Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది హైదరాబాద్‌లోని దుర్గాభాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రి. అక్కడి ఓ గదిలో జనరల్ ఫిజీషియన్ రోగులను పరీక్షిస్తున్నారు. ఇంతలో ఓ వృద్ధ జంట ఆ గదిలోకి వచ్చింది. ప్యాంటూ, షర్టూ, పైన కోటు వేసుకున్న ఆ పెద్దాయనకు ఓ ఎనభై ఏండ్లు, చేతిలో ఎలాంటి ఊతం లేకుండా చక్కగా నడుచుకుంటూ వచ్చిన పెద్దావిడకు ఓ డెబ్బై ఏండ్లూ ఉంటాయి. గదిలోని కుర్చీల్లో తమ వంతు వచ్చేదాకా ఓపిగ్గా కూర్చున్న వారిద్దరూ నర్సు పిలవగానే.. మెల్లగా లేచి డాక్టరు వద్దకెళ్లారు. మొదట పెద్దావిడ ఆరోగ్యం గురించి వాకబు చేసిన వైద్యుడు, ఆమె తీసుకొచ్చిన మెడికల్ రిపోర్టులు చూసి మందులు రాసిచ్చి బయటకు పంపాడు. ఆ తర్వాత మన సోగ్గాడిని కూర్చోబెట్టి.. నాడిపట్టి చూశాడు. స్టెతస్కోప్‌తో ఊపిరి తీసుకుంటున్న విధానాన్ని పరిశీలించాడు. ఆఖర్లో ల్యాబ్ రిపోర్టులు పరిశీలించి... 'మీకు గతంలో కంటే బీపీ బాగా ఎక్కువవుతున్నది. ఉప్పు తినటం తగ్గించమంటే మీరు వినటం లేదు. సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మీకు నేను రాసిన మందులు పని చేయటం లేదు. అందువల్లే మాటిమాటికి అనారోగ్యం పాలవుతున్నారు... నా మాట విని ఉప్పు తినటం మానేయండి, కుదరకపోతే కొంచెం తగ్గించి వాడండి...' అని ఆ పెద్దాయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించాడు డాక్టర్ సాబ్. అయినా మన నవ యువకుడు వింటేనా...? 'మీరు ఎన్నయినా చెప్పండి సార్.. నాకు కూరల్లో ఉప్పు లేనిదే ముద్ద దిగదు. నాన్‌వెజ్‌లో అయితే ఇంకొంచెం ఎక్కువుండాల్సిందే. సాల్ట్ లేకపోతే నాకసలు తిన్నట్టే ఉండదు. ఈ మధ్య వాకింగ్ వెళ్లినప్పుడు కూడా సాల్ట్ బిస్కెట్లే తీసుకుని తింటున్నాను. ఉప్పు లేకుండా తినటం నా వల్ల కాదు...' అని ఆ ముసలాయన తడుముకోకుండా జవాబిచ్చారు. దానికి జనరల్ ఫిజీషియన్.. 'సరే ఆఖరి సారిగా మీకో మందు ఇస్తున్నాను. ఆ మెడిసిన్ మీకు కచ్చితంగా పని చేస్తుంది. మీ బీపీ, గీపీ అన్నీ పోతాయి...ఇమ్మంటారా...?' అని అడిగారు. దానికి 'ఓ ఎస్.. ఓకే... ఇవ్వండి...' అన్నారు పెద్దాయన. వెంటనే నర్సును కేకేసిన డాక్టర్... 'మనం ఎన్ని చెప్పినా ఈయన వినటం లేదు. ఈయన ఆరోగ్యం ఇక మన చేతుల్లో లేదు. అందుకని బయట కూర్చున్న వాళ్లావిడను పిలవండి... ఆమె ఈయనకు కరెక్టు మెడిసిన్.. పరిస్థితి మొత్తం ఆ పెద్దావిడకు వివరించి చెబుతాను...' అని చెప్పారు. వెంటనే కుర్చీలోంచి లేవబోయి మళ్లీ దాన్లోనే కూలబడ్డ ఆ పెద్ద మనిషి, నర్సు రెండు చేతులు పట్టుకుని... 'బిడ్డా.. నీకు దండం పెడ్తా... మా మిసెస్‌ను పిలవకు..నేను డాక్టర్ గారు చెప్పింది వింటా. ఉప్పు తగ్గించుకుంటా... ఆవిడను పిలిస్తే నా మీద ఫైటింగే...' అంటూ వేడుకున్నాడు. దీంతో అక్కడున్న ఇతర రోగులందరూ ఘొల్లున నవ్వారు.
- బి.వి.యన్.పద్మరాజు