లిస్బన్ : ఆదివారం జరిగిన పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసా తిరిగి ఎన్నికయ్యారు. మధ్యే మితవాద అభ్యర్ధి అయిన మార్సెలోకు 61.6 శాతం ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి సోషలిస్టు ఛాలెంజర్ అనా గోమ్స్ 12.24 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మితవాద అభ్యర్ధి ఆండ్రె వెంటురా మూడో స్థానంలో నిలిచారు. కరోనాపై పోరు సాగించడమే తమ ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యత అని విజయోత్సవ ప్రసంగంలో మార్సెలో ప్రకటించారు. ఆదివారంతో ముగిసిన గత వారంలో దేశంలో 85 వేల కేసులు నమోదవగా, 1,500 మంది మరణించారు. కోటికి పైగా జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే పోర్చుగల్‌లో మరణాల రేటు చాలా అత్యధికంగా వుంది. కరోనా సమయంలో ఎన్నికలంటే ప్రజలు గైర్హాజరవచవ్చని భయాందోళనల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో 35.4 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోర్చుగల్ గత పది రోజుల నుండి రెండో లాక్‌డౌన్‌లో వుంది.