Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూబాలో పనిచేస్తున్న ఇండిపెండెంట్ మీడియా
హవానా : క్యూబాలో ఒక పద్ధతి ప్రకారం విధ్వంసం కొనసాగించేందుకు గానూ అమెరికా దీర్ఘకాలంగా కుట్రలు, కుతంత్రాలు పన్నుతునే వుంది. వాటిని నిగూఢంగానే కాదు, బహిరంగంగా కూడా అమలు చేయడానికి కూడా వెనుకాడదు. అందులో భాగమే విప్లవ ప్రతీఘాత డిజిటల్ ప్రచురణ (కౌంటర్ రివల్యూషనరీ డిజిటల్ పబ్లికేషన్స్)లని చెప్పవచ్చు. క్యూబాలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలపై అమెరికా ఆధిపత్య దృష్టిని చట్టబద్ధం చేసేందుకు ఈ మీడియా నెట్వర్క్ ప్రయత్నిస్తూ వుంటుంది. పకడ్బందీ వ్యూహంతో ఈ మీడియా సంస్థలు నిరంతరంగా సోషల్ నెట్‌వర్క్‌ను విషపూరితం చేయడానికి ప్రచారం సాగిస్తూ వుంటాయి. క్యూబాలో జరిగే ప్రతి విషయాన్ని వక్రీకరించి సోషల్ మీడియాకు సమాచారం చేరవేయడం వీటి పని. ఈ మీడియా నెట్‌వర్క్‌లు తమని తాము ''ఇండిపెండెంట్'' లేదా ''అల్టర్నేటివ్'' అని అభివర్ణించుకుంటాయి. సైబర్ క్యూబా, ఎడిఎన్ క్యూబా, క్యూబనోస్ పార్ ఎ ల్ ముండో, క్యూబానెట్ ఇలా పలు పేర్లతో చెలామణి అవుతున్న ఈ సంస్థలు విదేశాల్లోనే అదీ ప్రధానంగా అమెరికాలోనే వుంటాయి. గత 20ఏళ్ళలో ఈ సంస్థలకు వైట్‌హౌస్ నుంచి 50కోట్ల డాలర్లకు పైగా అందాయంటేనే ఈ మీడియా యంత్రాంగం శక్తి సామర్ధ్యాలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికా విదేశాంగ శాఖ, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ఏఐడీ), నేషనల్ ఎండో మెంట్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఈడీ) వంటి సంస్థలు ఈ నిధులను అందచేస్తాయి. ఈ నిధులను శీఘ్రగతిన అందుకోవడానికి వీలుగా ఈ సంస్థల్లో పలు సంస్థలు ఇతర దేశాల్లో ఎన్జీఓలుగా నమోదవుతాయి.
తమ గురించి ఏదైనా సమాచారం బయటకు పొక్కిన మరుక్షణం ఇవి వాటంతటవే రద్దయిపోతాయి. లేదా ఆ సమాచారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తాయి. ఆర్థిక సాయం, శిక్షణ, సాంకేతిక సాయం అనేవి వీటికి మూల స్తంభాలుగా వుంటాయని సెంటర్ ఫర్ హెమిస్పిరిక్ అండ్ యూఎస్ స్టడీస్‌కి చెందిన పరిశోధకుడు యాజ్మిన్ వాజ్క్వెజ్ వివరించారు.