Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఎక్కువైన లగేజీని అధికారులు అనుమతించకపోవడంతో బట్టలన్నీ ఒంటిమీద ధరించాడు ఒక యువకుడు. తీరా విమానం ఎక్కాక వేడి తట్టుకోలేక కుప్పకూలిన ఘటన లండన్‌లో చోటుచేసుకుంది. స్కాట్లాండ్లోని నార్త్ లాంక్షైర్కు చెందిన జేమ్స్ మెక్ ఎల్వార్ అనే 19 ఏళ్ల గాయకుడు రాక్ బ్యాండ్ బృందంతో గ్లాస్గో నుంచి లండన్‌కు వెళ్లాడు.
కార్యక్రమం అనంతరం తిరిగి గ్లాస్గో వస్తుండగా విమానాశ్రయంలో ఎక్కువగా ఉన్న లగేజీని అధికారులు అనుమతివ్వలేదు. దీంతో అతడు ఒకదాని మీద ఒకటి చొప్పున దాదాపు 12 దుస్తులను ధరించి ఈజీ జెట్ విమానం ఎక్కేశాడు. జేమ్స్ వేసుకున్న దుస్తుల్లో కొన్ని జంప్‌సూట్స్, జీన్స్, టీషర్టులు, చొక్కాలు వున్నాయి. రెండు టోపీలు కూడా. చాలా మందంగా బట్టలు వేసుకొని ఉండటంతో వేడి, చెమట ఎక్కువై అతడికి వూపిరి ఆడలేదు. దాదాపు గుండెపోటు వచ్చినంత పనైంది. శ్వాస తీసుకోవటం కష్టమై విమానంలోనే కుప్పకూలాడు. దీంతో విమాన సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు. ఈ విషయాన్నంతా మ్యూజిక్ రాక్ బ్యాండ్ ట్విట్టర్లో తెలిపింది. ఇది కాస్తా అక్కడి సోషల్ మీడియాలో పాపులర్ అయింది.