- ఆందోళనకారులపై సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం - కాల్పులు, భాష్పవాయు గోళాలతో దాడి.. ఏడుగురు నిరసనకారుల మృతి యాంగూన్ : మయన్మార్‌లో సైనిక పాలకుల ఆధీనంలో ఉన్న భద్రతా బలగాలు ఆదివారం మారణహోమం సృష్టించాయి. సూకీపై జరిగిన సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శలు చేస్తున్న ఆందోళనకారులపై బుల్లెట్ల వర్షం కురిపించాయి. ప్రధాన నగరమైన యాంగూన్‌తో పాటు ఇతర నగరాల్లో బలగాలు విచక్షణారహితంగా జరిపిన ఈ కాల్పుల్లో ఏడుగురు పౌరులు చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడుల్లో పోలీసులకు సైన్యం కూడా తోడయింది. పలు నగరాల్లో జరుగుతున్న ఆందోళనలను నిలువరించేందుకు పోలీసులు కాల్పులకు ముందుగానే నిరసనకారులపై గ్రెనేడ్‌లు విసరడంతో పాటు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. పెద్దయెత్తున పాల్గొన్న ప్రజలను చెదరగొట్టేందుకు పలు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినా, నిరసనకారులు ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. యాంగూన్ నగరంలోని హ్లెడాన్ సెంటర్ సమీపంలోని ఒక వీధిలో ఒక వ్యక్తి ఛాతిలోంచి బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన దృశ్యంతో కూడిన వీడియోను 'ది మయన్మార్ నౌ' మీడియా గ్రూపు పోస్టు చేసింది. కాల్పులపై ప్రత్యక్ష సాక్షి ఒకరు ఫ్రంటియర్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ, నిరసనకారులు హ్లెదాన్ ప్రాంతంలోని బస్టాండ్‌లో దాక్కున్నా.. వదలకుండా వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు చనిపోయారని తెలిపారు. దక్షిణ మయన్మార్‌లోని దవేరు నగరంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని స్థానిక రాజకీయ నేత మిన్ టైక్ రాయిటర్స్ మీడియా సంస్థకు చెప్పారు. బాగో పట్టణంలో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించారని ఒక అత్యవసర సేవల ఛారిటీ తెలిపింది.