Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా డిస్ట్రిక్ జడ్జి కార్ల్ నికొలస్ మధ్యంతర ఉత్తర్వులు
వాషింగ్టన్ : అమెరికన్లు యాప్ స్టోర్ల నుంచి టిక్‌టాక్‌ను డౌన్లోడ్ చేసుకోవడాన్ని నిషేధిస్తున్న ప్రభుత్వ ఉత్తర్వును చివరి నిమిషంలో డిస్ట్రిక్జ్ న్యాయమూర్తి ఒకరు నిలుపుచేశారు. అమెరికా డిస్ట్రిక్ జడ్జి కార్ల్ నికొలస్ ఈమేరకు ప్రాధమిక ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల టిక్‌టాక్ యాప్ ఇంకా ఆపిల్, గూగుల్ స్టోర్‌ల్లో దొరుకుతుంది.
ఆదివారం అర్ధరాత్రి నుంచి నిషేధం అమల్లోకి రావడానికి కొద్ది సేపటి ముందుగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అంతకుముందు ఉదయం దీనిపై నికొలస్ దాదాపు 90నిముషాల సేపు విచారించారు. టిక్‌టాక్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, అమెరికాలో ఇంకా ఈ యాప్ అందుబాటులో వుండేందుకు గల కారణాలను వివరించారు.
ఈ కేసులో టిక్‌టాక్ మాతృ కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్ పక్షాన న్యాయమూర్తి నిలిచారు. మరికొద్ది గంటల్లో అమల్లోకి రానున్న నిషేధాన్ని నిలువరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా వాణిజ్య శాఖ ఆంక్షలు నవంబరు 12నుంచి అమల్లోకి రానున్నాయి. టిక్‌టాక్‌లో 20శాతం వాటా కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్, ఒరాకిల్ ప్రాధమికంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే దానికి చైనా ఆమోద ముద్ర వేయకపోతే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత టిక్‌టాక్‌పై పూర్తిగా నిషేధించే అవకాశాలు వున్నాయి. చైనా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎగుమతి లైసెన్స్‌కు దరఖాస్తు చేశామని బైట్‌డ్యాన్స్ గత వారం ప్రకటించింది. యూజర్ డేటా పట్ల సరైన నిర్వహణ లేదనీ, అమెరికన్లపై చైనా ప్రభుత్వం గూఢచర్యానికి అనుమతిస్తోందంటూ ఈ యాప్‌ను ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.
అయితే వాల్‌మార్ట్, ఒరాకిల్‌తో టిక్‌టాక్ ఒప్పందానికి ట్రంప్ ముందస్తు యోచనతోనే ఆమోద ముద్ర వేశారు. ఇది అమెరికాకు మంచిదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు భద్రత వంద శాతం వుంటుందని అన్నారు. అయితే ఈ ఒప్పందంలోని ప్రస్తావనాంశాలన్నీ ఇరు పక్షాలకు ఆమోదయోగ్యంగా వుంటాయా లేదా అనే విషయమై అనిశ్చితి కొనసాగుతునే వుంది.
ఒప్పందం కుదిరితే మంచిది, కుదరకపోతే మరీ మంచిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. గతవారం కాలిఫోర్నియా న్యాయమూర్తి ఒకరు వి చాట్ యాప్‌పై కూడా ఇటువంటి ఉత్తర్వులే ఇచ్చారు.