Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాగ్యనగరం మిని ఇండియా.. దేశ, విదేశాలకు చెందిన ఎంతోమందిని అక్కున చేర్చుకున్నదీ నగరం... భిన్న సంస్కృతులకు... భిన్న భాషలకు ఆలవాలం హైదరాబాద్'. ఇక్కడి జీవన వైవిధ్యం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటలకందనిది. ఈ మధ్య నేను ఓ జర్నలిస్టు మిత్రుని దగ్గరికి జూబ్లీహిల్స్ వెళ్తాను. చాలాసేపు మాట్లాడుకున్నాము. అప్పటికి మద్యాహ్నమయింది. ఇక వెళ్తాను అనే సరికి మిత్రుడు ఏదైనా తిందామని అనడంతో ఆగిపోయాను. అతని ఆఫీసునుంచి తిన్నగా చెక్‌పోస్టు వైపు నడుచుకుంటూ వస్తుండగా పక్కనే ఓ ఫ్రూట్‌షాప్ కనిపించింది. అందులో జామకాయలు చాలా పెద్దగా లావుగా ఉన్నాయి. ఏంటీ ఇంత లావుగా ఉన్నాయని అడిగాను. సార్..! ఇవి సీమ జామకాయలు. హైబ్రీడ్ రకం.. అని చెప్పాడు షాపతను. ఒక్కోటి అరకిలోకు పైనే ఉంది. కిలో రూ.180 అని చెప్పిన షాపతను బేరం మూలంగా కిలో రూ.160కి ఇచ్చాడు. మావాడికి బై చెప్పి వస్తుంటే దారిలో నారాయణగూడ చౌరస్తాలో అవే జామకాయలు బండిమీద కనిపించాయి. ఉండబట్టలేక బండాపి ధర అడిగాను. సార్...! ఇవి చాలా కాస్ల్టీ.. సీమ జామకాయలు కిలో రూ.120 అన్నాడు. కొనడం ఇష్టంలేదు కాబట్టి ఎనభైకి ఇస్తావా అనుకుంటూ బయలుదేరుతుంటే సార్ అంత తక్కువ గిట్టుబాటు కాదు వంద చేసుకోండి అంటుండగానే ఆగకుండా వచ్చేశాను. ఒకేరకం జామ కాయలు జూబ్లీహిల్స్‌లో ఒక ధర.. నారాయణగూడలో ఒక ధర. ఎంత వైవిధ్యం.. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు వారి వారి స్థాయిని బట్టీ, ప్రాంతాన్ని బట్టీ బతుకును చూపించే గొప్ప నగరమనిపించింది... భళా భాగ్యనగరం..
-ఊరగొండ మల్లేశం