Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో వి మానయాన రంగం అనూహ్యంగా అభి వృద్ధి పధంలో దూసుకెళ్తున్న వేళ విమానయాన సంస్థలు ధరలను సామాన్యుడికి అం దుబాటులోకి తేవాలని పోటీ పడడం హర్షణీయం. కానీ ఈ పరుగులో ఒకప్పుడు మార్కెట్లో 22.5 శాతం వాటాతో 195 రోజు వారి సర్వీసులు, 37 గమ్య స్థానాలతో ఒక్క వెలుగు వెలిగిన జెట్ ఎయిర్ వేస్ ప్రస్తుతం ఎనిమిది వేల కోట్ల రుణ ఊబిలో చిక్కుకొని, రుణదాతల చేతికి చిక్కి తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటోంది. మరోపక్క 2005 నుండి ప్రారంభమైన స్పైస్ జెట్ దేశీయ విమాన యానంలో 13.6 వాటా కలిగి రెండో పెద్ద విమానయాన సంస్థగా దూసుకుపోతో ంది.1993 నుండి మొదలైన జెట్ ఎయిర్ వేస్ ప్రస్థానం నాలుగు బోయింగ్ 737-300 విమానా లను లీజుకు తీసుకొని కార్యకలాపాలను ప్రారంభిం చి ఈ సంస్థ అంచెలంచలుగా ఎదిగి 2019 దాకా అంటే 27 సంవత్సరాలు ఒక్క ప్రమాదం కూడా లేకుండా ప్రజలను తమ తమ గమ్యాలకు చేరవేయ డంలో సఫలీకృతమైంది. 2017 దాకా దేశంలో వి మానయానంలో రెండో స్థానంలో ఉన్న జెట్ ఎయిర్ వేస్ తాజాగా ఎనిమిది వేల కోట్ల రుణభారంతో సంస్థ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుర్భర పరిస్థితిలో చతికిలపడిపోవడం సంస్థ విధానపరమైన లోపాలను ఎత్తిచూపిస్తోంది. ఇతర విమాన సంస్థలతో పోటీలో దీటుగా నిలబడడానికి విమానధరలను బాగా తగ్గించేయడం, నష్టాలను అంచనా వేయడంలో ముందు చూపు లేకపోవడం, నిధులను వేరే సంస్థలకు బదలాయించడం వంటి తప్పిదాలతో సంస్థ పెనురుణభార ఊబిలో కూరుకుపోయి ఏకంగా సంస్థ మూసివేయాల్సిన స్థితికి దిగజారిపోవడం స్వయంకృతాపరాధం.. కొన్ని బ్యాంకులు, అగ్రగామి ఫైనాన్స్ సంస్థలు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు వస్తాయనుకున్నా చివరి క్షణంలో ఆ ఆశ కూడా నీరుగారిపోవడంతో ఈ సంస్థ శాశ్వతంగా మూసివేయబడింది. స్పైస్ జెట్ సంస్థ కూడా తొలుత ఇటువంటి ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టి అప్పుల ఊబిలో కూరుకున్నాక, యజమాన్యం మార్పుతో కోలుకుంది. ఇండిగో సంస్థ కూడా నష్టాల తాకిడి ప్రారంభమయ్యాక, యజమాన్యం సమయస్ఫూర్తితో వెంటనే కోలుకుంది. ఎయిర్ ఇండియా నష్టాలలో కొట్టుమిట్టాడుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ సంస్థను అమ్మేసే ప్రయత్నాలను ప్రారంభించింది. మొత్తానికి దేశీయంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ధరలకు విపరీతంగా రెక్కలొచ్చి ప్రయాణికులకు ఊపిరి సలపడం లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి విధానపర నిర్ణయాలు, సంస్థాగత మార్పులతో దేశీయ విమాన రంగాన్ని గట్టెకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- సి.కనకదుర్గ
సెల్ : 7674887456