Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్‌స్కేల్‌పై 8.2గా నమోదు
- 38 మంది మృతి
- సునామీ హెచ్చరికలు జారీ
మెక్సికో సిటీ : గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో వచ్చిన భారీ భూకంపం ధాటికి మెక్సికో ప్రజలు వణికిపోయారు. రాజధాని మెక్సికో సిటీతో సహా పలు రాష్ట్రాల్లో నిమిషంకు పైగా భూమి తీవ్రంగా కంపించింది. పలు చోట్ల భవనాలు బీటలు వారటంతో ప్రజలంతా ఆరు బయటకు పరుగెత్తారు. ఈ భూకంపం 5 కోట్ల మంది ప్రజల్ని తీవ్ర భయానికి లోనుచేసిందని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో మీడియాకు తెలియజేశారు. భూకంపనాల కారణంగా పలు రాష్ట్రాలో భవనాలు కూలి 38 మంది చనిపోయారని, కేవలం ఒక్సాకా రాష్ట్రంలోని జుచిటా అనే నగరంలో 17 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. గత వంద ఏండ్లలో ఇలాంటి భూకంపాన్ని తాము చూడలేదని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో తెలిపారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.2గా నమోదైనట్టు అమెరికా భూగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మెక్సికో తీరంలోని ట్రెస్పికోకు 119 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభించింది. పిజిజియాపన్‌కు 123 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన ప్రకంపనలు రావడంతో మెక్సికో సిటీలోని భవనాలు బీటలు వారాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. దాదాపు 90 సెకండ్ల పాటు భవనాలు కంపించాయని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు న్యూజిలాండ్ అధికారులు సైతం తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశాలున్నాయా లేదా అనే దానిపై సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే చాలా దూరంలో ఉన్నందున న్యూజిలాండ్‌కు సునామీ వచ్చే అవకాశం లేదని న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ అండ్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వేలాది మందిని బలితీసుకున్న 1985 భూకంపం తర్వాత... మళ్లీ అంతటి స్థాయిలో భూకంపం రావడం ఇదే మొదటిసారి అని మెక్సికో అధికారులు చెబుతున్నారు.
తీరాన్ని తాకిన సునామీ అలలు
భూకంపం కారణంగా రానున్న మరికొన్ని గంటల్లో తీర ప్రాంతం వెంబడి భారీ అలలు ఎగసిపడే అవకాశం ఉండటంతో ఎనిమిది దేశాలకు సునామీ హెచ్చరికలను జారీచేసినట్టు యూఎస్ వాతావరణ అధికారులు వెల్లడించారు. మెక్సికో, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, కోస్టారికా, నిఖరాగ్వా, పనామా, హోండూరస్, ఈక్వెడార్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఊగిన విద్యుత్తు దీపాలు
భూకంపం ధాటికి మెక్సికో సిటీలో విద్యుత్తు దీపాలు ఊగిపోయాయి. ఓ బ్రిడ్జ్‌పై ఉన్న ల్యాంప్‌పోస్టులు అటూ ఇటూ ఊగుతూ కనిపించాయి. భూకంపం వచ్చిన సమయంలో వీధి దీపాలు ఒకటే తీరుగా షేక్ అయ్యాయి. మరోవైపు ఆ టైమ్‌లో రోడ్డుపై విపరీతంగా ట్రాఫిక్ ఉంది. పసిఫిక్ సునామీ హెచ్చరికల సెంటర్ అప్పటికే సునామీ హెచ్చరికల్ని జారీ చేశాయి. దాదాపు 3 మీటర్ల ఎత్తులో సునామీ వచ్చే అవకాశముందని కేంద్రం తెలియజేసింది.