Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతి అంటే మనకు ముందుగా గు ర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు, ఇం డ్లల్లో గొబ్బెమ్మలు, భోగిమంటలు, పాల పొంగులు, పతంగుల ఎగరవేతలు...గంగిరెద్దులోళ్ల ఆటలు... ఇది మనకు తెలిసిన సంక్రాంతి. కానీ ఇది రైతుల పండుగ, రైతులు పండించిన పంటను ఇంటికి తీ సుకొచ్చే రోజు, పడిన కష్టం చేతికొచ్చే రోజు, రైతు లు సంతోషంగా ఉండాల్సిన రోజు. మరి నిజంగా ఈ రోజు ''హలికుడు సంతోషంగా ఉంటున్నాడా? నేటి మన ఈ బంగారు తెలంగాణలో సైరికుని జీవితం సుఖంగా గడుస్తోందా..? అంటే లేదు అనే చెప్పుకోవాలి.నేడు మన తెలంగాణ సమాజంలో రైతు నిలువు దోపిడీకి గురవుతున్నాడు. పండించిన పంటకు మద్దతు ధర లేక, దళారులు చెప్పిన ధరకే పంటను అమ్మాల్సి వస్తోంది. కష్టపడి పండించిన పంటను అప్పుల బాధతో మన పంటకాపు ''అడ్డికి పావు శేరు'' లెక్కన అమ్ముకొని కాలం వెల్లదీస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతు వ్యవసాయదారుల బాధలు పట్టించుకొని సమస్యలు తీరుస్తారనీ ఆశగా ఎదురుచూడడం తప్ప ఏమీచేయలేని పరి స్థితుల్లో ఉన్నాడు రైతు.
సంక్రాంతి పండుగ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది గంగిరెద్దులోళ్లు. గ్రామాల్లో పండుగ శోభ తెచ్చేది వీళ్లేనని నిస్సందేహంగా చెప్ప వచ్చు. సంక్రాంతి పండుగకు మాత్రమే కనిపించే గంగిరెద్దులోళ్లు మన తెలంగాణలో 70వేల మంది ఉన్నారు. వారసత్వంగా కళారూపాన్ని నమ్ముకుని బతుకుతున్న వీరిని మన పాలకులు గుర్తించడంలేదు. సమాజంలో వీరిని బిచ్చగాళ్లలా చూస్తున్నారు. ''పొట్ట నింపుకోవడం కోసం కోటి తిప్పలు'' పడుతున్నారు. వీళ్లకు రేషన్ కార్డులు కూడా లేవు. కొందరు రాజకీయ నాయకులు వీరి బాధలు విని హామిలిచ్చినా అందు లో ఏ ఒక్క హామీకూడా నెరవేర్చలేదు. తెలంగాణ కళలకు పుట్టినిల్లు అని చెప్పుకునే మన సర్'కారు' గంగిరెద్దుల కళను ఎందుకు గుర్తించడం లేదోమరి..? ఇకనైనా ప్రభుత్వం వీరి కళను గుర్తించి ప్రతి ఒక్కరినీ ఆదుకొని సమాజంలో గుర్తింపు ఇవ్వాలి. కనుమరుగవుతున్న వారి కళను బతికించి, సంక్రాంతి శోభను తిరిగి తీసుకురావాలి. ఈ పండుగలో పతంగులు ఎగరవేయడం కూడా ఒక భాగం. కానీ వీటి పేరుతో పర్యా వరణానికి హాని కలిగించే మాంజాను ఎక్కువగా పట్టణాల్లో వినియోగి స్తున్నారు. ఈ మాంజా వల్ల పక్షులకు ఇతర జంతువులకు హాని ఉందని నిషేధం విధించినా పట్టణాల్లో యథేచ్ఛగా అమ్ముతున్నారు. దీన్ని ప్రభు త్వం పట్టించుకోకపోవడం గమనార్హం. అర్హులైనా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అంది, వ్యవసాయం పండుగ అయినప్పుడే పల్లెలు పచ్చగా మారినప్పుడే నిజమైన సంక్రాంతి.
- కిరణ్ పల్గుడెం
సెల్ : 8712344410