Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ జీవితాలపై ఒక్కప్పుడు వెండి తెర తీవ్ర ప్రభావం చూపింది. సాంకే తిక విప్లవం, మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత దాని ప్రభావం తగ్గిందనే చెప్పాలి. నేడు బుల్లితెర ముఖ్యంగా మహిళలపై తీవ్ర ప్రభావం చూపు తోంది. బుల్లితెరలో ఎన్నోరకాల కార్యక్రమాలు వస్తుంటాయి. కానీ మహిళలకు సీరియల్స్ అంటే ఎందుకంత ఇష్టం? గంటల తరబడి పొద్దున లేచినప్పటి నుండి రాత్రి దాకా ఎందుకు చూస్తున్నారు.? ఒకరోజు చూడకపోతే ప్రపంచం తలకిందులైనట్టు ఎందుకు భావిస్తున్నారు.? సృజనాత్మకత పెంపొందించే ప్రోగ్రామ్స్, సీరియల్స్ ఎందుకు ఎక్కువగా రావడం లేదు. బుల్లితెర కొన్నివేల మందికి ఉపాధి కలిపిస్తోంది, వాస్తవమే. కానీ కొన్ని కోట్ల మందిని సోమరిపోతులుగా కూడా చేస్తోంది. అదే ఆ సీరియల్స్ లేకుంటే లేదా ఆ సీరియల్స్ స్థానంలో మంచి కార్యక్రమాలు వస్తే గృహిణులకు ఏదైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది.
ఇష్టం వచ్చినట్టు మారణాయుధాలు వాడటం, శృంగారభరిత సీన్స్ తీయడం, తెలుగు సీరియల్స్‌లో అత్యధిక శాతం మహిళలను విలన్స్‌గా చూపించడం... అసలు కత్తులు, గన్నులు ఇంత సులభంగా వాడొచ్చనేలా చూపించడం చూస్తే నేరాలు పెరగడానికి సవాలక్ష కారణాలలో ఇది కూడా ఒకటి అని అనిపించక మానదు. పాపం ఆ రచయితలకు కథలు రాయడం రాదో లేక డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌కి లొంగిపోయి వారు ఎలా చెబితే అలా రాసేస్తున్నారో తెలియదు కానీ దరిద్రమైన కథలు, సమాజానికి ఏమాత్రం ఉపయోగంలేని కథలు! మరికొన్ని సీరియల్స్ అయితే కుటుంబం, ఇంట్లో అత్తకోడళ్ల గొడవలు అంతే. అంతకుమించి ముందుకు పోవడం గగనమే. ఇకపోతే కామెడి పేరుతో అసభ్యకరమైన, వెటకారంగా, వెగటుగా చేసే ప్రోగ్రామ్స్ కుటుంబంతో చూడాలంటే భయమేస్తోంది. పాపం ఆ హీరోయిన్స్‌కి బట్టలు వెయ్యరు, తెలుగు సినిమా, సీరియల్స్‌లో కథ తొంబై శాతం అలా ఉంటేనే మనుగడ సాగేల చేశారు. కుటుంబంతో కలిసి సినిమా చూసే అవకాశం లేకుండా చేశారు.
బుల్లితెర అంటే కుటుంబంతో కలిసి చూసేది అనుకుంటే దానిని కూడా నాశనం చేసేస్తున్నారు. మరి వీరికి అడ్డుకట్ట లేదా? ఏదైనా ప్రోగ్రామ్స్‌పై మహిళా సంఘాలు లేదా సామాజిక సంఘాలు పోరాడితే వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. ఒక కామెడీ షోలో ఒక మహానుభావుడు కామెడి పేరుతో బాడి షేమింగ్ చేస్తాడు, మహిళలను కించపరుస్తాడు, ఇంకొకరు 24 గంటలు పక్కోడి భార్యను ఎలా టార్గెట్ చేయాలని విపులంగా చూపిస్తాడు. దానికి న్యాయనిర్ణేతలు మహా బాగా చూపించావు అని పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఇలాంటి చెత్త కార్యక్రమాలపై ప్రభుత్వం కనీసం దృష్టి కూడా పెట్టదు. సంసారాన్ని బజారులో పెట్టి విషయం మొత్తం బట్టబయలు చేసి వారికి న్యాయం ఏమైనా చేస్తారా? ఏమో మరి, న్యాయం సంగతి పక్కనపెడితే వారి సంసారాలు బజారుకీడ్చి సొమ్ము చేసుకునే ప్రోగ్రామ్స్‌ని నివారించాల్సిందే. కొన్ని సీరియల్స్‌లో అయితే పిల్లలను విలన్స్‌గా చూపెడుతున్నారు. కనీసం వార్తలైన చూద్దామంటే ఒక చానెలేమో ప్రభుత్వ భజన చేస్తుంది. మరొక చానల్ ప్రతిపక్ష భజన చేస్తుంది. అసలు నిజమైన వార్తలు ఎక్కడ వస్తున్నాయి? ఎవరి భజన వారిది! ఇదీ మన బుల్లితెర పరిస్థితి. ఇంకో చానలేమో కొంతమందిని ఒక ఇంట్లో బంధించి గొడవలు పెట్టి అందులో నుండి మానవ విలువలు, మానసిక స్థితి అని ఇంకా ఏదో గొప్ప గొప్ప మాటలు చెబుతుంది. నేడు ఖచ్చితంగా బుల్లితెరలో వస్తున్న ప్రోగ్రామ్స్‌పై సెన్సార్ ఉండాల్సిందే.
పాపం కొన్ని సీరియల్స్ రాసే రచయితలు ఒక్కో సినిమా నుండి ఒక్కో సీన్ తీసుకొని నడిపించేస్తున్నారు. సరే ఇంత పనికిమాలిన సీరియల్స్‌కి రేటింగ్ ఎక్కువగా ఎందుకు ఉంటోంది. కేవలం వారిని మాత్రమే నిందిస్తే సరిపోతుందా? కాదు ఎంతమాత్రం కాదు. నిజానికి ఎక్కువగా మహిళలు సీరియల్స్ చూస్తున్నారు. అవి మన జీవితాలకు ఉపయోగపడితే పర్వాలేదు. కానీ అసలు ఏమాత్రం పనికిరాని ఈ సీరియల్స్ చూస్తున్న వారు, చూసి ఏమి సాధించినట్టు.? 'వాళ్లు చూపిస్తున్నాయి మేము చూస్తున్నాం' అని కాకుండా వాటిని బహిష్కరించండి. మీకు తెలియకుండానే మీ సమయాన్ని మింగుతున్న పనికిమాలిన సీరియల్స్ చూడటం మానేసి ఏదైనా కొత్తగా నేర్చుకోండి. అది మీకూ, సమాజానికి కూడా ఉపయోగకరం.
- నిజాగ్ని
సెల్ : 86393 74879