Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ముందున్న సవాళ్ళను ఎదుర్కొనడంపై కమలా హారిస్
వాషింగ్టన్ : అమెరికా 46వ అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న జో బైడెన్ తన ముందున్న సవాళ్ళను అధిగమించడం అంత సులువేమీ కాదని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. బైడైన్తో పాటు కమలాహారిస్ కూడా అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. కరోనా విజృంభణతో అతలాకుతలమై పోతున్న దేశంలో ముందుగా మహమ్మారిని అదుపులోకి తీసుకురావాల్సి వుందని పేర్కొన్నారు. ఆ తర్వాత కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక దుస్థితిని పరిష్కరించాల్సి వుందని తెలిపారు. బుధవారం నుం చి పనిచేయడానికి మేం సన్నద్ధులమవుతున్నామని ఆమె ప్రకటించారు. చేయాల్సిన పనులు తమ ముందు చాలా వున్నాయనీ, వాటిని పరిష్కరించడం అంత సులభం కాదని అన్నారు. జనవరిలో మూడో సోమవారాన్ని జాతీయ సేవా దినోత్సవంగా పాటిస్తారు. ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు.
''మన ముందు బృహత్తర లక్ష్యాలున్నాయి. కఠోర శ్రమతో, అందరి సహకారంతో వాటిని సాధించగలమని విశ్వసిద్దాం'' అని హారిస్ పేర్కొన్నారు. అల్లర్లు జరుగుతాయని బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం సురక్షితమేనని భావిస్తున్నారా అని విలేకర్లు ప్రశ్నించగా, ప్రమాణ స్వీకారం చేసే ఆ క్షణం కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నాననీ, ఎంతో గర్వంగా ఆ వేదిక వద్దకు నడుచుకుంటూ వెళతానని ఆమె పేర్కొన్నారు. ఒక దేశంగా నేడు మనం ఎక్కడున్నామోనని వెనక్కి తిరిగి చూసుకుంటే ఆనాడు మార్టిన్ లూథర్ కింగ్ పౌర హక్కుల కోసం, వర్ణ వివక్షను రూపుమాపడం కోసం చేసిన పోరాటం ఇంకా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఈ అన్యాయాలను, అసమానతలను పరిష్కరించడం సమిష్టి బాధ్యత అని మనం గుర్తించాలన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ వారసత్వంలో భాగంగా మనం మన బాధ్యతలను సమిష్టిగా నెరవేర్చాల న్నారు. అవసరంలో వున్నవారికి సేవలందించడం మన కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు.