Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో కరోనా కేసులు
వాషింగ్టన్ : అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో మొత్తం కేసులు 50 లక్షలకు చేరువలో ఉన్నాయి. కరోనాతో 1,55,000 మంది చనిపోయారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలను పట్టించుకోకపోవడంవల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో రోజుకు సగటున 60 వేల కేసులు నమోదవుతున్నాయి. గత నెల జూలైలో రెండో భాగంలో రోజుకు 70వేలకు పైగా కేసులు నమోదయ్యేవి. వాటితో పోల్చుకుంటే ప్రస్తుత కేసులు సంఖ్య తగ్గినట్లుగా కనిపిస్తున్నా అనేక రాష్ట్రాల్లో కేసులు, మరణాలు అధికంగానే ఉన్నాయి. అలాగే గత రెండు వారాల నుంచి మరణాల సంఖ్య పెరిగిందని అసోసియేట్ ప్రెస్ నివేదిక తెలిపింది. గతంలో 780గా ఉన్న సగటు మరణాల సంఖ్య గత రెండు వారాల నుంచి 1,056కు చేరిందని నివేదిక తెలిపింది.
మరణాలు పెరుగుతున్నా కరోనా అదుపులోనే ఉందన్న ట్రంప్
కరోనా మరణాలు పెరుగుతున్నా పరిస్థితి అదుపులోనే ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో కరోనా వల్ల ఇప్పటికే 1,56,000 మంది చనిపోయారు. అమెరికన్ న్యూస్ వెబ్సైట్ సంస్థ ఆక్సియోస్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రభత్వ పని తీరు గురించి తానే పొగడుకున్నారు. కరోనాను కట్టడి చేయడంలో తన ప్రభుత్వం అమోఘమైన పాత్ర పోషించిందన్నారు. స్కూళ్లను వెంటనే తెరవాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. దేశంలో వైరస్ నిర్థారణ పరీక్షలు పెరుగుతున్న కారణంగానే కేసులు కూడా పెరుగుతున్నాయని ట్రంప్ చెప్పారు.