Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాణానికి రకరకాల వస్తువులను సమకూర్చుకుంటాం. సరైన వస్తువుల పొందిక పనిచేసే వారి నైపుణ్యం బట్టి నిర్మాణాలు గొప్పగా వస్తాయి. అలాగే వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా వస్తువులను (లక్షణాలను) సమకూర్చుకోవాలి. నాణ్యమైన వస్తు సామగ్రి ఉంటే కట్టడాలు నిలుస్తాయి. అలాగే గొప్ప లక్షణాలు అలవర్చుకుంటే వ్యక్తి మహోన్నతుడవుతాడు. లేదా నిర్మాణం కూలిపోతుంది. వ్యక్తి చరిత్ర హీనుడవుతాడు. మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడేవి రెండు. ఒకటి అనువంశికత, జన్మతా తాత తండ్రుల నుంచి సంక్రమించడం Heridity అంటారు. రెండు పరిసరాల ప్రభావం చేత స్వంతంగా తనను తాను మలచుకుంటూ ఇతరులను చూస్తూ తప్పొప్పులను సరిచేసుకుంటూ ఎదగడం. అరిషడ్వర్గాలను తొలగించుకోవడం అని చెబుతారు. 'అరి' అంటే శత్రువులు. షట్ అంటే ఆరు. ఆరుగురు శత్రువులు అని అర్థం. ఆ ఆరుగురు శత్రువులు ఎవరంటే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ శత్రువులు అంతర్గత శత్రువులు. వీరితో పోరాటం అంటే వ్యక్తి తనతో తాను చేసే పోరాటం. తనలో ఉన్న గుణాలపై సాగించాల్సిన పోరాటం. పైన తెలిపిన ఆరు గుణాలు వ్యక్తిని పతనం వైపునకు నడిపిస్తాయి. ''మానవుడు ధ్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు. కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు'' అని అంటారు గౌతమ బుద్ధుడు.
For wherever is Jealousy and Selfish ambition, there you will find disorder and Evil of every kind ఇది జేమ్స్ 3:16 బైబిల్లోని మాట. ధర్మశాస్త్రాలు కూడా ఈర్ష్యాద్వేషాలు మనిషిని పతనం చేస్తాయనే చెబుతున్నాయి. ఒకరిని చూసి ఓర్వలేకపోవడం ఈర్ష్య. నేను బాగుపడాలి, ఎదుటివాడు పాడైపోవాలి అనుకోవడం మాత్సర్యం. కోపం వీటికున్న మరో ఆధారభూతం. అవలక్షణం. Green Eye గా పిలువబడే జెలసి రాజ్యాలనే నాశనం చేసింది. జీవితాలను చిన్నాభిన్నం చేసేస్తుంది. తిరిగి తిరిగి 'బౌన్సింగ్ ఎఫెక్ట్'లాగా వ్యక్తినే నాశనం చేస్తుంది. మానసిక సంతులనం కోల్పోయి మనిషి రోగగ్రస్తుడు అవుతాడు. ఇతిహాసాలలో ధుర్యోధనుని పాత్ర దీనికి ఒక మంచి ఉదాహరణ. అన్ని ఉండీ ఈర్ష్య చేత పెచ్చుమీరిన మహత్వాకాంక్ష చేత చరిత్ర హీనుడ య్యాడు. కురువంశాన్ని సర్వనాశనం చేసేసాడు. తనకన్నా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్లను చూసి, పాండవుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను వారికి గల మంచి పేరును చూసి ఓర్వలేక శకుని వంటి దుష్టుడి మాటలకు లోబడి పాండవులను నాశనం చేయాలనుకుని తానే నాశనమయ్యాడు. సంపూర్ణ కురువంశ పతనానికి కారణమయ్యాడు. ఇది కేవలం 'ఈర్ష్య' అనే భయంకరమైన జాఢ్యం వలననే జరిగింది.
సైకాలజిస్టులు దీనిని ఒక మానసిక రోగంగా చూస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త 'సిగ్మండ్ ఫ్రాయిడ్' జెలసీని 'నార్సిస్టిక్ ఊండ్' (Narcissistic wound) అంటారు. అంటే తనమీద తనకు విపరీతమైన శ్రద్ధ (మోహం) కలిగి ఉండటం అన్నమాట. ఫ్రాయిడ్ జెలసీని నాలుగు విభాగాలు చేశారు. 1.కోల్పోవడం వలన కలిగిన బాధ నుండి ఏర్పడే ఈర్ష్య. 2. తనపైన తనకు గల విపరీతమైన నమ్మకం, ఇగో. 3. విజయం పొందిన వారి యెడల శత్రుభావన. 4. ఆత్మ నింద.
ధర్మ శాస్త్రాలు చెప్పినా, మనస్తత్వ శాస్త్రవేత్తతలు చెప్పినా మన నిత్యజీవితంలో అనుభవజ్ఞులు తెలిపినా, ఎవరు చెప్పినా తెలుసుకోవాల్సింది ఒక్కటే. అది ఈర్ష్య, అత్యంత నిమ్నస్థాయికి చెందిన మానసిక స్థితి అని. అన్ని అనర్థాలకు మూలమని. దీని తోబుట్టువులే, మాత్సర్యం, మదం, కోపం. ఈర్ష్య బాధల్లోంచి నైరాశ్యంలోంచి ఉద్భవిస్తుంది. ఇది నకారాత్మక చర్య. ఒక వ్యక్తి వేదనకు, నైరాశ్యానికి గురైనప్పుడు అతనిలోని గుణాల వలన (సంక్రమిత లేదా ఆర్జిత లక్షణాలు) అతని మానసిక స్థాయీ భావాలు పట్టుదలగా మారి లక్ష్యం వైపుకు కొందరిని నడిపిస్తాయి. మరికొందరిని 'నార్సిస్టిక్ ఊండ్' లక్షణాలతో ఎదుటివారిపైన ఈర్ష్య, ధ్వేషం ఏర్పర్చు కునేలా నెగెటివ్ క్వాలిటీస్, డైవ్ చేస్తాయి. ఎదుటి వ్యక్తి ఎదుగుదలను చూడలేక, అందరిలో వారికి వస్తున్న పేరు ప్రతిష్టలను ఓర్వలేక, పదవి కోసం, సమూహాల్లో, కుటుంబంలోనూ, సంస్థలలోనూ ఎందరో ఈర్ష్య అనే గ్రీన్ ఐ జ్వాలలకు మాడి మసైపోతున్నారు. ఈర్ష్య ఒక క్యాన్సర్ లాంటిది. వాతావరణాన్ని పాడుచేయడం వరకే కాకుండా చివరికి ఈర్ష్య చెందే వ్యక్తులు కూడా మానసిక రోగులవుతారు. ఉద్యోగాలలో, క్రీడారంగాలలో, కళా రంగాలలో, రాజకీయాలలో, వ్యవస్థలోని చాలా వర్గాలలో ''ఈర్ష్య'' ''కుళ్లు' మహమ్మారిగా మారుతు న్నాయి. సమాజంలోని చాలా అనర్థాలకు కారణమవుతున్నాయి. చివరికి కుటుంబ వ్యవస్థలో కూడా.
ఈర్ష్యను జయించడం ఎలా?
ఒక వ్యక్తి తనను తాను గొప్పగా మలచుకోవడానికి తనలోని లోపాలను గ్రహిం చగలగాలి. ఒప్పుకోవాలి. Failures stepping stones of success అంటారు. కానీ అది నిజం కాదు. అపజయాలు, విజయాలుగా మారవు. ''అపజయాలకు కారణమైన తప్పులను సరిదిద్దుకుంటే విజయం లభిస్తుంది'' Corrections of mistakes are success అనాలి. ఈర్ష్యాళువు అయ్యే వ్యక్తి తననుతాను గమనించుకోవాలి. తనలోని గొప్ప లక్షణాలను బలహీనతలను రాసుకోవాలి. రెండింటిలోనూ ఉన్న తేడాలను చదవాలి. అప్పుడు కచ్చితంగా ఏది ఎంత అవసరమో తెలుస్తుంది. అంచనా వేయగలుగుతారు. ఎందుకు ఎదుటివాళ్లను చూసి ఓర్వలేకపోతున్నామో తెలుస్తుంది. పేరు తెచ్చుకోవాలంటే ఎదుటి వారిని అప్రతిష్టపాలు చేయనవసరం లేదు. తనలో దక్షతను పెంచుకోవాలి. వేదన, నైరాశ్యం స్థానంలో Good sitting చేసుకోవాలి. ముందు చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఒక్కో లక్ష్యం సాధిస్తుంటే సంతృప్తిగా ఉంటుంది. ఆలోచనలు ఆచరణలు జెలసి సకారాత్మకమైన మార్గం వైపుకు మళ్లగలవు. ఆత్మనింద చాలా చెడ్డది. ఆత్మస్తుతి కూడా మంచిది కాదు. ఆత్మ నిందలోంచి బయటపడటానికి కూడా తనలో ఉన్న గొప్ప క్వాలిటీలను గమనించాలి. ప్రతి వారిలో ఒక Unique లక్షణం ఉంటుంది. దానిని వెలికితీయాలి. సాంగత్యం కూడా చాలా ముఖ్యమైంది. మన లక్ష్యసాధనకు స్ఫూర్తిదాయకంగా ఉండే వ్యక్తుల మధ్యన గడపగలిగేలా చూసుకోవాలి.
ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు గొప్ప స్థాయికి చేరుకుంటున్నాడని ఓర్వలేని చిన్నవాడు తన చెడు స్నేహితుల సహాయంతో అన్నయ్యను నరికి చంపాడు అన్నది ఒక పత్రికలో వచ్చిన వార్త. ఇలా ఈర్ష్య విచక్షణ మరిచేలా చేస్తుంది. దీనిలోంచి బయటపడాలి. అలాంటి ప్రభావాలకు లోనవుతున్నామనుకుంటే లేదా మన పిల్లలు గురవుతున్నారనిపిస్తే వారిని మంచి మాటల ద్వారా ప్రేమాభిమానాల ద్వారా మార్చాలి. తల్లిదండ్రులు గమనిస్తుండాలి. ఇక్కడ మరో పొరపాటు 'పోల్చుకోవడం'. చాలా చెడు అలవాటు. ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒక రకం కాదు. ఎవరి గొప్ప వారిదే. ముఖ్యంగా పిల్లలను పోల్చొద్దు. ఈర్ష్య మానసిక రోగంగా మారకుండా వాళ్ల వ్యక్తిత్వ వికాసానికి అడ్డుపడకుండా చూడాలి. చాలా చిన్నదిగా అనిపించే కుళ్లు - ఈర్ష్యాద్వేషాలుగా మారి ఎదుటి వారికి హాని కలిగిస్తుంది. చివరికి వ్యక్తి పతనానికి అప్రతిష్టకు కారణమవుతుంది. ఎవరికి వారు తమలోని సామర్థ్యాలను పెంపొందించుకుని ముందుకు సాగాలి. 'నిన్ను నీవు ప్రేమించుకో, నీలోని సుగుణాలను పెంపొందించుకో' చివరగా సంతృప్తి.. ఇది మహోన్నతమైన గుణం. సంతృప్తి కలిగిన వ్యక్తి సదా చిరునవ్వులు చిందించగలడు. హాయిగా ఎదుటివారిని ప్రశంసించగలడు. గుండెనిండా శ్వాసించగలడు. ఈర్ష్యకు జీవితంలో తావు లేకుండా జీవించగలడు. నవ్వుతూ నవ్విస్తూ సంతృప్తితో సాగితే బీ హ్యాపి లైఫ్. జెలసీ బాగ్ జాతాహై.
- రమాదేవి కులకర్ణి
సెల్ : 8985613123