Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశం నుంచి బంకర్లోకి ట్రంప్
వాషింగ్టన్: ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగానే వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఫైరింగ్ శబ్దం వినిపించటంతో ట్రంప్ మీడియా మాట్లాడటం ఆపేశారు. భద్రత సిబ్బంది అమెరికా అధ్యక్షుడి చుట్టూ వలయంగా నిలిచారు. వెంటనే ఆయన్ను బంకర్లోకి తీసుకెళ్లారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం సుమారు 5:50 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగుడ్ని వెంటనే హాస్పిటల్కు తరలించామనీ, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైట్ హౌస్ భద్రతా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..పెన్సిల్వేనియా అవెన్యూలోని 17వ వీధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్పులు జరిపారు. దుండగుడు మారణాయుధాలు ధరించి ఉన్నాడని వారు తెలిపారు. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలో ఓ మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు. తుపాకీ శబ్దం వినిపించడంతో...భద్రతా సిబ్బంది రైఫిల్స్ ధరించి వెంటరాగా ఆయన కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత సమావేశానికి తిరిగివచ్చిన అధ్యక్షుడు..శ్వేతసౌధం వెలుపల జరిగిన కాల్పుల ఘటన గురించి విలేకర్లకు తెలిపారు. అనుమానితుడ్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించినట్టు చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో, అతడి ఉద్దేశం ఏమిటో తెలియదనీ...అయితే అతడు ఆయుధాలు కలిగివున్నాడని ట్రంప్ వెల్లడించారు. వైట్ హౌస్ వెలుపల జరిగిన ఈ ఘటన ప్రభావం తనపై లేకపోవటంతో సమావేశం కొనసాగిస్తున్నానని వివరించారు. ఈ ఘటనతో కలవరం చెందారా అన్న విలేకర్ల ప్రశ్నకు..''ప్రపంచం ఎప్పుడూ ప్రమాదకరమైనదే. ఈ ఘటన ఏమీ ప్రత్యేకమైనది కాదు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వల్ల నేను చాలా సురక్షితంగా ఉన్నట్టు భావిస్తున్నా. వారు అద్భుతమైన వ్యక్తులు. అత్యంత విశిష్టమైన వారు'' అని ట్రంప్ పొగడ్తల్లో ముంచెత్తారు.