Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో, పరిశోధన, అభివృద్ధికి దోహదపడే అంతర్జాతీయ వేదిక కోవాక్స్లో గురువారం చైనా చేరింది. చైనా అభివృద్ధిపరిచిన కోవిడ్ వ్యాక్సిన్లను ప్రాధాన్యతాపరంగా వర్ధమాన దేశాలకు తొలుత అందచేయనున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునియాంగ్ తెలిపారు. కోవాక్స్ నెట్వర్క్ ద్వారా సంబంధిత దేశాలతో వ్యాక్సిన్ సహకారాన్ని మరింత పటిష్టపరుచుకుంటామని చెప్పారు. సురక్షితమైన, సమర్ధవంతమైన, సముచితమైన వ్యాక్సిన్లు అందుకోవడానికి వర్ధమాన దేశాలకు సమాన అవకాశాలు వుంటాయని ఆ విషయంపైనే తాము దృష్టి కేంద్రీకరిస్తున్నామని చైనా చెప్పింది. ప్రపంచదేశాలతో పోలిస్తే తమకు అనేక వ్యాక్సిన్లు అడ్వాన్స్డ్ పరిశోధన, ప్రయోగ దశలో వున్నా, ఉత్పత్తి సామర్ధ్యమున్నా కేవలం వర్ధమాన దేశాలకు అందజేసే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొవాక్స్లో చేరాలని నిర్ణయించినట్లు చెప్పారు. సామర్ధ్యం గల మరిన్ని దేశాలు ఇందులో చేరి మద్దతునివ్వాలని హువా కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యురోపియన్ కమిషన్, ఫ్రాన్స్లు కలిసి ఏప్రిల్లో ప్రారంభించిన ఎసిటి (యాక్సెస్ టు కొవిడ్ టూల్స్) యాక్సిలేటర్లోని మూడు స్తంభాల్లో కొవాక్స్ ఒకటి. సెప్టెంబరు 21నాటికి కొవిడ్ వ్యాక్సిన్ కేటాయింపు ప్రణాళికపై 156దేశాలు సంతకాలు చేశాయి. ఇప్పటివరకు అమెరికా ఇందులో చేరలేదు.