Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచానికే మార్గదర్శకం
- వరల్డ్ బ్యాంక్ ప్రశంస
బీజింగ్ : ఇతర ఆర్థిక వ్యవస్థలతో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపర్చడంలో చైనా సాధించిన విజయాలు ప్రపంచానికి పాఠాలు వంటివని ప్రపంచబ్యాంకు కితాబునిచ్చింది. 'చైనా డూయింగ్ బిజినెస్ సక్సెస్ : డ్రైవర్స్ ఆఫ్ రిఫార్మ్ అండ్ ఆపర్ట్యూనిటీస్ ఫర్ ది ఫ్యూచర్' పేరుతో విడుదల చేసిన ప్రత్యేక నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ విషయాన్ని పేర్కొంది. పరిపాలనను క్రమబద్ధీకరించడానికి, ప్రభుత్వ సేవలను అనుకూలంగా చేయడానికి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపర్చడానికి సంస్కరణలను ముందుకు తీసుకురావడంలో చైనా గొప్ప విజయాలు సాధించిందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో ప్రశంసించింది. ఇతర ఆర్థిక వ్యవస్థలతో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపర్చడానికి 'వ్యాపారం ప్రారంభించడం', 'విద్యుత్ పొందడం', 'నిర్మాణ అనుమతులకు వ్యవహరించడం' వంటి అంశాల్లో ఇటీవల సంవత్సరాల్లో చైనా చేసిన సంస్కరణలను నివేదిక ప్రస్తావించింది. ఇవి మొత్తం ప్రపంచ వ్యాపార వాతావరణాన్ని మెరుగుపర్చడానికి దోహదపడతాయని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే స్థిరమైన, సరసమైన, పారదర్శకమైన, ఊహజనితమైన వ్యాపారం నిర్వహించడానికి చైనా పాటుపడిందని నివేదిక తెలిపింది. ఈజీ డూయింగ్ బిజినెస్ పట్టికలో 2018లో 78వ స్థానం నుంచి 2020 నాటికి 31వ స్థానానికి దూసుకెళ్లిందని, వరసగా రెండేళ్లపాటు అత్యంత మెరుగైన ఆర్థిక వ్యవస్థల్లో టాప్ 10లో కొనసాగుతోందని తెలిపింది. ఉన్నత స్థాయి నాయకత్వం-యాజమాన్యం, స్థానిక విధాన ప్రయోగం, అంతర్జాతీయ నాలెడ్జ్ షేరింగ్, సంస్కరణల అజెండాను బలంగా అమలు చేయడం, ఫలితాల కోసం జవాబుదారీతనం, బలమైన ప్రైవేటు భాగస్వామ్యం- సమర్థవంతమైన కమ్యూనికేషన్ వంటి ఆరు కీలక విభాగాల్లో సంస్కరణలు చైనా విజయాలకు దోహదపడ్డాయని నివేదిక తెలిపింది. డిజిటల్ టెక్నాలజీస్, ఈ-గవర్నమెంట్ సేవలను గణనీయంగా వాడుకోవడం కూడా ఉపయోగపడ్డాయని తెలిపింది. సంస్కరణల అమల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) నిర్ణయాలను, ప్రణాళికలను చైనా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, రాష్ట్రాలు సమగ్రంగా అమలు చేశాయని నివేదిక తెలిపింది. సంస్థాగత లోపాలను తగ్గించడం, సేవలను- నియమాలను బలోపేతం చేయడం, వనరుల ప్రత్యక్ష కేటాయింపుల్లో-మార్కెట్ కార్యకలాపాల్లో ప్రత్యక్ష జోక్యాన్ని గరిష్టంగా తగ్గించుకోవడం చైనా నిర్వహించిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. కోవిడ్-19తో తీవ్రమైన సవాళ్లు ఉన్నప్పటికీ పని, ఉత్పత్తి, వ్యాపారం-మార్కెట్‌ను, సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను క్రమంగా పునరుద్ధరించడాన్ని చైనా ప్రోత్సహిస్తుందని నివేదిక తెలిపింది. ప్రస్తుత ఏడాదిలో రెండో త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం వృద్ధి సాధించి, కరోనా సంక్షోభంలో సానుకూల ఆర్థిక వృద్ధి సాధించిన తొలి ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, రెండో అర్ధభాగంలో ఆర్థిక పునరుద్ధరణ కొనసాగించడానికి బలమైన పునాది వేసుకుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.