Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్1-బీ వీసాలపై నిషేధం పొడిగింపు
వాషింగ్టన్ : అధ్యక్షుడిగా చివరి రోజుల్లోనూ ట్రంప్ మంకుపట్టు వీడలేదు. మరికొన్ని రోజుల్లో ఆయన అధ్యక్ష పీఠంపై నుంచి దిగిపోనున్న సమయంలోనూ ఆయన తన వివాదాస్పద నిర్ణయాలను పొడిగిస్తున్నారు. తాజాగా హెచ్1-బీ వీసాలపై ఉన్న నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో పాటు ఇతర విదేశీ వర్కు వీసాలు, గ్రీన్కార్డులపైనా నిషేధాన్ని పొడిగించారు. హెచ్1-బీ వీసాలను ఎక్కువగా వినియోగించే భారతీయ ఐటి నిపుణులపై ఈ ప్రభావం పడనుంది. అమెరికన్ కార్మికులను పరిరక్షించేందుకే ఈ చర్యలని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా నేపథ్యంలో ఇటువంటి ఆంక్షలను ఎందుకు విధించామో ఆ కారణాలైతే మారలేదని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్ 22, జూన్ 22 తేదీల్లో రెండుసార్లు వివిధ కేటగిరీలకు చెందిన వర్క్ వీసాలపై నిషేధాన్ని విధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబరు 31తో ఆ నిషేధం గడువు పూర్తవుతుండడానికి కొద్ది గంటలు ముందుగానే మళ్లీ మార్చి 31వరకు నిషేధం పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాకు ఇమ్మిగ్రెంట్లు రాకుండా వుండేందుకు చేసిన తాజా యత్నం ఇది. అయితే ఈ ఇమ్మిగ్రేషన్ విధానాలు సరికాదంటూ హెచ్-1బీ వీసాల సస్పెన్షన్ను ఎత్తివేస్తామని అధ్యక్షుడుగా ఎన్నికైన బైడెన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విదేశీ సిబ్బంది అమెరికన్ కంపెనీల్లో పనిచేయడానికి అనుమతించే ఈ వీసా స్టాంపింగ్ కోసం మార్చి నెలాఖరు వరకు వేచివుండాల్సిందే.