Authorization
Mon Jan 19, 2015 06:51 pm
6
గత కాలాల్లో, మనుషులకు బతకడానికి ఒకటి, రెండు రకాల ఉత్పత్తులు మాత్రమే కావాలన్నా, వాటి కోసం అయినా, అవసరమైన శ్రమలు చేసి, ఆ ఉత్పత్తుల్ని తయారు చేసుకోవలిసిందే.
క్రమ క్రమంగా శ్రమలలో రకాలు పెరుగుతాయి. ఆ రకాల్ని బట్టి, ఆ శ్రమలు చేయవలిసిన కాలాలు, ఎక్కువో-తక్కువో అవుతాయి.
ఉత్పత్తులకు వుండే 2 రకాల విలువలు
ఉత్పత్తుల గురించి మొట్ట మొదట తెలుసు కోవలిసిన విషయాలు, ఉత్పత్తులకు వుండే 'ఉపయోగపు విలువా - మారకం విలువా' అనే వాటిని. ఏ ఉత్పత్తి అయినా, ఎందుకు ఉపయోగ పడుతుందో, అదే ఆ ఉత్పత్తికి వుండే 'ఉపయోగపు విలువ'. చెట్టు కింద దొరికిన ఒక పండు ఎందుకు ఉపయోగ పడుతుంది? - తినడానికి. అదే దాని 'ఉపయోగపు విలువ'. - అయితే, ఆ 'పండు'కి 'మారకం విలువ' ఏమిటి? - ఆ పండుని ఏ మనిషీ, ఏ 'శ్రమ' తోటీ తయారు చెయ్యలేదు. ఆ పండు కోసం కొన్ని శ్రమలు జరిగి వుంటే, శ్రమలు జరిగితేనే అది 'మారకం విలువ' గా లెక్కకు వస్తుంది. శ్రమలతో తయారైన ఒక ఉత్పత్తికి ఇంకో ఉత్పత్తితో 'మారకాలు' జరిగితేనే 'మారకం విలువ' కనపడుతుంది. వేరు వేరు మనుషులు, తమ శ్రమలతో తయారు చేసిన ఉత్పత్తుల్ని మార్చుకుంటేనే, దాని వల్ల, ఆ 2 ఉత్పత్తులకూ వున్న 'మారకం విలువలు' తెలుస్తాయి.
కుండకి వున్న 'ఉపయోగపు విలువ' ఏమిటి? - అది నీళ్ళు పొయ్యడానికి ఉపయోగపడుతుంది. లేదా, ఇంకే పదార్ధాలు పెట్టడానికైనా. అయితే, కుండకి 'మారకం విలువ' ఏమిటి? - కుండని ఇచ్చి, ఒక బుట్టని తీసుకుంటే, కుండకి మారకం వల్ల వచ్చిన విలువ బుట్టా బుట్టకి, మారకం వల్ల, వచ్చిన విలువ కుండా. కానీ, కుండకి మారకం జరగ లేదు కాబట్టి, దాని మారకం విలువ ఏమిటో తెలియదు. 'కుండ', ఎంత శ్రమ కాలంలో తయారైంది? - అంటే, ఆ శ్రమ కాలాన్ని, 'ఇన్ని గంటలు' అని చెప్ప వచ్చు. కానీ, దానికి డబ్బుతో మారకం జరగక పోతే, దాని 'మారకం విలువ' ఏమిటో, దాని 'ధర' ఏమిటో తెలియదు. 'మారకం' అనేది 'డబ్బు'తో జరిగితేనే, అది మొదటి వస్తువుకి 'ధర'.
'చెప్పుల జత'కి వున్న 'ఉపయోగపు విలువ' ఏమిటి? - అవి, పాదాలకు తొడుక్కోడానికి ఉపయోగపడతాయి. అయితే, చెప్పుల 'మారకం విలువ' ఏమిటి? వాటికి 'డబ్బు కాని' మామూలు వస్తువుతో మారకం జరిగితే, ఆ వస్తువే, చెప్పులకు 'మారకం విలువ'. అలాగాక, చెప్పులకు, డబ్బుతో మారకం జరిగితే, అది చెప్పులకు 'ధర'. అసలు, దేనితోనూ మారకం జరగక పోతే, ఆ మారకం విలువ తెలియదు.
ఏ ఉత్పత్తికి అయినా 'మారకం' జరిగితేనే, దాని మారకం విలువ ఏమిటో తెలుస్తుంది.
'మానవ సంబంధాలు' అంటే?
కుండ మనిషి, కుండని ఇచ్చెయ్యడం వల్ల, కుండ వెళ్ళి పోయి చెప్పులు వచ్చాయి అంటే, కుండ మనిషికి ఏదో మోసం జరిగినట్టు అర్ధమా? - కాదు. కుండ మనిషికి ఆ సందర్భంలో, కుండతో అవసరం లేదు. చెప్పులే అవసరం అయ్యాయి. అలాగే, చెప్పుల మనిషికి, చెప్పులతో అవసరం లేదు. కుండ తోనే అవసరం వుంది. అందుకే, ఆ ఇద్దరూ తమ ఉత్పత్తుల్ని మార్చుకున్నారు. ఇద్దరికీ, ఆ 'మారకం' వల్ల అవసరాలు తీరతాయి. ఆ ఉత్పత్తుల్ని తయారు చేసిన శ్రమ కాలాలు, సమానమే. వస్తువుల మధ్య 'మారకం' జరిగితే, ఒకరి వస్తువు ఒకరికి మారుతుంది, నిజమే. అక్కడ, నిజంగా జరిగిన విషయం, ఒకరి శ్రమతో ఒకరికి 'అవసరం' తీరడం! కాబట్టి, మారకం జరిగి, ఒకరి శ్రమని ఒకరు, వాడుకుంటారు. మానవ సంబంధాలలో ప్రారంభమైంది ఇదే. అంటే, మానవ సంబంధాలు, 'శ్రమల సంబంధాలు'.
ఒక మనిషి అనేక శ్రమలు చెయ్య లేడు. కొన్ని శ్రమలే చెయ్య గలడు. తను చెయ్యని ఉత్పత్తులు కావాలంటే, అది 'మారకాల' వల్లనే సాధ్యం.
కుండ, చెప్పులతో మాత్రమే మారాలనీ చెప్పులు, కుండతో మాత్రమే మారాలనీ ఇలాగే జరగాలని చెప్పడం కాదు. సమాజంలో మొత్తం 10 రకాల ఉత్పత్తులు వున్నాయంటే, వాటిలో ఒకటి అయిన కుండ, మిగతా 9 ఉత్పత్తుల్లో ఏది కావాలంటే దానితో మారవచ్చు. అంటే, దేన్ని కావాలంటే దాన్ని కొనవచ్చు. అంత శ్రమ తను చేసి వుంటే.
కుండ, బెల్లంతో మారాలంటే, కుండకి బదులుగా ఎంత బెల్లం వస్తుంది? కుండ ఎంత శ్రమ కాలంతో తయారైందో, ఆ శ్రమ కాలానికి తగినంత శ్రమ కాలం గల బెల్లం మాత్రమే వస్తుంది. అంతేగానీ, కుండకి బదులుగా తట్టెడు బెల్లం రాదు.
అలాగే, చెప్పుల జతకి, బంగారం గొలుసు రాదు.
మారకాలు, శ్రమ కాలాల సమానత్వాల్ని బట్టి మాత్రమే జరుగుతాయి.
'మారకాల పద్ధతి' ప్రారంభమైన కాలంలో, శ్రమ కాలాల అవగాహనే వుండదు. ఎవరికే వస్తువు అవసరమైతే, ఆ వస్తువు కోసం, తమ వస్తువుని ఇచ్చి వెయ్యడమే.
ఏదో ఒక ఉత్పత్తి, 'డబ్బు'గా ప్రారంభమైన తర్వాత, ఏ ఉత్పత్తి అయినా మొదట మారేది 'డబ్బు'గా వుండే ఉత్పత్తి తోనే. తర్వాత, ఆ డబ్బు ఉత్పత్తిని ఇచ్చి, తమకు కావలిసిన ఉత్పత్తిని తెచ్చుకోవడం.
అమ్మకాలూ, కొనడాలూ, ఎప్పుడు?
'డబ్బు' అనేది స్తిర పడిన తర్వాతే.
బంగారం, 'డబ్బు'గా మారిన తర్వాత.
మారకాలు, డబ్బుతో స్తిరపడిన తర్వాతే, 'అమ్మకాలూ-కొనడాలూ' అనే మాటలు ప్రారంభం అవుతాయి.
ఏదో ఒక ఉత్పత్తికీ, బంగారం ముక్కకీ డబ్బుతో మారకం అంటే, ఇది కూడా రెండు ఉత్పత్తుల మధ్య మారకమే.
'ధర' అంటే ఏమిటి?
బంగారం ముక్కలకు 'రూపాయలు' అనే డబ్బు పేర్లు వుంటాయి. 'కుండ'ని అమ్మితే, అలా వచ్చే బంగారం పేరు, 2 రూపాయలు కావచ్చు. చెప్పుల జతని కొనాలంటే, ఆ 2 రూపాయల్నీ ఇచ్చి, ఆ చెప్పుల్ని తీసుకోవచ్చు. అంటే, కుండ ధర, 2 రూపాయలు అయినట్టే, చెప్పుల ధర కూడా 2 రూపాయలే.
'డబ్బు'తో మారకాల వల్లే 'ధర' తెలుస్తుంది.
అసలు, 'ధర' అంటే ఏమిటి? ఒక ఉత్పత్తికి ఎక్కువ ధర వుండి, ఇంకో ఉత్పత్తికి తక్కువ ధరే వుండడం, జరుగుతుంది. అది, ఎందువల్ల? - ఇటువంటి ప్రశ్నలు, సమాజంలో, 2 వేల సంవత్సరాల కిందటి నించీ ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. కానీ, ఆ ప్రశ్నలకు సరైన జవాబులు, మార్క్సు - ఎంగెల్సుల ద్వారా తప్ప, అంత కన్నా ముందు సమాజానికి తెలియలేదు.
శారీరక శ్రమలూ, మేధా శ్రమలూ
శ్రమల్లో, శారీరక శ్రమలూ, మేధా శ్రమలూ - అనే తేడాలు వుంటాయి. 1 గంట శారీరక శ్రమకి తక్కువ మారకం విలువ వుంటే, 1 గంట మేధా శ్రమకి ఎక్కువ మారకం విలువ వుంటుంది. ఎందుకంటే, ఆ శ్రమల్ని నేర్చుకోడానికి అవసరమయ్యే కాలాలూ, ఖర్చులూ, తేడాగా, తక్కువ - ఎక్కువలుగా వుంటాయి. నేర్చుకున్న శ్రమల్ని, చేసేటప్పుడు కూడా, వాటి కాలాలూ, ఖర్చులూ, తేడాగా వుంటాయి. ఉదాహరణకి, 'గడ్డి కోసే' 1 గంట శ్రమ విలువ కన్నా, 'కుట్టు పని' చేసే 1 గంట శ్రమకి ఎక్కువ విలువ వుంటుంది. అంతే గాక, 1 గంట వైద్యం శ్రమకైతే, ఇంకా ఎక్కువ విలువ వుంటుంది.
డబ్బు పేర్లు, ఒక్కో దేశంలో ఒక్కో రకంగా వుంటాయి, అక్కడ వున్న భాషని బట్టి.
'ఉపయోగపు విలువల' విషయంలో పోలికలు పనికి రావు. ఏది ఎక్కువ మంచిదీ, ఏది తక్కువ మంచిదీ - అనే ప్రశ్నలు పనికి రావు.
(ఇంకా వుంది)
రంగనాయకమ్మ