బీజింగ్: చైనా దేశం సొంతంగా దిక్యూచీ వ్యవస్థ(నావిగేషన్ సిస్టం)ను తయారుచేసుకుంది. బెయిడో నావిగేషన్ సిస్టం పేరుతో తయారు చేసిన ఈ దిక్యూచీ వ్యవస్థను శుక్రవారం గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చివరి ఉపగ్రహాన్ని జూన్ 23న చైనా ప్రయోగించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు కావాల్సిన 35 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. అమెరికాకు చెందిన గ్లోబల్ పోజషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), రష్యా గ్లోనాస్, యూరప్ గెలిలీయో నావిగేషన్ వ్యవ్యస్థ కంటే ఇది అత్యాధునికమైనదని చైనా పేర్కొంది. 2035 నాటికి మరింత ఆధునిక, సమగ్రతను సంతరించుకుంటుందని చైనా తెలిపింది.