Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యం అందరిదీ....
- అమెరికా పౌరసమాజం అభ్యున్నతి కోసమే పోటీ
- రోజ్‌వెల్ట్ ఐలాండ్‌లో హిల్లరీ క్లింటన్ ఉద్ఘాటన
న్యూయార్క్: కోటీశ్వరులు, కార్పొరెట్ యజమాన్యాల చేతుల్లో మగ్గేది అసలు సిసలైన ప్రజాస్వామ్యం కానే కాదని హిల్లరీ క్లింటన్ తీవ్రస్వరంతో అన్నారు. యూఎస్ మొదటి మహిళా అధ్యక్షరాలి పదవి కోసం పోటీ పడుతున్న 67 ఏళ్ల హిల్లరీ క్లింటన్ శనివారం భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రోజ్‌వెల్ట్ ఐలాండ్‌లో హాజరైన 5, 500 మంది ప్రజల సమక్షంలో ఉత్సాహపూరితంగా ఆమె ప్రసంగించారు. కొంతమంది సీఈఓలను, కోటీశ్వరులను వరించినంతమాత్రాన అది అభ్యున్నతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందాలనుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కని ఆమె నినదించారు. ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తూ ఆశావాహదృక్పథంతో ముందడుగు వేయాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. పౌరసమాజం విజయవంతం కానిదే అమెరికా విజయం సాధించలేదని ఆమె అన్నారు. అందరి సంక్షేమం కోసమే తాను యూఎస్ అధ్యక్షపదవికి పోటీపడుతున్నట్లు ఆమె చెప్పారు. హిల్లరీ క్లింటన్ భర్త యూఎస్ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, కుమార్తె చిల్సీ ఆమెకు మద్దతుగా నిలిచారు. క్లింటన్ కుటుంబసభ్యులందరూ ఒకేసారి ప్రజాబాహుళ్యంలోకి రావడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న అతిచిన్నవయస్కురాలిని కాకపోవచ్చు కానీ, యూఎస్ చరిత్రలోనే అతిచిన్న మహిళా అధ్యక్షురాలిగా, మొట్టమొదటి అమ్మమ్మగా సముచిత స్థానం దక్కించుకోవాలనుకుంటున్నానని ఆమె అన్నారు. నలభైఅయిదు నిముషాలపాటు ఆమె ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు క్రమక్రమంగా వేడిని పుంజుకుంటున్న నేపధ్యంలో రిపబ్లికన్లు ఇస్లామిక్ టెర్రరిజాన్ని భూతంగా చూపిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా...హిల్లరీ క్లింటన్ మాత్రం విదేశీవ్యవహారాలకు సంబంధించి చాలా తక్కువగా చెప్తున్నారు. అంతేకాదు, న్యూయార్క్‌లో సెనెటర్‌గా తాను బాధ్యతలు నిర్వర్తించిన సందర్భంలోని జ్ఞాపకాలు ఆమె ప్రసంగంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అలాగే, 2001 సెప్టెంబర్ 11వ తేదీనాటి దాడుల్ని కూడా ఆమె ప్రస్తావిస్తున్నారు. ఇదే సందర్బంలో అధ్యక్షురాలిగా అమెరికా ప్రజల రక్షణ కోసం శాయశక్తులా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. సరికొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని నిర్మించడం తన లక్ష్యంగా ఆమె చెప్తున్నారు. దాడుల భయంకన్నా సరికొత్త అవకాశాల్ని చేజిక్కించుకోవడంపైనే పనిచేయాల్సిన తరుణం ఇదని ఆమె స్పష్టం చేస్తున్నారు. అమెరికా అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన మాజీ అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సేవల్ని తలుస్తూ ఆమె నివాళి ఘటిస్తున్నారు. క్లింటన్ కూడా సమావేశాల్లో ప్రసంగిస్తూ స్ఫూర్తి నిస్తున్నారు.