Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా బడ్జెట్‌పై కమ్యూనిస్టు పార్టీ విమర్శ
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా బడ్జెట్‌పై ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ పెదవి విరిచింది. భవిష్యత్ పట్ల ఎలాంటి దార్శనికత లేదా ప్రణాళిక లేదని అది విమర్శించింది. కార్మిక వర్గానికి ఈ బడ్జెట్లో చేసిందేమీ లేదని పేర్కొంది. ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్లతో, ఇంత భారీ బడ్జెట్‌ను రూపొందించేటప్పుడు ప్రజలకు మేలు చేకూర్చగలిగే అవకాశాలున్నా, వాటిని ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయిందని ఆస్ట్రేలియా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆండ్రూ ఇర్వింగ్ విమర్శించారు. ఆస్ట్రేలియాను మరింత ఉత్పాదకత దిశగా, చలనశీలమైన, నిలకడగల భవిష్యత్ దిశగా నడిపించే దార్శనికత అనేది ఇందులో కొంచెం కూడా లేదని విమర్శించింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చైనా, యూరప్ ఇతర దేశాలు చర్యలు తీసుకుంటున్నా, ఆస్ట్రేలియా మాత్రం అధ్వానమైన రీతిలో వుందని పేర్కొంది. సంక్షేమానికి కోత పెట్టి సైనిక వ్యయాన్ని పెంచేసిందని విమర్శించింది. పైగా భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ఈ బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. సామాజిక గృహ నిర్మాణానికి, చవకైన రీతిలో పరిశుద్ధమైన ఇంధనం పొందడానికి ఎలాంటి ప్రణాళికలు లేవని విమర్శించింది. బాలల, వృద్ధుల సంరక్షణకు ఎలాంటి పథకాలు లేవని, యువతకు ఉపాధి కల్పించే ప్రణాళికలేవీ లేవని ఇర్వింగ్ విమర్శించారు.