Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ధీర''...
ఇదొక యుద్ధగీతం.
స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఊహకైనా అందని రోజుల్లో...
నిశ్శబ్దం నేరంతో సమానమైన వేళల్లో...
దిక్కులు దద్దరిల్లే విస్పోటనమైన యోధుల చరితం.
విప్లవాన్నే జీవితంగా శ్వాసించిన వీరగాథల సమాహారం.
ఆశయాలకు అశువులు ధారపోసిన అమరుల స్మరణం.
జీవితానికి అమరత్వాన్ని మించిన సార్థకత ఏముంటుంది..? మనిషిని మనిషిగా నిలబెట్టడం కోసం బలిదానాలకు సిద్ధమైన మానవతామూర్తుల జ్ఞాపకాలకు మించిన స్ఫూర్తి ఏముంటుంది..? మానవ కళ్యాణానికి మరణాన్నే ధిక్కరించిన ఆ అమరుల జ్ఞాపకాలను ఇక్కడ తలపోసుకుందాం... వారి ఆశయాలను తలకెత్తుకుందాం... వారిని తలపోసుకోవడమంటే చరిత్రలోకి ప్రయాణించడమే కాదు, భవిష్యత్తును దర్శించటం కూడా..! అలా దర్శించగలిగినప్పుడు వారి ప్రతి అస్తమయం ఓ మహోదయంగా సాక్షాత్కరిస్తుంది...! ఎందుకంటే.., ఆ జ్ఞాపకాలు కేవలం గతానికి చెందిన జాడలు మాత్రమే కావు... వర్తమానానికి కర్తవ్యాలు.. రేపటికి భవితవ్యాలు.. అందుకే..ఆ అడుగుజాడలను ముద్దాడుదాం.. ఆ అసమాన త్యాగాలను గుండెలకద్దుకుందాం.. ఆ ఘనమైన వారసత్వానికి గర్వపడదాం..
ఈ నేలమీద ప్రతి మనిషికీ శాంతి సౌఖ్యాలను కలగనడమే కాదు.. ఆ కలల సాకారానికి ప్రజాయుద్ధమై సాగిన ఆ జాతియోధులు మార్క్సిజం లెనినిజాలకు నిర్వచనాలు... మట్టికి యుద్ధం నేర్పిన మహావీరులు.. అసంఖ్యాకులైన అన్నార్తుల కన్నీటిలో తడిసిముద్దయిన గడ్డి పువ్వులు.. వారి ఆకలినే ఆయుధంగా మలిచిన అగ్గిరవ్వలు.. ఆకలీ కన్నీళ్లన్నవి లేని మరో ప్రపంచ నిర్మాణమనే మహోన్నత లక్ష్యానికి నిబద్ధులైన ఆ మహనీయులు ఒక్కరా ఇద్దరా... ఎందరో 'ధీర' చరితులు. ఒక్కొక్కరు ఓ అగ్నికణం... దోపిడీపై పోరాటమే వారిది అనుక్షణం...
సమానత్వం కోసం చేతులు చాచి అడుగాలా..?
హక్కుల కోసం ప్రాధేయపడాలా..?
స్వేచ్ఛ కోసం బలిపీఠమెక్కాలా..? అది కుదరదని చెప్పిన ధిక్కార స్వరాలు వాళ్లు.. స్వేచ్ఛను వద్దనుకుని కాదు సుమా..! స్వేచ్ఛకోసమే ..! స్వేచ్ఛను కోరుకోనివారు ఎవరుంటారు..? బతుకు కంటే స్వేచ్ఛ గొప్పది కదా..! అందుకే అది అందరి ఆకాంక్ష. అయితే ఆ స్వేచ్ఛా సమానత్వాలు ఒకరిచ్చేవి కాదు.. మరెవరి దయతోనో వచ్చేవీ కాదు.. అవి పోరాడి గెలుచుకోవాల్సిన హక్కులని చెప్పిన సాహసం వారిది... పోరాటమంటే పచ్చని చెట్ల మీద కూర్చుని ఎడారుల గురించి పాడటం కాదు... ఎడారుల్లో పచ్చదనం కోసం పాటుపడటం. ముళ్లూ రాళ్లూ అవాంతరాలెన్నొచ్చినా ఆగకుండా సాగిపోవడం. కష్టాలతో కలిసి నడవటం... కన్నీళ్లతో సావాసం చేయటం. ఆ కష్టాలకు ధైర్యం చెప్పి, కన్నీళ్లకు చైతన్యమిచ్చి కత్తులకెదురుగా కవాతు చేయించటం. కడుపుల దుఖ్ఖాన్ని కసిగా మార్చి అమ్ములపొదిలో దాచిపెట్టడం.. ఆ దుఖ్ఖానికి కారణమైన రక్కసి మూకలను దిక్కులు దాటించడం.. పోరాటమంటే శిశిరాలూ వసంతాలే కాదు, అజ్ఞాత ఏకాంతాలూ ఆత్మీయుల వియోగాలను సైతం తట్టుకుని నిలబడటం. నిర్బంధాలు, జైలు గోడలు, విచ్ఛిన్నాలు మొదలైన ఆటుపోట్లనే కాదు, వెన్నుపోట్లకు కూడా వెరువకపోవడం. పోరాటమంటే లాఠీలతో పోటీపడటం.. తుపాకులకెదురు నిలవడం.. కత్తులకు నెత్తురులద్దటం... పోరాటమంటే చావును సవాలు చేయడం.. బతుకుకు అర్థం చెప్పడం. నింగిలో నిప్పులు కురుస్తుంటే నేలపై మొక్కలు నాటడం... జనం కోసం రణం కావడం.. తనను తాను సమర్పించుకోవటం.. ఇది అక్షరాల నిరూపించిన త్యాగధనులు వాళ్లు. ఆ త్యాగాల తడి ఆరని ఈ నేల నిండా ఎటు చూసినా వారి ముంచెత్తే జ్ఞాపకాలే... చరిత్ర పుటల నిండా వారి నెత్తుటి సంతకాలే..!
వారు స్వప్నించిన సామ్యవాదం ఇంకా సాధించవలసిన కర్తవ్యంగానే మిగిలి ఉండవచ్చు.. కానీ, ఈ నేలమీద స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఈ మాత్రం ఊపిరి తీసుకుంటున్నాయంటే అది వారి పోరాట ఫలితమే. ఈమాత్రం మానవహక్కులు ప్రజల అనుభవంలోకొచ్చాయంటే అది వారి త్యాగాల ఫలితమే. అందుకే వారు నేడు జనం గుండెచప్పుళ్లు.., నీతి నిజాయితీలకు, నిష్కళంకమైన రాజకీయాలకు అసలు సిసలు ఆనవాళ్లు.. ప్రజా కంటకుల పాలిట సింహస్వప్నాలై వారి వెన్నుల్లో వణుకు పుట్టించిన పోరుతల్లి ముద్దుబిడ్డలు.. హక్కులను నినదించి దిక్కులను ఎరుపెక్కించిన నేలతారలు.. నిశీధిలో ఉషోదయాలై ప్రభవించిన ఉద్యమ ప్రవాహాలు.. తెల్లదొరల ఉక్కు పిడికిళ్లలో చిక్కిన భారతమాత దాస్యశృంఖలాలను ఛేదించేందుకు స్వాతంత్య్ర సమరాంగణమై గెలిచినవాళ్లు... భూమికోసం, భుక్తికోసం మహత్తర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటమై నిలిచినవాళ్లు. సమతా మమతలు విరిసే సరికొత్త సమాజం కోసం జీవితకాలం పరితపించిన వాళ్లు... ఊర్లను ఊరేగింపులుగా కదిలించి దొరల చెరలకు చరమగీతం పాడినవాళ్లు.. గడీలను గడగడలాడించి కోట బురుజులపై జనాన్ని జెండాలుగా ఎగరేసినవాళ్లు. విప్లవశిఖరాలు.. విముక్తి పతాకాలు. ఇప్పుడు సామ్రాజ్యవాదం వేయిపడగల నాగుపామై విషం చిమ్ముతున్న తరుణాన... దోపిడీ తన రూపం మార్చుకుని సరికొత్త కుట్రలు పన్నుతున్న సమయాన...వారి జీవితాలు మనకు ఉత్తేజం కావాలి... వారి దీక్షా దక్షతలు మనకు దిక్సూచి కావాలి... వారి అనుభవాలు మనలను పదునెక్కించాలి.. అందుకే ఇక 'ధీర' లో ప్రతి సోమవారం ఆ మహనీయుల జ్ఞాపకాలతో కరచాలనం చేద్దాం... కర్తవ్యాలకు పునరంకితమవుదాం....
- రాంపల్లి రమేష్
సెల్ : 9014240251