Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : అమెరికా ప్రభుత్వ దుష్ట నీచ, నికృష్ట చర్యలు, రహస్య దౌత్య వ్యవహారాలకు సంబంధించి వేలాది రహస్య పత్రాలను వికీలీక్స్ బయటపెట్టి రేపటికి పదేండ్లు. అంతర్జాతీయ కార్మిక వర్గంపై అమెరికా సామ్రాజ్యవాద నేరపూరిత కుట్రలను, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ ప్రభుత్వాల అవినీతికర చర్యలను ఈ పత్రాలు వెల్లడించాయి. ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల రహస్య సమాచారం, ఇరాకీల, జర్నలిస్టుల హత్యకు సంబంధించి అగ్రరాజ్య కుట్రలను వికీలీక్స్ బయటపెట్టింది.ఇందుకుగాను వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెను అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. అసాంజెకు ఇచ్చిన రాజకీయ ఆశ్రయాన్ని ఈక్వెడార్ ఉపసంహరించుకోవడంతో బ్రిటన్ ప్రభుత్వం అయనను అరెస్టు చేసి జైలులో పెట్టింది. అసాంజెను తనకు అప్పగించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నది. అసాంజెకు వ్యతిరేకంగా విష ప్రచారం, వేధింపులు ఇప్పటికీ కొనసాగుతునే వున్నాయి. ప్రస్తుతం అసాంజె లండన్‌లోని బెల్మార్స్ జైల్లో ఉన్నారు. ఒకవేళ ఆయనను అమెరికాకు అప్పగిస్తే గూఢచర్య చట్టాల కింద 175ఏళ్ళ శిక్ష పడేలా అక్రమ కేసులు బనాయించాలని చూస్తోంది. 2006లో థాయిలాండ్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన సైనిక కుట్రలో అమెరికా హస్తం ఉందని ఈ పత్రాలు తెలియజేస్తున్నాయి.. అలాగే 2009లో పాకిస్తానీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు గల అవకాశాల గురించి పాక్ సైనిక జనరల్‌తో అమెరికన్ అధికారులు చర్చించారు. 2009లో హౌండూరస్ అధ్యక్షుడు మాన్యుయెల్ జెలయాకు వ్యతిరేకంగా సైనిక కుట్రకు అమెరికా మద్దతిచ్చింది. ఆతర్వాత తలెత్తిన అణచివేత చర్యలను మాఫీ చేసేందుకు పనిచేసింది. 2010లో ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రూడ్ స్థానంలో జూలియా గిల్లార్డ్ను నియమించడంలో అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల పాత్రను అవి బయటపెట్టాయి. ఈజిప్ట్‌లో తన మిత్రుడు హోస్నీ ముబారక్ సాగిస్తున్న వేధింపులు, అరెస్టులు, హత్యలన్నింటి గురించి అమెరికా ప్రభుత్వానికి ముందుగానే తెలుసని ఈ కేబుల్స్ వెల్లడించాయి.