Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రోల్ అంటే వికృతమైనది లేదా వికృతమైన రూపమని అర్థం. సోషల్ మీడియాలో జరిగే ట్రోల్ మనషుల వికృత రూపాలకు అక్షరరూపమని చెప్పవచ్చు. ఇంటర్నెట్ సౌకర్యం పెరిగిపోవడం, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండటం, ప్రతి విషయంపై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేయడం, ప్రతి విషయాన్ని చెడు కోణంలో చూపించడం, హ్యాష్ ట్యాగ్ చేసి వ్యక్తిని లేదా సంస్థను ట్రోల్ చేయడం దీని లక్ష్యం. ట్రోల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నారని మన దేశంలో సాక్ష్యాలతో సహా పట్టుకున్న సందర్భాలున్నాయి. ట్రోల్ ప్రజాస్వామ్యానికి విగాతాన్ని కలిగిస్తుంది. అసలు ఇది ఎలా మొదలైంది? కేవలం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ వలనే జరుగుతోంది. చాలా సులభంగా మన అభిప్రాయాలను వెల్లడి చేసే సదుపాయం మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత నియంత్రణ లేకపోవడమే దీనికి ప్రథమ కారణం. రాజకీయ నాయకులను, సినిమా తారలను ఎవరినీ వదలడం లేదు. ప్రతి ఒక్కరినీ ట్రోల్ చేస్తున్నారు. మంచి విషయాలను ట్రోల్ చేయవచ్చు. అలా చేస్తే ఎవరు చూడరు? అందుకే నెగటివ్‌గా రాసి అలజడి సృష్టించి హాని చేకూర్చడమే ట్రోల్ లక్ష్యం.
ముఖ్యంగా ఈ ట్రోల్ ఆడవారి దుస్తులపైనే ఎక్కువగా ఉంటోంది. ఎవరైనా ఒక మోడరన్ డ్రెస్ వేసుకొని ఫేస్ బుక్ లేదా ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్ట్ చేస్తే వెంటనే ఈ ట్రోలర్స్ చేరిపోతారు. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడటం, అసభ్యంగా దూషించడం, వారి ఫొటోలను అన్ని ఫేస్ బుక్ పేజీలలో, ఫేస్ బుక్ సమూహాలలో, బ్లాగ్స్, వెబ్ సైట్స్‌లో ''ఈ ఫోటోలో ఉన్న దీన్ని చూడండి ఎలా డ్రెస్ వేసుకొని మన సంప్రదాయాన్ని నాశనం చేస్తుందో'' అంటారు. అలా ఆ అమ్మాయిని ట్రోల్ చేసి షేర్స్, లైక్స్, కామెంట్స్ చూసి వికృతానందం పొందుతారు. స్త్రీల దుస్తులపై వీళ్ల పెత్తనం ఏంటో! వీరెవరు స్త్రీలను నియంత్రించడానికి. దుస్తుల వల్లే ఎక్కువగా మానభంగాలు జరుగుతున్నాయంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఎనబై శాతం మానభంగాలు ఆడవారు వారి సాంప్రదాయ దుస్తులలో ఉన్నప్పుడే జరిగాయి, కేవలం పదిశాతం మానభంగాలే వెస్ట్రన్ దుస్తులలో ఉన్నప్పుడు జరిగాయి. అందులో అధికశాతం చిన్నపిల్లలే. చిన్నపిల్లలు ఫ్రాక్ వేసుకోవడం కూడా తప్పేనా?
నేడు సమాజానికి రకరకాల ట్రోల్స్ రకరకాలుగా హాని చేస్తున్నాయి. మరి దీనిని అరికట్టడం ఎలా? చాలా సులభం. ట్రోల్ అని తెలిసి కూడా మీరు కామెంట్ లేదా మీ అభిప్రాయం ఖండిస్తూ పోస్ట్ చేస్తే అది మరింత విస్తృతం అవుతుంది. మీ కామెంట్‌ని వ్యతిరేకిస్తూ మళ్లీ కామెంట్స్ చేస్తారు. మీలో కూడా కోపాన్ని, ద్వేషాన్ని రేకెత్తించి ఎలాపడితే అలా మాట్లాడేలా చేయడమే వారి లక్ష్యం. అందుకే అనవసరమైన విషయాలపై మన స్పందన సోషల్ మీడియాలో తెలియజేయడం కూడా హానికరమే.The rapid Flammer అంటే మంటరాజేయడం. ఈ ట్రోల్‌లో మంచి విషయాన్ని చెడుగా ప్రచారం చేసి మంట రాజేస్తారు. ఉదాహరణకు ఇటీవల ఇర్ఫాన్ పఠాన్ తన భార్యతో ఫొటో దిగి పోస్ట్ చేశాడు. దానిని ట్రోల్ చేశారు ''నువ్వు ఒక ముస్లిం అయ్యుండి భార్య ఫొటో ఎలా పెట్టావ్'' అని? ట్రోల్ చేశారు. ఇలా ఎంతోమంది ట్రోలింగ్ భారినపడినవారే. నిజానికి ఇది ప్రజాస్వామ్యనికి వ్యతిరేకం.
పిగ్గిష్ గ్రామర్ ట్రోల్ అంటే మీరు ఏదైనా రాయండి? దేని గురించైన రాయండి? వీరి లక్ష్యం మాత్రం మీరు రాసిన దానిలో ఒక పదం పట్టుకొని ఇది ఎందుకు రాశావు? ఇలా ఎందుకు రాశావు? నువ్వు చేసింది తప్పని చెప్పి మనం ఏ సందర్భంలో అలా రాశామో దానిని వదిలేసి ఆ పదాన్ని మీరు అన్నట్టుగా ట్రోల్ చేస్తారు. అందుకే సోషల్ మీడియాలో రాసే ప్రతిపదం సరిచూసుకోవాలి. అంటే వారికి భయపడమని కాదు. మనం చేసే చిన్న తప్పు మనల్ని నగ్నంగా నిలబెడుతుంది. Retroactive Stalker అనే ఈ రకమైన ట్రోలర్స్ మీ టైంలైన్ మొత్తం వెతికి మీరు ఐదు సంవత్సరాల ముందు రాసిన పోస్ట్‌లో ఒక వాక్యం తీసుకొని అది తప్పని చెప్పి మిమ్ములను తప్పుడు వారిగా చూపిస్తారు. ఉదాహరణకు నేను మూడు సంవత్సరాల కింద ఒక సందర్భంలో ఎవరైనా మీకు శృంగారం అంటే ఇష్టమా? అని అడిగిన దానికి అవును ఇష్టమేనని చెప్పి ఉంటాను అనుకోండి. ఫలానా వ్యక్తికీ శృంగారం అంటే అమితమైన ఇష్టం. అది లేకుండా ఉండలేదని ట్రోల్ చేస్తారు. అందుకే అవసరంలేని వాటిని మన టైంలైన్ నుండి తీసేస్తే మంచిది.
Lame teenage troll ఈ ట్రోల్‌లో నర్మగర్భంగా ఒక వాక్యం రాసేస్తారు. దానిపై మన అభిప్రాయాలు పోస్ట్ చేయమంటారు. ట్రోల్ చేస్తారు. దాదాపుగా వీళ్లు టీనేజ్ వాళ్లై ఉంటారు కానీ టీనేజ్ ముసుగులో నలబై సంవత్సరాల వయసు వారు కూడా ఇలా చేస్తున్నారు. ఉదాహరణకు ''నేను రబ్బర్ని మీరు జిగురులాంటి వారు అంటారు'' మాములుగా చదివితే ఏముంది ఇందులో అనుకుంటారు కాని ఇది అతి నీచమైన భాష. అంగాలను పోలుస్తూ రాసే ఈ ట్రోల్ టీనేజ్ వారిని అధికంగా ఆకర్షిస్తుంది. సెల్ఫ్ ఫీడ్ ట్రోల్ అంటే ఒకరు రాసిన పోస్ట్ తప్పు అని చెప్పిన కూడా అందరితో వాదిస్తూ ఉంటారు. అందరూ నువ్వు తప్పుగా రాశావు. నువ్వు చేసింది తప్పు అని చెప్పినప్పటికీ వాదిస్తూనే ఉంటారు. దాని ద్వారా వారు ట్రోల్ అవ్వడమే కాకుండా అందులో మనల్ని కూడా భాగస్వామిగా చేస్తారు.
షేరింగ్ ట్రోల్‌లో మీ అభిప్రాయాన్ని ఎదుటివారు వ్యతిరేకిస్తారు. మీరేమో నీకెందుకని మందలించారనుకోండి, మీ వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని అన్ని సమూహాలలో షేర్ చేయడం పలనా వ్యక్తి ఇలా అన్నారని చెప్పి ఉసిగొల్పడం. కత్తి మహేష్ విషయంలో ఇదే చేశారు. ఆయన మంచి అన్నాడో చెడు అన్నాడో అది పక్కనపెడితే ఆ వ్యక్తిగత ఫోన్ నెంబర్ తన అనుమతి లేకుండా పోస్ట్ చేసి ఆయనపై దాడి చేయించడం తప్పే. ఇలా చాలామంది అమ్మాయిల ఫోన్ నంబర్స్‌ను ట్రోల్ పేజీలలో పోస్ట్ చేసి ''దీనికి ఫోన్ చేసి రేటు మాట్లాడుకోండి'' అని పోస్ట్ చేస్తారు. దాని వల్ల ఆ అమ్మాయికి విపరితమైన ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఎలాపడితే అలా మాట్లాడుతుంటారు. కొన్ని ట్రోల్స్ అయితే సెంటిమెంటల్‌గా ఉంటాయి. అమ్మ, స్నేహితుడు, దేశం ఇలా సున్నితమైన అంశాలను టచ్ చేసి ట్రోల్ చేస్తారు. అది పాసిటివ్‌గా అయినా ఉండవచ్చు లేదా నెగటివ్‌గా అయినా ఉండవచ్చు. ఎక్కువగా నెగటివ్‌గానే ఉంటాయి. ఇటీవల ఒక కులహత్య జరిగింది. అబ్బాయి పేరు ప్రణయ్ అమ్మాయి పేరు అమృతవర్షిని. ఆ అమ్మాయి చెప్పే మాటలను కొందరూ పాజిటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. ఒక మనిషి బాధలో ఉన్నారా? వారి మానసిక పరిస్థితి ఏంటి? ఇవన్నీ వారికి అవసరం లేదు. అలజడి చేసి వారిని కించపరిచి ట్రోల్ చేయడమే. ఇలాంటి మృగాలను తప్పకుండా శిక్షించాలి.
ఇక హీరోయిన్స్‌పై అయితే ఎలా పడితే అలా ట్రోల్ చేస్తున్నారు. వారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వారి ఫొటోలను మార్ఫ్ చేయడం, అసలు దీనికి అడ్డుకట్టే లేదు. ఏదో సినిమాలో వారు చేసిన క్లిప్పింగ్స్ తీసుకొచ్చి ట్రోల్ పేజీలలో పోస్ట్ చేసి వారు నిజంగా ఇలా చేశారని చెప్పడం, ఫాల్స్ న్యూస్ రాసి ట్రోల్ చేయడం జరుగుతోంది. అసలు హీరోయిన్స్‌పై జరిగే ట్రోల్ చూడటానికే మనకు జంకు పుడుతుంది. ఈ ట్రోల్ దాదాపు ఫేక్ ఐడీలతోనే జరుగుతోంది. మంచి ముసుగు వేసుకున్న వారు మన చుట్టూ ఉండి ఇలాంటి కిరాతకాలకు ఒడిగడుతున్నారు. ఇక హీరోయిన్స్ విషయం పక్కనపెడితే సాధారణమైన అమ్మాయిలను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మనకు తెలియకుండానే మన ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కనీసం ఆ ఫొటో ఎప్పుడు ఎక్కడ తీశారని కూడా మనం ఊహించలేము.
ఫ్రాడ్ ట్రోల్స్ ''ఈ లింక్ ఓపెన్ చేసి పది నిముషాలు అలానే పెడితే వందరూపాయలు వస్తుంది'' అంటారు తీరా ఓపెన్ చేసిన వెంటనే మీ సమాచారం మొత్తం వారికి వెళ్లిపోతుంది. అవసరమైతే మీ ఎకౌంటు హ్యాక్ కూడా చేస్తారు. అలా చేయడమే కాకుండా మీ టైంలైన్లో న్యూడ్ వీడియోస్ షేర్ చేసి మిమ్ములను తప్పుడు వారిగా చిత్రీకరిస్తారు. ఎన్నో రకాల ట్రోల్స్ ఉన్నాయి. అన్నింటి లక్ష్యం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపి ప్రచారం చేయడం, సమాజానికి హాని చేకూర్చడమే.
మొత్తం మీద ఉన్న విషయాన్ని తప్పించి విభేదాలు, ఉద్రిక్తత రగిలించడం, విషయాలను, దూషణలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి గొడవలకు దిగడం, వ్యక్తులను మానసికంగా హింసించడాన్ని ట్రోలింగ్ అంటారు. వాటిని చదివేవారు తీవ్రంగా స్పందించేటట్టూ, చర్చ పక్కదారి పట్టేటట్టూ చెయ్యడమే ట్రోలింగ్ లక్ష్యం. కొందరు వ్యక్తుల్ని టార్గెట్ చేసి ''వీరిని రేప్ చెయ్యాలి, హత్య చెయ్యాలి'' అనే కామెంట్లు బెదిరింపులు ట్రోలింగ్‌లో భాగమే. అందుకే అవసరమున్న మేరకే సోషల్ మీడియా ఉపయోగించాలి. మనం ఏం చేస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయని ఆలోచించి జాగ్రత్తగా పోస్ట్ చేయాలి. ట్రోల్స్‌పై సైబర్ పోలీసులు అప్రమత్తంగా ఉండి వేసి ఇలా చేసేవారిని పట్టుకొని శిక్షలు వేయాలి. ట్రోల్ చేయడం వల్ల ఎలాంటి శిక్షలు పడతాయో వివరించాలి. అలాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి సాధారణ ప్రజలకు తెలియజేయాలి. అప్పుడే ట్రోలింగ్ భూతాన్ని అరికట్టగలం.
- నిజాగ్ని
సెల్ : 9700747280