Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసన్షియన్ (పరాగ్వే) : పరాగ్వే ప్రతిపక్ష నేత ఎఫ్రెయిన్ అలెగ్రె జైలు నుంచి గురువారం విడుదలయ్యారు. 20 రోజుల క్రితం ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవాలని జారీ చేసిన ఉత్తర్వులను న్యాయమూర్తి రద్దు చేయడంతో ఆయనకు చెరసాల నుంచి విముక్తి లభించింది. పరాగ్వే అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థి అయిన అలెగ్రె న్యాయ వ్యవస్థ పక్షపాతానికి తాను బాధితుడినయ్యానని చెప్పారు. అధ్యక్షుడు మారియో అబ్డొ ప్రభుత్వ ప్రయో జనాలనే ఈ న్యాయ వ్యవస్థ నెరవేరుస్తోందని అన్నారు. ఆసన్షియన్లోని పోలీసు సెక్యూరిటీ గార్డు జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు. 2018లో అబ్డొతో పాటు అలెగ్రె కూడా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. తన ఎన్నికల ప్రచారానికి అయిన వ్యయానికి సంబంధించి తప్పుడు రసీదులు పెట్టారన్న ఆరోపణలను అలెగ్రె ఎదుర్కొంటున్నారు. రాజకీయ వేధింపులకు వ్యతిరేకిస్తూ ప్రజలు తన పట్ల చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞుడినని ఆయన వ్యాఖ్యానించారు. అబ్డొ అవినీతి పాలన నుండి దేశాన్ని బయటపడేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.