Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా సీనియర్ అధికారి వ్యాఖ్య
వాషింగ్టన్ : రెండవ త్రైమాసికంలో తీవ్రంగా కుంచించుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికన్నా చాలా వేగంగా పుంజుకుందనీ, అయితే ఉపాధి మాత్రం కరోనాకు ముందు స్థాయిలో వున్నట్టుగా 2023 వరకు పుంజుకునేట్టు కనిపించడం లేదని ఫెడరల్ రిజర్వ్ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. దాదాపుగా అందరూ ముఖానికి మాస్క్‌లు ధరించడం, ఎక్కువగా ఇండ్లకే పరిమితం కావడంతో కొత్తగా ఇన్ఫెక్షన్ల రేటు తగ్గిందనీ, ఫలితంగా అభివృద్ధి పుంజుకుంటోందని ఫిలడెల్ఫియా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షుడు పాట్రిక్ హర్కార్ తెలిపారు. వచ్చే ఏడాది మధ్య నాటికి వ్యాక్సిన్ కూడా విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామనీ, కానీ కరోనాను నియంత్రించడం చాలా కష్టసాధ్యమైన పనిగా వుందని అన్నారు. కరోనా పరిస్థితిపైనే ఆర్థిక వ్యవస్థ కూడా ప్రధానంగా ఆధారపడి వుందని అన్నారు. పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఇలాగే కొనసాగినా, కొత్తగా వైరస్ పెచ్చరిల్లడాన్ని నివారించినా కొంతకాలం పాటు పర్యాటక, ఆతిథ్య రంగాలు మందగమనంలోనే వుండడం తప్పదని అన్నారు. దీనితో అమెరికా స్థూల దేశీయోత్పత్తి, ఉపాధి అభివృద్ధి మొత్తంగా తగ్గుతుందని అన్నారు. అయితే కరోనాకు ముందున్నస్థాయిలో ఉపాధి అవకాశాలు పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదని బహుశా 2023 వరకు ఇలాగే వుండవచ్చని అన్నారు.
కరోనాతో ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావాన్ని తగ్గించేందుకు అదనంగా ఆర్థిక తోడ్పాటు అందించే విషయాన్ని పరిశీలించాలని అమెరికా చట్టసభలను కోరారు. ప్రపంచ జనాభాలో నాలుగు శాతం మాత్రమే అమెరికాలోవున్నా కరోనా మరణాలు మాత్రం దాదాపు 21శాతంగా వున్నాయని అన్నారు. కరోనాను ఎదుర్కొనడంలో మన అసమర్ధతే ఇందుకు కారణమన్నారు. 2.2లక్షల కోట్ల డాలర్ల రిలీఫ్ ప్యాకేజీని సోమవారం అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ప్రతిపాదించిన నేపథ్యంలో హర్కార్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. అధ్యక్ష ఎన్నికలకు ముందుగానే ఒక ఒప్పందం కుదిరేలా వైట్‌హౌస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు.