Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్య సమితి : ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి జరిగిన ఎన్నికల్లో క్యూబా ఘన విజయం సాధించింది. క్యూబా అభ్యర్థిత్వంపై అమెరికా ఎంతగా దుష్ప్రచారం సాగించినప్పటికీ జనరల్ అసెంబ్లీ క్యూబాను తిరుగులేని మెజార్టీతో ఎన్నుకుంది. ఇది అమెరికాకు ఒక రకంగా చెంపపెట్టు అనే చెప్పాలి. 2021-23 పదవీ కాలానికి మానవ హక్కుల మండలిలో క్యూబా అభ్యర్థిత్వానికి జనరల్ అసెంబ్లీలోని మొత్తం 193 మంది సభ్యులకు గాను 170 మంది అనుకూలంగా ఓటు చేశారు. ఈ విజయంతో ప్రజల భాగస్వామ్యం, సామాజిక న్యాయం, మానవాళి హుందాతనం, పరస్పర అవగాహన, సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించడం, పెంపొందించడం వంటి అంశాల ప్రాతిపదికన ఏర్పడిన అంతర్జాతీయ వ్యవస్థ పట్ల క్యూబా తన నిబద్ధతను పునరుద్ఘాటించినట్లైందని ఐరాసలోని క్యూబా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇకనైనా క్యూబాపై బురద చల్లుతూ సమయం వృథా చేయడం మానుకోవాలని అమెరికా ప్రభుత్వానికి అది హితవు పలికింది. ప్రజలందరికి చెందిన అన్ని హక్కులను పరిరక్షించేందుకు క్యూబా తన కృషిని కొనసాగిస్తానని హామీ ఇచ్చింది. 2006లో ఏర్పాటైన మానవ హక్కుల మండలి వ్యవస్థాపక సభ్యురాలు అయిన క్యూబా రెండు పర్యాయాలు అంటే 2012 డిసెంబరు దాకా అందులో సభ్యురాలిగా కొనసాగింది. ఒక ఏడాది విరామం తరువాత మరో రెండు పర్యాయాలు (2014- 2016, 2017-2019) ఆ బాధ్యతలను నిర్వహించింది. 2006 మార్చి15న స్థాపించిన ఐరాస మానవహక్కుల మండలిలో ప్రస్తుతం 47 ఐరాస సభ్య దేశాలు ఉన్నాయి. వీరిని ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రత్యక్ష, రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటుంది.