్లాడు వాడి నాన్నని అడిగాడు. అసలు వాడికి 'చచ్చిపోవడం' అంటే ఏమిటో నిన్న మొన్నటి దాకా తెలీదు. ప్రతీ రాత్రి, దోమల్ని చైనా బేట్తో ఇల్లంతా తిరిగి కొట్టడాలూ, అవి కింద పడడాలూ, వాడు చూస్తూనే వున్నాడు. అయినా, అదేదో 'చంపుడు కార్యం' అని వాడికి అర్ధం కాలేదు. ''ఆ దోమలు ఏమవుతున్నాయి?'' అని వాడు ఎప్పుడూ అడగలేదు. ''అవి చచ్చిపోయినట్టే'' అని పెద్దవాళ్ళు వాడికి ఎప్పుడూ చెప్పలేదు.
ఒక రోజు తెల్లారే పాటికి వాకిట్లో గోడ పక్కన పాకుతూ ఒక తేలు కనపడింది, వాడి నాన్నకి. వాడు మొహం కడుక్కోడానికి వాకిట్లోకి వచ్చి, పాకే 'తేలు'ని చూసి, అది వాడి పాఠాల్లో కనపడే తేలు బొమ్మలాగే వుండడం చూసి, చప్పట్లు కొడుతూ, నవ్వుతూ, ''నాన్నా, 'తేలు'తో ఆడుకుంటా, ఆడుకుంటా. మా పుస్తకంలో వుంది'' అంటూ దాన్ని పట్టేసుకోబోయాడు! వాడి నాన్న, పెద్ద అరుపుతో వాణ్ణి వెనక్కి లా గేసి, దగ్గర్లో దొరికిన కొబ్బరి నెలచీపురు పట్టు కుని, ఆ పాకే దాని మీద రెండు దెబ్బలేసేశాడు. పాపం, అది పాకడం మానేసింది. ''దాన్ని ఎం దుకు కొట్టావు? ఎందుకు కొట్టావు? నేనాడు కుంటానన్నాగా?'' అని వీడు ఏడుపు మొదలుపె ట్టాడు. ''అమ్మో! అది తేలు! అది కుట్టిందంటే, చీమ కుట్టినట్టు వుంటుందనుకున్నావా? ఎంత బాధో తెలుసా? దానికి విషం వుంటుంది. దానితో ఆడుకుంటావా? భలే పని!'' అంటూ తేలు మీద ఇంకో దెబ్బ వేశాడు వాడి నాన్న. వీ డు ఏడుస్తూ, 'కొట్టకు నాన్నా! అది ఏడుస్తుంది.. కొట్టకు'' అంటూ వీడు ఆ చీపురు లాక్కోబోయా డు. వాడి నాన్న, ''అది చచ్చిపోయిందిలే. దానికి ఇంకా బాధ వుండదు. ఇలాంటి దాన్ని ఎప్పుడూ పట్టుకోకూడదు సుమా! ఫో, నువ్వు మొహం కడుక్కో!'' అని గట్టిగా అరిచాడు.
అయినా వీడు తెల్లబోతూ, ''చచ్చిపోయిం దా? అంటే, అది పాకదా?'' అన్నాడు. ''ఇంకేం పాకుతుంది? చచ్చిపోయిందిలే'' అన్నాడు నాన్న మళ్ళీ. ''మనం రోజూ దోమల్ని చంపడంలేదూ? అలాగే, ఇదీ చచ్చిపోయింది. మన వాకిట్లోకి వస్తే మనం వూరుకోవాలా? అది బైట ఎక్కడో తిరిగితే, అక్కడికి పోయి దాన్ని చంపుతామా? మన వాకిట్లోకి వస్తే మనల్ని కుట్టదూ?''
''ఇంకా కుట్టలేదుగా అది?''
''నువ్వు దాన్ని పట్టుకోబోయావు. నేను చూడకపోతే భలే అయ్యేది నీ పని! ఇంత చీకట్నే ఆస్పత్రికి పరిగెత్తాలి. అప్పుడే డాక్టర్లు వుండరు. చెప్తే వినవేం? ముందు మొహం కడుక్కో!'' అని అరిచి, నాన్న, పాకడం మానేసిన తేలుని ఒక చెట్టు కింద గొయ్యి తీసి కప్పెట్టాడు. దాన్ని మట్టి మీద పారేసి వూరుకుంటే, పిల్లాడు దాన్ని తప్పకుండా తీస్తాడని అనుమానం పుట్టింది నాన్నకి. అందుకే దాన్ని మట్టిలో కప్పాడు. వెనక్కి తిరిగితే, పిల్లాడు అదంతా చూస్తూ బిక్క మొహంతో అక్కడే వున్నాడు.
వాకిట్లోకి బైట, రోడ్డు మీద, వినాయకుడి బండి, బాజాలతో వస్తూ కనపడింది. పిల్లాడు అటు పరిగెత్తి వెనక్కి వచ్చాడు. ''నిన్న కూడా వచ్చారు నాన్నా!'' అని అరిచాడు.
ఆ విగ్రహాన్ని ''దేవుడు'' అంటారని, వాడికి, బళ్ళో, కొన్ని కధల్లో తెలుసు. దేవుడే అందర్నీ పుట్టిస్తాడనీ, అందర్నీ చంపుతాడనీ, ఆ కధల్లో విన్నాడు. 'చంపడం' అంటే ఏంటో, బళ్ళో తెలియలేదు. అడగలేదు. ''ఎందుకు నాన్నా? దేవుణ్ణి మన దుర్గం చెరువు దగ్గిరికి తీసుకెళ్తారెందుకూ? నిన్న తీసుకెళ్ళారుగా? ఇవ్వాళ ఇంకో దేవుడా?'' అన్నాడు.
నాన్న శాంతంగానే చెప్పాడు. ''ఈ చెరువు మనదే కాదు అందరిదీనూ.. నువ్వసలు మొహం కడగవా? నిన్నే కాదు, ఇవ్వాళే కాదు, ఇంకా పది రోజుల దాకా రోజూ తీసుకువెళ్తారు. వాళ్ళందరూ పూజలు చేసుకుంటారు. మనింట్లో మనం చెయ్యంలే. వాళ్ళెవరో చేసుకున్నారు. పూజ అయిపోయింతర్వాత, ఆ దేవుణ్ణి తెచ్చి ఇలాగే చెర్లో పడేస్తారు.'' - నాన్న చెబుతుంటే, పిల్లాడు కెవ్వుమంటూ, ''ఎందుకు? ఎందుకు? దేవుణ్ణి చెర్లో పడేస్తారా? మునిగిపోతాడు నాన్నా! మునిగిపోతాడు!'' అంటూ అరిచేశాడు.
నాన్న మళ్ళీ, ''ఆ పూజ చేసుకున్నవాళ్ళు ఏమంటారంటే, పూజ తర్వాత, దేవుడు చచ్చిపోయినట్టే అంటారు. దోమలు చచ్చిపోతే ఏం చేస్తాం మనం? వాటిని చీపురుతో వూడ్చేస్తాం రోజూ. తేలుని ఏం చేశాం? మట్టిలో కప్పెట్టేశాం. అలాగే, దేవుడు చచ్చిపోతే, నీళ్ళల్లో పారేస్తారు. అలా చేస్తే 'నిమజ్జనం' అంటారు. నిమజ్జనం అంటే... అంటే...'' - అది నాన్నకీ తెలియలేదు. ''నువ్వు మొహం కడుక్కుంటావా లేదా?'' అంటూ నాన్న లోపలికి వచ్చి, గబ గబా అలమారు తెరిచి, రెండు డిక్షరీలు తీశాడు. తెలుగు దాంట్లో, 'నిమజ్జనం' అంటే, 'స్నానం'. నాన్నకి కోపం వచ్చింది. ''అది స్నానమా? ఆ విగ్రహం స్నానం చేసి పైకి లేస్తుందా?'' అంటూ, గూగుల్లో చూశాడు. అందులో 'నిమజ్జన్' అంటే, 'విసర్జన్' అని వుంది. 'దేహాన్ని విసర్జించడం' అని! అదే మరి మరణం!
పిల్లాడు అక్కడికీ చేరాడు.
''నాన్నా! తేలు చచ్చిపోతే మళ్ళీ పాకదన్నావుగా? దేవుడు నీళ్ళల్లో మునిగిపోతే మళ్ళీ లేస్తాడా? చచ్చిపోడూ?''
''అవునవును. నువ్వే ఆలోచించు! అసలు మొహం కడిగావా?''
''నాన్నా! అసలు దేవుడు కూడా చచ్చిపోతాడా?''
నాన్న ఆశ్చర్యంగా వాణ్ణి చూశాడు. ''ఇప్పుడే బళ్ళోకి వెళ్తావుగా? బళ్ళో మీ టీచర్ని అడుగు. ఈ ప్రశ్నే అడుగు! 'స్నానం చేస్తాడు' అంటారేమో టీచర్! స్నానం అయ్యాక లేస్తాడా - అని కూడా అడుగు! టీచర్ ఏం చెప్పారో అది మాక్కూడా చెప్పు! వింటాం'' అన్నాడు నాన్న.
పిల్లాడు మొహం కడగడం మర్చిపోయి స్నానానికి పరిగెత్తాడు. వేడి నీళ్ళు వున్నాయో లేదో చూసుకోలేదు. అసలు, స్నానం కోసం కాదు ఆ ప్రశ్నకి జవాబు కోసం! 'దేవుడికి కూడా స్నానమా? దేవుడు కూడా చచ్చిపోతాడా? నిన్న చచ్చిపోతే, ఇవ్వాళ కొత్త దేవుడెవరు? రేపు కొత్త దేవుడెవరు? వచ్చే సంవత్సరం, సరి కొత్త దేవుడెవరు?'' - ఈ ప్రశ్నలన్నీ వాడికి రావు గానీ, అయినా, ఆ ఒక్క ప్రశ్న కోసమే, చన్నీళ్ళే గుమ్మరించుకున్నాడు. ''దేవుడు కూడా చచ్చిపోతాడా'' అనుకుంటూ.
- రంగనాయకమ్మ