Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోయి బిడెన్ వస్తే వలసచట్టాలు మారుతాయా!
- గ్రీన్‌కార్డు నిబంధనలు సరళతరం చేస్తాం : డెమొక్రాట్ రాజా కృష్ణమూర్తి
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన మరుక్షణం నుంచి వలసదారులపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. వీసా నిబంధనల్ని క్రమంగా కఠినతరం చేస్తూ వచ్చారు. భారత్, చైనా, మెక్సికో..తదితర దేశాల నుంచి వృత్తి నిపుణుల రాకను వీలైనంతగా తగ్గించాలని ఆయన వ్యూహం పన్నారు. దాంతో ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, ఇతర వృత్తి నిపుణులు గ్రీన్‌కార్డు పొందటం గగనంగా మారింది. హెచ్1బీ వీసాలపైన ట్రంప్ సర్కార్ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. హెచ్1బీ వీసాదారు భాగస్వామి సైతం ఉద్యోగం పొందకుండా ట్రంప్ సర్కార్ నిబంధనలు కఠినతరం చేసింది.
గ్రీన్‌కార్డు ఎప్పుడొస్తుందా అని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారతీయ వృత్తి నిపుణులు ట్రంప్ సర్కార్ నిర్ణయాలతో డీలా పడ్డారు. గ్రీన్‌కార్డు వచ్చేట్టు లేదు..ఇండియాకు వెళ్లిపోవాల్సిందే అనే పరిస్థితి ట్రంప్ కల్పించారు. వర్క్ వీసా, గ్రీన్‌కార్డు నిబంధనలు కఠినతరం చేయటమేకాదు, చట్టపరంగా వాటికి ఆమోదముద్ర వేయించారు. దాంతో అమెరికా అంతటా వలసదారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివారందరికీ ఇప్పుడున్న ఒకే ఒక ఆశాకిరణం డెమొక్రాట్లు మళ్లీ అధికారంలోకి రావటం, జోయి బిడెన్ అధ్యక్షుడవటం. త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండటంతో ట్రంప్ ఓడిపోయి, జోయి బిడెన్ వస్తే వీసా నిబంధనలు మారుతాయని మనవాళ్లంతా ఆశపడుతున్నారు. డెమొక్రాట్ నాయకుడు, ఇల్లినాయిస్ నుంచి కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న రాజా కృష్ణమూర్తి చేసిన వాఖ్యలు సైతం అమెరికాలోని భారతీయుల్లో ఆశలు రేపాయి. జోయి బిడెన్ అధ్యక్షడవుతే, గ్రీన్‌కార్డుపై పొందటం సులభమవుతుందని, ఇతర నిబంధనలు మారుతాయని కృష్ణమూర్తి వెల్లడించారు.
అందరి లక్ష్యం..గ్రీన్ కార్డు పొందటమే
అమెరికాలో శాశ్వత నివాసానికి ఆస్కారం కల్పించే 'గ్రీన్‌కార్డు' పొందాలని ప్రతి హెచ్1బీ వీసాదారుడు కలగంటాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షడవడంతో...ఉన్న హెచ్1బీ వీసాను లాక్కోకపోతే చాలు..! అనే పరిస్థితి వచ్చిపడింది. కొన్నాండ్లయినా అమెరికాలో పనిచేయనిస్తే చాలు ! భారత్‌లోని తమ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని మనవాళ్లు భయపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు జోయి బిడెన్ అధ్యక్షుడైతే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మారుతాయని, గ్రీన్‌కార్డు పొందటం సులభతరమవుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉన్న బ్యాక్లాగ్ అంతా క్లియర్ చేస్తామని డెమొక్రాట్స్ పలు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. హెచ్1బీ వీసాదారు భాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని ట్రంప్ సర్కార్ రద్దుచేసింది. దీనిని పునరుద్ధరిస్తామని డెమొట్రాక్ కాంగ్రెస్ సభ్యుడు జయపాల్ చెబుతున్నారు.
చట్టపరమైన మార్పులు చేస్తాం : రాజా కృష్ణమూర్తి
జోయి బిడెన్ అధ్యక్షుడైతే , ఆయన ప్రభుత్వం అమెరికా వలస చట్టాల్ని కచ్చితంగా మార్చుతుంది. సెనెట్ ద్వారా చట్టాన్ని తీసుకొచ్చి అందరికీ మేలు చేస్తాం. సమగ్రమైన వలసదారుల చట్టాన్ని తీసుకొస్తాం. నాకా నమ్మకముంది.