Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్తృతంగా కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల యూనియన్
వాషింగ్టన్ : ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ర్యాలీల్లో అధ్యక్షుడు ట్రంప్ డ్యాన్స్ చేయవచ్చు, కానీ కరోనాపై పోరు నేపథ్యంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ అనుకున్న విధంగా జరిగినట్లైతే ఎన్నికల రోజు రాత్రి ట్రంప్ అలా డ్యాన్స్ చేయడానికి కుదరదు. నిద్ర లేని రాత్రే అవుతుంది. అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కొవిడ్ మహమ్మారిని చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఈ ఫ్రంట్‌లైన్ వర్కర్ల యూనియన్ అయిన సర్వీస్ ఎంప్లాయిస్ ఇంటర్నేషనల్ యూనియన్ (ఎస్ఇఐయు) ఎలాగైనా ట్రంప్‌ను ఓడించాలని చూస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో తీవ్ర స్థాయిలో ఓటర్లను కలుసుకుని ప్రచారం చేపట్టింది. ట్రంప్, పెన్స్ స్థానంలో జో బిడెన్, కమలా హారిస్‌లను గెలిపించాలన్నది వారి లక్ష్యంగా వుంది. వందలాదిమంది కార్మిక అనుకూల అభ్యర్ధులను పోటీకి నిలబెట్టాలని కూడా వారు భావించారు. ''మాకు డబ్బు వుంది. మార్గాలు వున్నాయి. ఈ దేశంలో వనరులు వున్నాయి. కానీ మాకు లేనిది ఒక్కటే నాయకత్వం. మా గురించి పట్టించుకునేవారు లేరు.'' అని పిట్స్బర్గ్కి చెందిన ఎస్ఇయుయు నర్సు అయిన మిచెలె బాయిలే వ్యాఖ్యానించారు. డెమోక్రాట్ల జాతీయ సదస్సు సందర్భంగా ఆమెను ఇంటర్వ్యూ చేయగా పై వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల సమీకరణపై యూనియన్ ఇప్పటివరకు 15కోట్ల డాలర్లకు పైగా ఖర్చు పెట్టిందన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఓటర్లను కలుసుకోవడం, ప్రచారం చేపట్టడం వంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. రికార్డు స్థాయిలో ఓట్లు ఎల్లా చెదురు కావడానికి కింది స్థాయి నుండి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇదంతా. అక్టోబరు 15-22 మధ్య పని ప్రదేశాలకు సమీపంలో వేలాదిమంది ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఎస్ఇఐయు ప్రజా కార్యాచరణ కార్యక్రమాలు నిర్వహించింది. ఫోన్లకు సందేశాలు పంపింది. ప్రచారం చేసింది.. అన్నింటికన్నా ఎక్కువగా ఇప్పటివరకు యూనియన్ సభ్యులు దాదాపు కోటీ 40లక్షల ఫోన్ కాల్స్, కోటీ 20లక్షల ఫోన్లకు సందేశాలు పంపారు. 40 రాష్ట్రాల్లోని దాదాపు 60లక్షల ఓటర్లను చేరుకునే విస్తృత ప్రణాళికలో భాగమే ఈ వారం రోజుల కార్యాచరణ.
ముఖ్యంగా కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, కొలరాడో, ఫ్లోరిడా, మిచిగన్, మిన్నెసొటా, నెవడా, వర్జీనియా, విస్కాన్సిన్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ఈ యూనియన్‌కు గణనీయమైన సంఖ్యలో సభ్యత్వం వుంది. యూనియన్ సభ్యుల్లో సగానికి పైగా మహిళలే, సగం మంది నల్ల జాతీయులే, వలస వచ్చినవారు ఎక్కువే, గంటకు 15డాలర్ల కన్నా తక్కువ సంపాదించే వారూ సగం మంది వున్నారు. ఉద్యోగ భద్రత పొందాలన్నా, అందరికీ ఆరోగ్య సంరక్షణ కావాలన్నా, గంటకు 15డాలర్లు సంపాదించాలన్నా, నల్లవారికి న్యాయం జరగాలన్నా వలసవచ్చిన కమ్యూనిటీలకు భద్రత కావాలన్నా వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవాలన్నా ట్రంప్‌ను గద్దె దింపడం తప్పనిసరని ఎస్ఇఐయు సభ్యులు స్పష్టం చేస్తున్నారు.