Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర దేశాల కంటే ముందుందన్న ఐఎంఎఫ్
వాషింగ్టన్ : కరోనా మహమ్మారి ప్రభావంతో తగిలిన ఎదురుదెబ్బల నుంచి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఇతర దేశాల కంటే చైనా అత్యంత వేగంగా పురోగతి దిశగా పయనిస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా 2021లో 8 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని తాజాగా అంచనా వేసింది. అయితే పురోగతి ఇంకా కొంత అసమతుల్యతో ఉందని, గణనీయమైన సమస్యలనే ఎదుర్కొంటోందని అభిప్రాయపడింది. ఐఎంఎఫ్‌కు చెందిన ఉన్నతాధికారి హల్జ్ బెర్గర్ శనివారం నాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చైనాలో రికవరీ ప్రధానంగా ప్రజల మద్దతులో ఇప్పటికీ సాగుతోందన్నారు. ఇటీవలి కాలంలో ప్రయివేటు పెట్టుబడులు పెరిగాయనీ, అయితే ఇదే సమయంలో వినియోయం ఇంకా కొంత వెనుకబాటులో ఉందని పేర్కొన్నారు. వృద్ధిరేట్లు, వినియోగం ఇటీవల కాలంలో పెరిగినా.. కరోనా సంక్షోభం ముందునాటి పరిస్థితులతో పోల్చుకుంటే ఇంకా తక్కువగానే ఉందని అన్నారు. ' 2020లో 2 శాతంగా ఉన్న చైనా వృద్ధిరేటు 2021లో 8 శాతంగా చూడబోతున్నాం. డిసెంబర్ నెలలో ఆర్థిక కార్యకాలాపాల్లో భారీ మెరుగుదల కనిపించింది' అని బెర్గర్ అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా సంక్షోభ ప్రభావం ఉన్నా ఆ దేశం కొన్ని నిర్మాణాత్మ సంస్కరణల్లో పురోగతి సాధించిందని, ఇతర దేశాలకు ఆర్థిక కార్యకలాపాలను తెరిచిందని అన్నారు. కరోనా సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనేందుకు చైనా ఇతర దేశాలకు సహకరించిందనీ, తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు రుణ ఉపశమనం కలిగించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. 'అయితే ఇదే సమయంలో చైనాకు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. దేశీయంగా కరోనా ప్రమాదం ఇంకా పొంచివుందనే చెప్పొచ్చు. బాహ్య వాతావరణం, కొన్ని దేశాలతో సంబంధాలు చైనాకు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి' అని చెప్పారు. చైనాకు ఇస్తున్న స్థూల ఆర్థిక విధాన మద్దతును ఎఎంఎఫ్ ఉపసంహరించుకోదని బెర్గర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.