- యూఎస్‌లో నల్లజాతీయుల భారీ ర్యాలీ - ట్రంప్ టవర్ ముందు నిరసన ప్రదర్శన - పెద్ద ఎత్తున పాల్గొన్న బాధిత కుటుంబాలు - పోలీసు సంస్కరణలు చేపట్టాల్సిందేనని డిమాండ్ న్యూయార్క్: అమెరికాలో జాతి వివక్షకు గురవుతున్న నల్లజాతీయులు మరోసారి రోడ్లమీదకు వచ్చారు. జాత్యాహంకారానికి గురై శ్వేతజాతి పోలీసు మోకాలి కింద విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన జార్జి ఫ్లాయిడ్ మరణించి రెండు నెలలు కావస్తున్నా ఆయనకు న్యాయం జరగకపోవడాన్ని నిరసిస్తూ న్యూయార్క్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ నుంచి ట్రంప్ టవర్‌కు ర్యాలీ తీశారు. 'మా మెడపై మీ మోకాళ్లు తీయండి' అనే నినాదాలతో ఆ వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. నిరసనల్లో భాగంగా జాత్యాహంకారానికి గురైన బాధిత కుటుంబాలన్నీ ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. పౌర హక్కుల కార్యకర్త కెవిన్ మెక్‌కాల్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిన్ మాట్లాడుతూ... 'ఫ్లాయిడ్ మరణించి 66 రోజులు దాటింది. ఇంతవరకూ ఆయనకు న్యాయం జరగలేదు. ఒక్క ఫ్లాయిడే కాదు.. వందలాది మంది బాధిత కుటుంబాలు న్యాయం కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాయి..' అని అన్నారు. నల్లజాతీయుల్ని ప్రభావితం చేసే అన్ని సమస్యలను పరిష్కరించుకునేదాకా తాము న్యూయార్క్‌ను వదిలివెళ్లేది లేదని అన్నారు. దానికోసం ఎంతదాకైనా పోరాడతామనీ, అప్పటిదాకా వాషింగ్టన్ డీసీకి వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. పోలీసు సంస్కరణలు చేపట్టాల్సిందేననీ, హై ప్రొఫైల్ కేసులలో పారదర్శకత ఉండేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా తాము ఉపాధి కోల్పోతున్నామని కెవిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ల కారణంగా నల్ల జాతీయులు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారనీ, ఇప్పటికే చిన్న ఉద్యోగాల్లో ఉన్న తాము దీని కారణంగా మరింత నష్టపోయామని తెలిపారు. ఉపాధి లేకపోవడం కారణంగా యువకులు నేరాల వైపునకు మళ్లుతున్నారనీ, దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.