డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జెనీవా: యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌తో యువతకూ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. యువకులు సైతం వైరస్‌కు అతీతంకాదనీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ అందరినీ ఇదివరకే అప్రమత్తం చేశామనీ, అయినప్పటికీ మరోసారి హెచ్చరిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. కోవిడ్-19 మహమ్మారితో వయస్సు పైబడినవారికి తీవ్ర ముప్పు ఉన్నట్టుగానే యువతకూ సైతం ప్రమాదం పొంచివున్నదని వెల్లడించారు. అందరిలాగే యువత సైతం అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తద్వారా వారిని వారు రక్షించుకోవడంతో పాటు ఇతరులను రక్షించిన వారవుతారన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంతో యువతదే కీలకపాతత్ర అని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి అధికమవుతున్న తీరును టెడ్రోస్ వివరించారు. అందరూ అప్రమత్తంగా ఉండి, తగిన రక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత దారుణంగా పరిస్థితులు దిగజారుతాయని హెచ్చరించారు. కరోనా పై చేస్తున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవలను ఆయన కొనియాడారు.