వాషింగ్టన్: అమెరికా ఆర్థికవ్యవస్థ చరిత్రలో అత్యంత కనిష్టస్థాయికి దిగజారింది. ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకూ)లో ఆర్థిక వ్యవస్థ 32.9 శాతం క్షీణించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇది గతంలో సంభవించిన తీవ్ర ఆర్థిక సంక్షోభం కన్నా చాలా ఎక్కువ. 1932లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ 12.9 శాతం క్షీణించింది. అలాగే రెండో త్రైమాసికంలో 20 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యాయి. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ మొత్తంగా 3 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. '2020 రెండో త్రైమాసికంలో అమెరికా జీడీపీ చరిత్రలోనే అత్యంత వేగంగా పతనమైంది' అని ఎకనామిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ తెలిపింది. కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడంతో నిరుద్యోగ ప్రయోజనాలు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రజలు ఆహారం, ఇతర వస్తువుల కోసం క్యూ లైన్‌ల్లో నిలుచుంటున్నారు. ఇలాంటి దృశ్యాలు ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభం పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి. కరోనా ఉధృతి ఇలాగే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదు : గ్లోబుల్ టైమ్స్ కరోనా ఉధృతి దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదని గ్లోబుల్ టైమ్స్ హెచ్చరించింది. వాస్తవాలను తిరస్కరించడమే అమెరికా సమస్య అని పేర్కొంది. ట్రంప్ పరిపాలన ప్రధానంగా రెండు తప్పులు చేస్తుందని తెలిపింది. 'కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరా టంలో అమెరికా వైఫల్యానికి చైనాను నిందించడం, కరో నాపై గొప్పగా పోరాటం చేస్తున్నాం.. పద్దతులను మార్చు కోనవసరం లేదు' అనే తప్పును, అలాగే, మహమ్మారిని నియంత్రించకుండా ఆర్థిక వ్యవస్థను ప్రారంభించడం విజయవంతమవుతుందని అమెరికా భావిస్తుందని తెలిపింది. ఈ తప్పులకు అమెరికా ఇప్పటికే 1,50,000 మరణాలను చెల్లించిందని పేర్కొంది. అమెరికా ఈ విధంగా దిగజారడం చైనా ప్రజలు ఇష్టపడరని తెలిపింది. ఈ ప్రపంచంలో దేశాలు ఒకదానితో ఒకటి కోసం ఉన్నాయని తమకు తెలుసునని, ప్రమాదాలు, గందరగోళాల ద్వారా దేశాలు సంపాదించడానికి బదులు ప్రధాన దేశాల మధ్య క్రమబద్ధమైన పోటీ ఉండాలని కోరుకుంటన్నామని తెలిపింది. చైనా-అమెరికా మధ్య జీరో గేమ్‌తో ఏ దేశం కూడా ప్రయోజనం పొందదు అని స్పష్టం చేసింది. జీవితం కొన్ని దశాబ్దాలు మాత్రమేననీ, కాబట్టి చరిత్రకారులు మాత్రమే అంచనా వేసే ఫలితం పోటీపై దృష్టి పెట్టడం కంటే, ప్రజలు అభివృద్ధి చెందే జీవనోపాధిపై దృష్టి పెట్టడం రెండు దేశాలకు చాలా ముఖ్యమని తెలిపింది. ట్రంప్ పరిపాలన తప్పు మార్గంలో పయనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహమ్మారి కొనసాగితే కోరుకున్నది ఏమీ దక్కించుకోలేకపోవచ్చు. కాబట్టి ముందుగానే సర్దుబాటు చేసుకుని చైనాతో చేతులు కలపాలని సూచించింది. దీంతో ఎలాంటి ఆలస్యం లేకుండా కోవిడ్-19పై ప్రపంచ పోరాటం కొత్త రూపు తీసుకుంటుందని చెప్పింది. ఇది అందరికీ మంచిదని, ట్రంప్ పరిపాలనకు కూడా ప్లస్ అవుతుందని వెల్లడించింది.